ఫుట్‌బాల్ రారాజు రొనాల్డొ.. 111 గోల్స్‌తో వాల్డ్ రికార్డ్..
posted on Sep 2, 2021 @ 12:39PM
ఫుట్‌బాల్. ప్రపంచవ్యాప్తంగా బాగా పాపులారిటీ ఉన్న గేమ్. ఫుట్‌బాల్ క్రేజ్, బిజినెస్, స్టార్‌డమ్ ముందు మన క్రికెట్ దిగదుడుపు. అలాంటి ఫుట్‌బాల్ ఆటలో కింగులాంటోడు రొనాల్డొ. ఆ స్టార్ ప్లేయర్ ఇప్పుడు మరో వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. ఫుట్‌బాల్ గేమ్‌లో తనంతటి మొనగాడు ఎవరూ లేరని నిరూపించుకున్నాడు.
అంతర్జాతీయ మ్యాచ్‌లో ఒక్క గోల్ కొడితేనే చాలా గ్రేట్. అలాంటిది.. ఒకటి రెండు కాదు.. ఏకంగా 111 గోల్స్ కొట్టిన తొలి ఆటగాడిగా రొనాల్డొ చరిత్ర సృష్టించాడు. జస్ట్ 111 యేనా.. అలాంటి సెంచరీలు మా క్రికెట్‌లో ఎంతోమంది ఎన్నోసార్లు కొట్టారని తక్కువగా అనుకునేరు. ఫుట్‌బాల్ గేమ్‌లో 111 గోల్స్ కొట్టడం నభూతో. అది కేవలం రొనాల్డొకే సాధ్యమైంది.
మైదానంలో తన విన్యాసాలతో అందరినీ ఉర్రూతలూగించే క్రిస్టియానో రొనాల్డొ సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. మొత్తంగా 111 గోల్స్‌తో అగ్రస్థానంలో నిలిచాడు. ఐర్లాండ్‌తో జరిగిన ప్రపంచకప్ అర్హత మ్యాచులో ఈ పోర్చుగల్ స్టార్ రొనాల్డొ రెండు గోల్స్ కొట్టి.. ఈ ఫీట్‌ను సాధించాడు.
బుధవారం జరిగిన మ్యాచులో 89వ నిమిషంలో రొనాల్డొ 110వ గోల్ నమోదు చేసి ఇరాన్ మాజీ స్ట్రైకర్ అలీ దేయి (109)ని అధిగమించాడు. ఆట మరో ఆరు నిమిషాల్లో ముగుస్తుందనగా రెండో హెడర్‌తో 111వ గోల్ కొట్టాడు. దీంతో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో ఒక దేశం తరఫున అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాడిగా చరిత్రలో నిలిచిపోయాడు. 180 మ్యాచులు ఆడి రొనాల్డొ ఈ రికార్డును సాధించాడు.
‘నాకెంతో సంతోషంగా ఉంది. కేవలం ప్రపంచ రికార్డు బద్దలు కొట్టినందుకే కాదు. మేమంతా కలిసి ప్రత్యేక సందర్భాలను ఆస్వాదించాం. ఆట చివర్లో రెండు గోల్స్ చేయడం తేలిక కాదు. అందుకే జట్టు కష్టపడ్డ తీరును నేను అభినందిస్తున్నా. ఆఖరి వరకు మేం గెలుస్తామనే నమ్మాం’ అని మ్యాచ్ ముగిశాక రొనాల్డొ అన్నాడు.
ఒక జట్టు తరఫున అత్యధిక గోల్స్ చేసిన వారిలో అలీ దేయి (109), మోఖ్తర్ దహారి (89), ఫెర్నిస్ పుస్కస్ (84), గాడ్‌ఫ్రే చిటాలు (79) రొనాల్డొ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. టీమ్‌ఇండియా ఫుట్‌బాల్ టీమ్ కెప్టెన్ సునీల్ ఛెత్రీ 74 గోల్స్‌తో 12వ స్థానంలో నిలవడం ఆసక్తికరం.