క్లైమక్స్ సీన్లలో ప్రజాప్రతినిధుల ఓవర్ యాక్షన్
posted on Dec 16, 2013 @ 7:08PM
ఈరోజు మన ప్రజాప్రతినిధులు శాసనసభలో, శాసనమండలిలో, బయట కూడా వ్యవహరించిన తీరు వారి అసలు ప్రవర్తనకి అద్దం పడుతోంది. రాష్ట్ర విభజన బిల్లును ప్రవేశపెట్టినప్పటి నుండి ఉభయ సభలలో యుద్దవాతావరణం నెలకొంది. అది ఒకరినొకరు తిట్టుకొని కొట్టుకొనే వరకు కూడా వెళ్ళింది. సభ్యులందరూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యినందునే ఆవిధంగా వ్యవహరిస్తున్నరనుకోవడానికి వీలులేదు. ఉదయం నుండి సాయంత్రం వరకు సాగిన వారి పోరాటం, తమ తమ ప్రాంత ప్రజల దృష్టిని ఆకర్షించడానికే!
నిజానికి ఉభయ సభలలో బిల్లుపై చర్చమొదలుపెట్టి ఉండి ఉంటే, రాష్ట్ర విభజనపై ప్రజాభిప్రాయం చట్టసభలలో వ్యక్తమయ్యేది. కానీ మన ప్రజాప్రతినిధులు ప్రజాభిప్రాయానికి చట్టసభలలో అద్దం పట్టే కంటే తమ తమ పార్టీల వ్యూహాల మేరకే నడుచుకోవాలని భావించడంతో అందరూ ఈ క్లైమాక్స్ సీన్లలో అందరూ కూడా ఓవర్ యాక్షన్ చేసేస్తున్నారు. ఆవిధంగా చేస్తూ తమ పార్టీ సభ్యులే ఎక్కువ నిజాయితీగా, వీరోచితంగా పోరాడారని ప్రజలకు నిరూపించుకోవాలనే యావ వారిలో ప్రస్పుటంగా కనబడుతోంది.
బిల్లుపై చర్చ జరగకుండా అడ్డుకోవాలని సీమాంధ్ర ప్రజాప్రతినిధులు భావించడం సహజం. ఈవారంతో ముగిసే శాసనసభ శీతాకాల సమావేశాలలో ఎట్టి పరిస్థితుల్లో బిల్లుపై చర్చ జరగకుండా అడ్డుకొని, మళ్ళీ శాసనసభ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసి అప్పుడు కూడా వీలయినంత కాలం చర్చను పొడిగించగలిగితే సకాలంలో బిల్లు పార్లమెంటుకి చేరకుండా అడ్డుకోవచ్చని వారి ఉద్దేశ్యం కావచ్చు.
కానీ, బిల్లుపై వెంటనే చర్చ జరగాలని, వీలయినంత త్వరగా రాష్ట్రపతికి తిప్పి పంపాలని భావిస్తున్న తెలంగాణా ప్రజాప్రతినిధులు ఉభయ సభలలో బిల్లుపై చర్చ జరిగేందుకు సానుకూల వాతావరణం ఏర్పడేందుకు కృషి చేయకుండా వారు కూడా సీమాంధ్ర ప్రజాప్రతినిధులతో సమానంగా సభలో ఎందుకు రభస చేస్తున్నారు? అనే ధర్మసందేహం ఎవరికయినా కలగడం సహజం. వారు కూడా సీమాంధ్ర ప్రజాప్రతినిధుల ఎత్తులకి పైఎత్తులు వేస్తూ, వ్యూహాత్మకంగానే ఆవిధంగా వ్యవహరిస్తున్నట్లు భావించాల్సి ఉంటుంది.
ఉభయ సభలలో బిల్లుపై ఎటువంటి చర్చ జరగకుండా మరికొన్ని రోజులు అడ్డుకొంటూ యుద్దవాతావరణం కల్పించి, ఇక సభ నిర్వహణ అసాధ్యమని స్పీకర్ భావించేలా ఒత్తిడి తేగలిగితే, బిల్లుపై ఎటువంటి చర్చచేయకుండానే ఆయన ఇక్కడి పరిస్థితి వివరిస్తూ రాష్ట్రపతి ఇచ్చిన గడువుకంటే చాలా ముందుగానే బిల్లును రాష్ట్రపతికి త్రిప్పి పంపేసే అవకాశం ఉంది. ఆవిధంగా జరిగితే బిల్లుపై ఎటువంటి అభిప్రాయాలు నమోదు చేయబడలేదు కనుక ఇక రాష్ట్రపతి కూడా ఆ బిల్లుపై అభ్యంతరాలు లేవనెత్తే అవకాశం ఉండదు. ఆయన వెంటనే బిల్లును క్యాబినెట్ కు పంపితే అది అక్కడి నుండి పార్లమెంటుకు త్వరత్వరగా పరుగులు తీస్తుందని తెలంగాణా ప్రజాప్రతినిధుల ఆలోచన కావచ్చును.
కోట్లాది ప్రజల జీవితాలను ప్రభావితం చేసే ఒక సున్నితమయిన అంశంపై నిశితంగా స్పందించి, బిల్లులో లోటుపాట్లను గుర్తించి ఇరుప్రాంతాలకి నష్టం కలగకుండా శ్రద్ద వహించాల్సిన మన ప్రజా ప్రతినిధులు ఈవిధంగా తమ తమ పార్టీల ప్రయోజనాలను మాత్రమే దృష్టిలో ఉంచుకొని తమ వ్యూహ ప్రతివ్యూహాలతో ఉన్న కొద్దిపాటి అమూల్యమయిన సమయాన్ని దుర్వినియోగం చేయడం అవివేకం.
ఇప్పుడు బిల్లులో లోటుపాట్లను గుర్తించి తగు సవరణలను ప్రజా ప్రతినిధులు చేయకపోతే, ఆ బిల్లు ఎంత లోపభూయిష్టంగా ఉన్నపటికీ, అది యధాతధంగా పార్లమెంటుకి వెళ్ళిపోవడం ఖాయం. దానివల్ల ఇరుప్రాంతాల ప్రజలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది.
ఇంతవరకు ఈ రాష్ట్ర విభజన వ్యవహారంలో రాష్ట్రానికి చెందిన వ్యక్తులెవరికీ కూడా కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం కానీ, అభిప్రాయలు వ్యక్తం చేసే అవకాశం గానీ పొందలేదు. కానీ, ఇప్పుడు ఆ అవకాశం వచ్చినప్పుడు ఈవిధంగా దుర్వినియోగం చేయడం అంటే తమని ఎన్నుకొన్న ప్రజలను అపహాస్యం చేయడమే.