పంజాబ్ మ్యాజిక్ పునరావృతమౌతుందా? గుజరాత్ లో ఆప్ ప్రభావమెంత?
posted on Dec 5, 2022 @ 11:18AM
దేశమంతా ఆసక్తిగా గమనిస్తున్న,గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తుది విడత పోలింగ్ సోమవారం (డిసెంబర్ 5) ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, అలాగే, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అహ్మదాబాద్ లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అహ్మదాబాద్‌లోని రాణిప్‌లో గల పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.ప్రధాని మోడీ ఈ ఉదయం గాంధీనగర్ రాజ్‌భవన్ నుంచి అహ్మదాబాద్ చేరుకున్నారు.
రాణిప్‌లోని నిషాన్ పబ్లిక్ స్కూల్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికివచ్చిన మోడీ, కాన్వాయ్‌ను కొంత దూరంలో ఆపి నడుచుకుంటూ పోలింగ్ కేంద్రం వరకు వెళ్లారు. ప్రధానిని చూసేందుకు వందల మంది అభిమానులు రాగా.. దారిపొడవునా వారికి అభివాదం చేశారు. అనంతరం పోలింగ్ కేంద్రం వద్ద సామాన్య ప్రజలతో కలిసి క్యూలైన్‌లో నిల్చుని ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంతకుముందు.. ఈ ఎన్నికల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రధాని మోదీ ట్విటర్ వేదికగా పిలుపు నిచ్చారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా అహ్మదాబాద్ నారన్ పురాలోని ఏఎంసీ సబ్ జోనల్ ఆఫీస్ లో ఓటు వేశారు. అమిత్ షా కొడుకు బీసీసీఐ సెక్రటరీ జై షాతో పాటు ఇతర కుటుంబసభ్యులు సైతం ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రతి ఒక్కరు ఓటు వేయాలని అభ్యర్థించారు. ముఖ్యంగా తొలిసారి ఓటు వేస్తున్న యువతీ యువకులు ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.
ఇక గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అహ్మదాబాద్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. శైలజ్ అనుపమ్ పాఠశాలలోని పోలింగ్ కేంద్రానికి వచ్చిన సీఎం పటేల్ కూడా క్యూలైన్‌లో నిల్చుని ఓటేశారు. కాగా,రెండో విడతలో భాగంగా 14 జిల్లాల్లోని 93 నియోజకవర్గాలకు నేడు పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 833 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 2.51 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. 5.30 గంటలకు ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడికానున్నాయి. డిసెంబరు 8వ తేదీన గుజరాత్‌తో సహా హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నారు.
ఇంతవరకు గుజరాత్ లో కాంగ్రెస్, బీజేపీ మధ్య ద్విముఖ పోరు జరుగుతుంటే, ఈసారి తొలి సారిగా, ఆప్ బరిలో దిగడంతో త్రిముఖ పోటీ జరుగు తోంది అయితే, ఆప్ ప్రభావం ఏ మేరకు ఉంటుందనే విషయంలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆప్ ప్రభావం పట్టణ ప్రాంతాల్లో తప్పించి, గ్రామీణ ప్రాంతాల్లో పెద్దగా ఉండదని, అంటున్నారు. అయితే, ఆప్ అధినాయకత్వం మాత్రం పంజాబ్ మ్యాజిక్ పునరావృతం అవుతుందని గట్టి విశ్వాసంతో వుంది.