కవిత బిజీ.. సీబీఐ విచారణకు అగ్లా తారీఖ్
posted on Dec 5, 2022 @ 10:01AM
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు సీబీఐ నోటీసులు పంపిన క్షణం నుంచీ ఆమె విచారణ వ్యవహారం తెలుగు సినిమాలోని మలుపులను మించి తిరుగుతోంది. ఒక సస్పెన్స్ మూవీని తలపిస్తోంది. రాష్ట్రంలో సీబీఐకి జనరల్ కన్సెంట్ రద్దు అయినా.. సీబీఐ నోటీసులు పంపగానే ఎమ్మెల్సీ కవిత మా ఇంటికే వచ్చి విచారణ జరుపుకోండి అంటూ ఆహ్వానించేసింది. ఆ తరువాత తన తండ్రితో, న్యాయకోవిదులతో ప్రగతి భవన్ లో వరుస భేటీల తరువాత యూటర్న్ తీసుకున్నారు.
రిమాండ్ రిపోర్ట్ ను, ఎఫ్ ఐఆర్ కాపీనీ పంపితేనే విచారణకు అంగీకరిస్తానంటూ సీబీఐకి లేఖ రాశారు. ఆ లేఖపై స్పందనను బట్టి విచారణ విషయం ఆలోచిస్తానన్నారు. అయితే సీబీఐ ప్రాంప్ట్ గా కవిత లేఖకు స్పందించి రిమాండ్ రిపోర్ట్ ను, ఎఫ్ఐఆర్ కాపీనీ ఆమెపు అందజేసింది. ఆ విషయాన్ని కవిత స్వయంగా వెల్లడించారు. రిమాండ్ రిపోర్ట్ లో కవిత పేరు ప్రస్తావనకు రావడం వల్లే విచారణకు, కాదు కాదు ఆమె వివరణ తీసుకోవడానికి వస్తున్నామని సీబీఐ నోటీసులో స్పష్టంగా ఉంది.
ఇప్పుడు అదనంగా ఎఫ్ఐఆర్ కాపీలో తన పేరు లేదని కవిత స్వయంగా వెల్లడించారు. అంతే కాదు.. నిన్నగాక మొన్న మంగళవారం (డిసెంబర్ 6)న విచారణకు రెడీ అని ప్రకటించిన కవిత ఇప్పుడు ఆ తేదీన తాను బిజీగా ఉన్నానంటూ వచ్చే వారం.. అంటే డిసెంబర్ 11, 12, 13, 15 తేదీలలో ఎప్పుడైనా తనను విచారించేందుకు రావచ్చని సీబీఐకి వర్తమానం పంపారు. అయితే కవిత ఆఫర్ చేసిన ఈ తేదీలపై సీబీఐ ఎలా స్పందిస్తుందన్నది వేచి చూడాలి. సీబీఐ నోటీసులు అందుకున్న తరువాత శనివారం(డిసెంబర్3) ఉదయం ప్రగతి భవన్‌కు వెళ్లి తన తండ్రి , సీఎం కేసీఆర్‌తోనూ, ఆయన సమక్షంలో పలువురు న్యాయనిపుణులతోనూ చర్చించారు. ఆ చర్చల మేరకే ఎఫ్ఐఆర్ కాపీలు తీసుకోవాలని లేఖ రాశారు. ఆ లేఖ సమాచారాన్ని మీడియాకు విడుదల చేశారు.
ఈ నేపథ్యంలోనే సీబీఐ విచారణ సందర్భంగా ఫిర్యాదు కాపీలు, ఎఫ్ఐఆర్ కాపీలు కవితకు అందజేస్తే వాటిని పూర్తిగా చదివి అర్థం చేసుకోవాల్సి ఉంది కనుక సీబీఐ ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం ఇవ్విలేనని కవిత నిరాకరించే అవకాశం ఉం ఉందని తెలుగువన్ ముందే చెప్పింది. ఆ మేరకే ఇప్పుడు కవిత మంగళవారం (డిసెంబర్ 6)న తాను విచారణకు అందుబాటులో ఉండబోనని సీబీఐకి వర్తమానం పంపారు. విచారణను సాధ్యమైనంత వరకూ వాయిదా వేయడమే లక్ష్యంగా కవిత పావులు కదుపుతున్నారని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. ఇటీవల కేంద్ర భద్రతా సలహాదారు అత్యంత రహస్యంగా హైదరాబాద్ లో పర్యటించి వెళ్లడం, తెలంగాణలో మోస్ట్ ఇన్ ఫ్లుయెన్స్ డ్ పొలిటికల్ లీడర్లు సీబీఐ, ఈడీ, ఐటీ విచారణను ఎదుక్కొంటుండడానికి ఏమైనా లింకుందా అన్న కోణంలో పరిశీలకుల విశ్లేషణలు సాగుతున్నాయి.
కొందరు ప్రముఖులను ఈడీ, సీబీఐ అదుపులోనికి తీసుకునే అవకాశం ఉండటంతోనే అలా జరిగితే పర్యవశానాలు ఎలా ఉంటాయన్న విషయాన్ని ఆరా తీయడానికే అజిత్ దోవల్ తెలంగాణలో పర్యటించారని పరిశీలకులు సైతం భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీబీఐ అధికారులు వివరణ కోసం అని వచ్చి ఎక్కడ అరెస్టు చేస్తారో అని కవిత భావించడం వల్లనే విచారణకు అగ్లా తారీఖ్ అంటూ వాయిదా కోరుతున్నారని అంటున్నారు. నోటీసులో ఎఫ్ ఐఆర్ ప్రస్తావన లేకపోయినా దానిని కోరడం.. ఆ తరువాత ఎఫ్ఐఆర్ లో తన పేరు లేదంటూ కవిత మీడియాకు తెలియజేయడం వెనుక సీబీఐ విచారణ వెనుక ఉన్నది రాజకీయ కక్ష సాధింపే అని చెప్పాలని చూస్తున్నారని అంటున్నారు. సీబీఐ కానీ, మరే దర్యాప్తు సంస్థ అయినా కానీ విచారణ చేయడానికి ఎఫ్ ఐఆర్ లో పేరు ఉండాల్సిన అవసరం లేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కవిత ఆఫర్ చేసిన కొత్త తేదీలపై సీబీఐ ఎలా స్పందిస్తుందన్న ఆసక్కి సర్వత్రా నెలకొని ఉంది.