జగన్ కోర్టుకు వెళ్లక తప్పదా? హైదరాబాద్‌లో క్యాంప్ ఆఫీస్ రెడీ అందుకేనా?
posted on Dec 23, 2021 @ 11:03AM
ముఖ్యమంత్రి అయిన కొత్తలో జగన్ ప్రతీ శుక్రవారం నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యేవారు. వారం వారం కోర్టుకు వెళ్లే సీఎం అంటూ ప్రతిపక్షాలు తెగ సెటైర్లు వేసేవి. కొన్నాళ్లకు కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు తెచ్చుకున్నారు జగన్. రఘురామ పిటిషన్‌తో ఇప్పుడు మళ్లీ టెన్షన్ మొదలైంది. సీబీఐ కేసుల్లో రోజువారీ విచారణ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు చెప్పాల్సి ఉంది. అది రిజర్వ్‌లో ఉంది. వాదనలను బట్టి చూస్తే.. ఆ తీర్పు జగన్‌కు అనుకూలంగా వచ్చే అవకాశం లేదని న్యాయవాద వర్గాలు అంటున్నాయి. ముఖ్యమంత్రి అనే కారణంతో విచారణ నుంచి వ్యక్తిగత మినహాయింపు ఇకపై లభించకపోవచ్చని తెలుస్తోంది. తెలంగాణ హైకోర్టు తీర్పుపై జగన్‌లోనూ ఉత్కంఠ పెరిగింది. అందుకే కాబోలు.. ఎందుకైనా మంచిదని.. ముందస్తు ఏర్పాట్లలో ఉన్నట్టుంది జగన్. హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ సీఎం క్యాంప్ ఆఫీస్‌గా ఉన్న లేక్ వ్యూ గెస్ట్ హౌస్‌ను రెడీ చేస్తున్నారు. మైనర్ రిపేర్లు చేసి.. సరికొత్తగా ముస్తాబు చేస్తున్నారు.
హైదరాబాద్‌లోని లేఖ్ వ్యూ గెస్ట్‌హౌజ్. ఏపీ సీఎం క్యాంప్ ఆఫీస్. సడెన్‌గా అది ఎందుకు రెడీ చేస్తున్నట్టు? ముఖ్యమంత్రి మాత్రమే ఉపయోగించే ఆ క్యాంప్ ఆఫీసును ముస్తాబు చేస్తున్నారంటే.. అది ఆయన ఉండేందుకేగా? అంటే, జగన్ హైదరాబాద్‌లో ఉంటారా? ఉంటే ఎందుకు ఉంటారు? అంటే, హైకోర్టు తీర్పు తనకు వ్యతిరేకంగా వచ్చే అవకాశం ఉందనే అనుమానంతోనేనా? ఇకపై నాంపల్లి సీబీఐ కోర్టులో రోజువారీ విచారణకు హాజరు కావాల్సి వస్తుందనేనా? అంటూ చర్చ జరుగుతోంది.
ఇక్కడో డౌట్ రావొచ్చు. జగన్ హైదరాబాద్‌కు రావాల్సి వస్తే.. అక్కడే ఉండాల్సి వస్తే.. ఆయనకు ఇల్లు లేదా? లోటస్ పాండ్ ప్యాలెస్ లేదా? ప్రభుత్వ క్యాంప్ ఆఫీస్‌లో ఎందుకు ఉంటారని అనుకోవచ్చు. అయితే, ప్రస్తుతం లోటస్ పాండ్‌లో చెల్లి షర్మిల, తల్లి విజయమ్మ, బావ బ్రదర్ అనిల్‌కుమార్‌లు ఉంటున్నారు. జగన్ లోటస్ పాండ్‌లో ఉంటే.. వారికి ఎదురుపడక తప్పదు.. ముఖం ముఖం చూసుకోక తప్పదు. అది ఇష్టం లేకే.. వారికి తన ముఖం చూపించడానికి కూడా ఇష్టపడకే.. జగన్ ఏపీ సీఎం క్యాంప్ ఆఫీసును సిద్దం చేయిస్తున్నారని అంటున్నారు.
రాష్ట్ర విభజన తర్వాత లేఖ్ వ్యూ గెస్ట్ హౌస్‌ను ఏపీకి కేటాయించారు. అప్పటి సీఎం చంద్రబాబునాయుడు మొదట్లో అక్కడ్నుంచే కొంతకాలం పాలించారు. కొంతకాలం తర్వాత నవ్యాంధ్ర కోసం అమరావతి వెళ్లిపోయారు. ఆ తర్వాత క్యాంప్ ఆఫీసును పట్టించుకోలేదు. జగన్ సీఎం అయిన తర్వాత అందులో అడుగుపెట్టలేదు. సెక్రటేరియట్ భవనాలను తెలంగాణ సర్కార్‌కు అప్పగించిన జగన్.. లేక్ వ్యూ గెస్ట్ హౌస్‌ను మాత్రం ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉంచుకున్నారు. ఇప్పుడు హైదరాబాద్‌లోని ఆ ఏపీ సీఎం క్యాంప్ ఆఫీస్‌ను అధికారులు రెడీ చేస్తుండటం ఆసక్తికరంగా మారింది. త్వరలోనే తెలంగాణ హైకోర్టు తీర్పు రానుండటం.. రోజువారీ విచారణ, జగన్ వ్యక్తిగత హాజరు తప్పకపోవచ్చనే అనుమానంతోనే హైదరాబాద్‌లోని ఏపీ సీఎం క్యాంప్ ఆఫీస్.. లేక్ వ్యూ గెస్ట్ హౌజ్‌ను రెడీ చేయిస్తున్నారా? అని చర్చించుకుంటున్నారు.