అవినాష్ నాలుగో సారి! సీబీఐ ఎదుట వైఎస్ అవినాష్ రెడ్డి
posted on Mar 14, 2023 @ 1:15PM
తుది తీర్పు ఇచ్చే వరకూ అవినాష్ రెడ్డిపై తదుపరి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించిన ధైర్యంతో అవినాష్ రెడ్డి సీబీఐని పూచిక పుల్లలా చూస్తున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకే 14వ తేదీన సీబీఐ ముందు హాజరు కావాల్సి ఉంది. కానీ నేటి విచారణలో సీబీఐ ఎదుట హాజరు కావాలా వద్దా అన్నది సీబీఐనే అడగాలని హైకోర్టు చెప్పింది. దీన్నే అడ్వాంటేజ్‌గా తీసుకుని అవినాష్ రెడ్డి సీబీఐకి లేఖ రాశారు. మంగళవారం సీబీఐ విచారణకు హాజరు కాలేనని అవినాష్ రెడ్డి లేఖ రాశారు. .
పార్లమెంటు సమావేశాలు ఉన్నందున హాజరుపై మినహాయింపు ఇవ్వాలని కోరారు. అయితే అవినాష్ లేఖ పై సీబీఐ సానుకూలంగా స్పందించకపోవడంతో ఆయన మంగళవారం సీబీఐ విచారణకు హాజరయ్యారు. అరెస్ట్ ఉండదు కాబట్టి ఇక సీబీఐ విచారణకు వెళ్లకపోయినా పర్వాలేదనుకున్న అవినాష్ రెడ్డికి సీబీఐ హాజరు కావాల్సిందేనని స్పష్టం చేయడం ద్వారా షాక్ ఇచ్చింది. పార్లమెంట్ సమావేశాలున్నాయని చెప్పి విచారణకు డుమ్మా కొట్టాలన్న ఆయన వ్యూహం ఫలించలేదు.
ఇక అవినాష్ రెడ్డి పార్లమెంటు సమావేశాల హాజరు అంటూ సీబీఐ విచారణకు హాజరు కాలేననడం కేవలం సాకు మాత్రమేననీ, ఎందుకంటే పార్లమెంటులో ఆయన హాజరు శాతం 30 శాతమేనని పరిశీలకులు అంటున్నారు. కాగా మంగళవారం తాను విచారణకు హాజరు కాలేనంటూ అవినాష్ లేఖ రాసినా సీబీఐ హాజరు కావాల్సిందేనని అల్టిమేటం ఇవ్వడంతో అనివార్యంగా ఆయన సీబీఐ ఎదుట విచారణకు హాజరయ్యారు. తన ఇద్దరు న్యాయవాదులతో కలిసి హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయంలో ఆయన సీబీఐ విచారణను ఎదుర్కొంటున్నారు. వివేకా హత్య కేసులో సీబీఐ తనను విచారించే సమయంలో ఆడియో, వీడియో రికార్డ్ చేయాలని... అలాగే తనను అరెస్టు చేయకుండా సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలంటూ వైఎస్ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అవినాష్ పిటిషన్ ను విచారించిన సుప్రీం కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఒక్క అరెస్టు విషయంలో మాత్రం సీబీఐకి ఆదేశాలు జారీ చేస్తూ.. కేసు దర్యాప్తులో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది.
కేసు తుది తీర్పువెలువరించే వరకూ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయవద్దని సీబీఐని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే వైఎస్ వివేకానందర రెడ్డి ఈ రోజు సీబీఐ అవినాష్ ను విచారించి పంపించేస్తుంది. కోర్టు ఆదేశాల కారణంగా అరెస్టు చేసే అవకాశం లేదు. అయితే విచారణ సుదీర్ఘంగా సాగే అవకాశం ఉందని అంటున్నారు.