అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ టాప్! ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే ఛాన్స్
posted on Mar 3, 2021 @ 1:30PM
ఆంధ్రప్రదేశ్ అంటే ఒకప్పుడు అన్నపూర్ణ రాష్ట్రం. స్వర్ణాంధ్రప్రదేశ్ ఏపీ ప్రజల నినాదం. కాని ఇప్పుడు సీన్ మారిపోయింది. జగన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ అప్పుల రాష్ట్రంగా మారిపోయింది. అప్పు చేస్తేనే కాని రోజు గడవని పరిస్థితిలోకి వెళ్లిపోయింది. ఉద్యోగులకు వేతనాలు ఇవ్వాలన్నా అప్పు చేయాల్సిన దుస్థితిలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇదేదో ఊరికే చెప్పడం కాదు.. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ విడుదల చేసిన గణాంకాలే చెబుతున్నాయి. రాష్ట్రాలు తీసుకున్న రుణాల శాతంలో ప్రస్తుతం దేశంలోనే ఏపీలో టాప్ లో ఉంది.
2020-21 ఆర్థిక సంవత్సరంలో పది నెలల లెక్కలను విడుదల చేసిన కాగ్.. జనవరి నెలాఖరు వరకు ఏపీ రూ. 73,912.91 కోట్లను అప్పుల రూపంలో సమకూర్చుకున్నట్టు తెలిపింది. బహిరంగ మార్కెట్ నుంచి అప్పులు తీసుకోవడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నాలుగో స్థానంలో నిలిచింది. ఏప్రిల్ 2020 నుంచి డిసెంబరు వరకు రూ.44,250 కోట్లను.. ఏపీ ప్రభుత్వం బహిరంగ మార్కెట్ నుంచి రుణంగా సేకరించింది. ఇందుకోసం స్పెషల్ డ్రాయింగ్ సౌకర్యం, చేబదుళ్లు, ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని ఉపయోగించుకుంది. అంతేకాదు రాష్ట్రం తీసుకున్న అప్పులలో 42% కంటే ఎక్కువ గత రుణంపై వడ్డీని తిరిగి చెల్లించటానికి వెళుతుంది.
గత ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ రాబడి పెరిగినా.. రుణాలు కూడా భారీ స్థాయిలో పెరిగాయి. 2010-20 ఆర్థిక సంవత్సరంలో జనవరి నెలఖారు వరకు రెవెన్యూ రాబడి రూ. 85,987.04 కోట్లుగా ఉండగా, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.88,238.70 కోట్ల రాబడి ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో జనవరి నెలాఖరు నాటికి రూ.46,503.21 కోట్ల రుణం ఉంటే ఇప్పుడది ఏకంగా రూ. 73,912.91 కోట్లకు చేరింది. ఈ ఏడాది అప్పు అంచనాతో పోలిస్తే ఇది 153 శాతం అధికం. రాష్ట్రంలో ఖర్చు చేస్తున్న ప్రతి 100 రూపాయల్లో రూ. 45 అప్పుగానే సమకూర్చుకున్నట్టు కాగ్ విడుదల చేసిన గణాంకాలను బట్టి తెలుస్తోంది.
2020-21 ఆర్థిక సంవత్సరంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తన బడ్జెట్లో అంచనా వేసిన దానికంటే 142% ఎక్కువ అప్పు తీసుకుంది. 2020 డిసెంబర్‌లో కాగ్ ఇచ్చిన నివేదిక ప్రకారం 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్ర ఆర్థిక లోటు రూ .68,536 కోట్లు. 40,190 కోట్ల రూపాయల లోటుతో రాజస్థాన్ రెండో స్థానంలో ఉంది. ద్రవ్య లోటు పెరుగుదల అధిక వడ్డీ చెల్లింపులను సూచిస్తుంది. వడ్డీ చెల్లింపులు అభివృద్ధి కాని ఖర్చులుగా పరిగణించబడతాయి. ఇవి పన్ను చెల్లింపుదారుపై భారాన్ని కలిగిస్తాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం 13,406 కోట్ల రూపాయలను వడ్డీ చెల్లింపులు చేసింది.
జగన్ రెడ్డి సర్కార్ సంక్షేమ పథకాలను కొనసాగిస్తోంది. ఈ పథకాలను అందించడానికి పన్నులు పెంచుతోంది. అది చాలక ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేస్తోంది. రాష్ట్ర ఆదాయానికి రూ .9,000 కోట్లకు పైగా పన్నుల రూపేనా వస్తోంది. రాష్ట్రంలో ప్రతి వ్యక్తిపై పరోక్ష పన్నుల భారం ఎక్కువగా ఉంటుంది. పన్నుల ద్వారా వచ్చే రాబడి గత సంవత్సరంతో పోలిస్తే 176% పెరిగింది. వడ్డీ చెల్లింపులు పెరిగితే రాష్ట్రానికి మరింత భారమవుతుంది. వడ్డీని తిరిగి చెల్లించడం కోసం మరింతగా రుణాలు తీసుకోవాల్సి వస్తుంది. దీని ప్రభావం ఉత్పాదక పెట్టుబడిపై పడనుంది. ఇదే జరిగితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుప్పకూలిపోయే ప్రమాదం ఉందని ఎకనమిస్టులు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అత్యంత ప్రమాదకర పరిస్థితిలో ఉందని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. ఆదాయ లోటు మరియు ద్రవ్య లోటు బడ్జెట్ అంచనాల కంటే ఎక్కువగా ఉండటం చాలా డేంజర్ అంటున్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఆదాయ లోటు రూ .18,434 కోట్లుగా అంచనా వేయబడింది, అయితే ఇది 2020 డిసెంబర్ నాటికి రూ 49,809 కోట్లకు పైగా దాటింది. రాష్ట్ర వ్యయం మొత్తం ఖర్చులో సగం అప్పులకే వెళుతున్నాయి. ఇది ఆమోదయోగ్యం కాదంటున్నారు ఆర్థికవేత్తలు. అప్పుల ఉచ్చుకు ఇది స్పష్టమైన సూచన అని హెచ్చరిస్తున్నారు.
ఆర్థిక చిక్కులను అర్థం చేసుకోకుండా జగన్ మోహన్ రెడ్డి తన ఎన్నికల మ్యానిఫెస్టోను అమలు చేయడమే ఆర్థిక సంక్షోభానికి కారణమని ఏపీ మాజీ సీఎస్ ఐవై కృష్ణారావు చెప్పారు. ఇది భయంకరమైన పరిస్థితి అని.. ఆర్థిక వ్యవస్థ ఎప్పుడు కూలిపోతుందో చెప్పలేమన్నారు.