కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహం ?!
posted on Dec 5, 2022 @ 11:12AM
కాంగ్రెస్ పార్టీ కథ ముగిసింది. ఇక హస్తం పార్టీ తిరిగి అధికారంలోకి రావడం అయ్యే పని కాదు. అందుకే ..ఈ నిర్ణయం. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీని వదిలి కాషాయం కట్టిన మర్రి శశిధర్ రెడ్డి మొదలు, కాంగ్రెస్ చేయి వదిలిన ప్రతి నాయకుడు చెపుతున్న మాటే ఇది. గడచిన ఎనిమిది సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీని ఎంత మంది నాయకులు వదిలి వెళ్ళారో లెక్క లేదు. ముఖ్యంగా రాహుల్ గాంధీ నాయకత్వంలో 2019 లోక్ సభ ఎన్నికలలో కాంగ్రస్ పార్టీ వరసగా రెండవ సారి, రెండంకెల సంఖ్య దగ్గరే ఆగిపోయిన తర్వాత, ఎంతోమంది పార్టీ సీనియర్ నాయకులు క్యూ కట్టి బయటకు వెళ్ళిపోయారు.
ఈ (2022) సంవత్సరంలోనే గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, కెప్టెన్ అమరేందర్ సింగ్, సునీల్ ఝాకర్,ఆర్పీఎన్ సింగ్, అశ్వినీ కుమార్, హార్దిక్ పటేల్ ఇలా ఎంతో మంది ఉద్దండ నాయకులూ,కేంద్ర మాజీ మంత్రులు,మాజీ ముఖ్యమంత్రులు ఇంకా ఎంతో మంది కాంగ్రెస్ ను వీడారు. ఇలా పార్టీకి గుడ్ బై చెప్పిన వారంతా కాంగ్రెస్ పార్టీ వరస ఓటములకు, పార్టీ ప్రస్తుత దయనీయ స్థితికి రాహుల్ గాంధీని ఆయన చుట్టూచేరిన కోటరీని కారణంగా చూపిస్తున్నారు. అంతా మీరే చేశారు.. అంటూ రాహుల్ అండ్ కో ను వేలెత్తి చూపిస్తున్నారు. దోషులుగా బోనులో నిలబెడుతున్నారు.
గులాం నబీ ఆజాద్, పార్టీ వదిలి పోతూ పోతూ, అప్పటి పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఏకంగా ఐదు పేజీల సుదీర్ఘ లేఖ రాశారు. ఆ లేఖలో ఆయన ప్రధానంగా ప్రస్తావించిన అంశం కూడా ఇదే. “రాజకీయ అనుభవం లేని భట్రాజులు పార్టీని నడుపుతున్నారు, అదే పార్టీ సంస్థాగత బలహీనతకు మూలకారణం” అంటూ రాహుల్ గాంధీ పేరు ప్రస్తావించకుండానే ఆయన, ఆయన చుట్టూ చేరిన కోటరీని చాలా తీవ్ర పదజాలంతో విమర్శించారు.
అయితే, సీనియర్ నాయకులు పార్టీని వదిలి వెళ్ళినంత మాత్రం కాంగ్రస్ కథ ముగిసినట్లేనా, అంటే, 130 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న పార్టీని, చరిత్ర పుటల్లోంచి తీసేయడం అంత సులువైన విషయం కాదు. నడుస్తున్న చరిత్రలో ఒడిదుడుకులు ఉన్నా, పార్టీ చరిత్రకు చుక్క పెట్టేసి, చరిత్ర పుటల్లో కలిపేయడం సరి కాదని అనేవారున్నారు. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ చిగురించి, చరిత్ర సృష్టిస్తుందనే విశ్వాసం ఇంకా మిగిలే వుంది.
అదలా ఉంటే, ఓ వంక రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సాగుతుంటే, మరో వంక పార్టీ నూతన అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పునర్జీవన ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చత్తీస్‌ఘఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో 85వ ప్లీనరీ సమావేశాలను మూడు రోజుల పాటు నిర్వహించాలని, పార్టీ స్టీరింగ్ కమిటీ సమావేశం నిర్ణయించారు. కాంగ్రెస్ చీఫ్‌గా మల్లికార్జున్ ఖర్గే బాధ్యతలు చేపట్టిన అనంతరం పార్టీ అత్యున్నత నిర్ణాయక సంఘం వర్కింగ్ కమిటీ స్ధానంలో స్టీరింగ్ కమిటీ ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఏఐసీసీ ప్లీనరీ సెషన్, భారత్ జోడో యాత్రపై స్టీరింగ్ కమిటీలో విస్తృతంగా చర్చించారు.
అలాగే, వచ్చే (2023) జనవరి 26 గణతంత్ర దినోత్సవం నుంచి, ‘హాథ్ సే హాథ్ జోడో’ పేరిట భారీ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించాలని స్టీరింగ్ కమిటీ నిర్ణయించింది. ఈ ప్రచారోద్యమంలో భాగంగా గ్రామ పంచాయితీలు, పోలింగ్ బూత్‌లను కవర్ చేస్తూ బ్లాక్ స్ధాయి యాత్రలు చేపడతామని పార్టీ నాయకులు చెపుతున్నారు. నిజానికి కాంగ్రెస్ జెండా మోసే కార్యకర్తలు ఇప్పటికీ, ప్రతి గ్రామంలో ఉన్నారు. కానీ, నాయకులలోనే ఉత్సాహం కనిపించడం లేదని పార్టీ అభిమానులు అంటున్నారు.
దేశంలో కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్న మాట నిజం. నాయకత్వ సమస్య ఆ పార్టీని వెంటాడుతోంది. రాహుల్ గాంధీ 2019లో అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన తర్వాత నిండా మూడేళ్ళు, సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా పార్టీని నడిపిస్తూ వచ్చారు. చివరకు, సోనియా స్థానంలో మల్లిఖార్జున ఖర్గే పార్టీ అధ్యక్షునిగా, ఎన్నికయ్యారు. కానీ,గాంధీల నీడలో ఆయన ఏ మేరకు నిలబడ గలుగుతారు, ఏ మేరకు పార్టీని ముందుకు నడిపించగలుగుతారు, అనేది చూడవలసి వుంది.
కాంగ్రెస్ పార్టీ 2014 ఎన్నికలకు ముందు, కేంద్రంలో అధికారంలో వుంది. దేశంలో 9 రాష్ట్రాల్లో సొంతంగా అధికారంలో వుంది. ఈరోజు కేంద్రంలో అధికారంలో లేదు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు. అలాగే, కేవలం రెండు రాష్టాలు, రాజస్థాన్, చత్తీస్‌ఘఢ్ రాష్ట్రాలలో మాత్రమే అధికారంలో వుంది. ప్రస్తుత సంవత్సరం 2022 ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్,పంజాబ్, గోవా, మణిపూర్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ... మొత్తం ఏడు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే, సంవత్సరం ప్రారంభంలో ఉత్తర ప్రదేశ్, పంజాబ్ సహా ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాలలో ఒక్కటంటే ఒక్క రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు. ఇక తాజాగా ఎన్నికలు జరిగిన హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలో హస్తవాసి ఎలా వుందో మరో మూడు రోజుల్లో డిసెంబర్ 8 న తెలిపోతుంది. ఈ రెండు రాష్ట్రాలలోనూ కాంగ్రెస్ గెలిచే అవకాశాలు అంతగా లేవనే సర్వేలు చెప్పాయి. ఈ పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం సాధ్యమేనా? అంటే .. కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం సంగతి ఏమో కానీ, ఓక పార్టీగా కాంగ్రెస్ పార్టీ చిరంజీవిగా ఉంటుందని అంటున్నారు.