ఖేడ్‌లో ఖేల్ ఖతం!
posted on Feb 16, 2016 @ 1:43PM
ఖేడ్ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. 53 వేల భారీ మెజారటీతో తెరాస అభ్యర్థి ఎం.భూపాల్ రెడ్డి ఖేడ్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. దీంతో సిట్టింగ్ స్థానాన్ని సైతం దక్కించుకోలేని పరిస్థితులలో తెలంగాణ ప్రతిపక్షాలు ఉన్నాయన్న విషయం తెలిసివస్తోంది. అధికార పక్షాన్ని కాదని తెలంగాణ వాసులు రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగా లేరన్న సందర్భమూ స్పష్టమవుతోంది. తెలంగాణలో ప్రస్తుతం తెరాసకి తిరుగులేదన్న విషయం మొన్నటి గ్రేటర్ ఎన్నికలలోనే తేలిపోయింది. అలాంటి సందర్భంలో ఖేడ్ ఉప ఎన్నికల విషయంలో కాంగ్రెస్ మరింత పోరాడి ఉంటే బాగుండేదన్నది సర్వత్రా వినిపిస్తున్న అభిప్రాయం. తమ ఎమ్మెల్యే కిష్టారెడ్డి మృతితో ఏర్పడిన ఖాళీతో జరుగుతున్న ఉప ఎన్నికలలో ఆది నుంచీ కాంగ్రెస్ వెనుకంజలోనే ఉండిపోయింది.
కిష్టారెడ్డి వర్గానికి స్థానికంగా మంచి పట్టే ఉంది. పంచాయితీ స్థాయి నుంచి ప్రజాపద్దుల సంఘం చైర్మన్ వరకూ ఆయన యాత్ర అప్రతిహతంగా సాగింది. ఇదే నారాయణఖేడ్ నియోజకవర్గం నుంచీ ఆయన మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అలాంటి కిష్టారెడ్డి మరణం తరువాత ఆయన వారసునిగా సంజీవరెడ్డిని తమ అభ్యర్థగా నిలిపింది కాంగ్రెస్. అంతటితో తమ బాధ్యత ముగిసిపోయినట్లు కాంగ్రెస్ నేతలు భావించినట్లు కనిపిస్తోంది. సానుభూతి పవనాలతో ప్రజలే కావల్సినంత మెజారటీని అందిస్తారన్న ఆశతో మిన్నకుండిపోయారు.
సరిగ్గా ఇలాంటి పరిస్థితే తెరాసకు కలిసివచ్చింది. ఏకగ్రీవంగా ఎన్నిక జరిగే ఇలాంటి సందర్భాలలో సైతం తన అభ్యర్థిని నిలిపి విస్తరణ కాంక్షను చాటుకుంది. తెరాస ముఖ్య నేత హరీశ్ రావు ఖేడ్ ఉప ఎన్నికల బాధ్యతను అందిపుచ్చుకున్నారు. గ్రేటర్ ఎన్నికలలో కేటీఆర్ వెలిగిపోవడంతో తన ప్రాముఖ్యతను కూడా నిరూపించుకోవాల్సిన అవసరం హరీశ్‌కు ఏర్పడింది. ఒక పక్క ఖేడ్‌లో ఎన్నికల ప్రచారాన్ని ఉధృతంగా నిర్వహిస్తూనే ఇటు తెదెపా వంటి నాయకులు తెరాసలో చేరేందుకు హరీశ్ తగిన యుక్తులన్నీ పన్నారు. మరోవైపు కాంగ్రెస్, తెదెపా నాయకులు మాత్రం గ్రేటర్ ఎన్నికల గురించి వాదవివాదాలలో మునిగిపోయారు. ఫలితం! ప్రతిపక్షాలకి మరో సీటు తగ్గింది. ఆ సీటు తెరాస ఖాతాలోకి చేరింది.
దీంతో తమ పరాజయాల పరంపర ముగిసిపోయినట్లే అని కాంగ్రెస్ ఊపిరి పీల్చుకోవడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే... ఇప్పటిదాకా తెదెపా నుంచి వలస కార్యక్రమం ఇప్పుడు కాంగ్రెస్‌ని తాకుతుందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అటు దిల్లీలో కానీ, ఇటు తెలంగాణలో కానీ కాంగ్రెస్‌కు సరైన నాయకత్వం కానీ... ఆ నాయకత్వాన్ని బలపరిచే క్యాడర్ కానీ లోపించడంతో ఇప్పడు కాంగ్రెస్ నుంచి కొందరు ఎమ్మెల్యేల చూపు తెరాస వైపు నిలుస్తోంది. దీనికి తోడు నిలదొక్కుకుని నిలబడాల్సిన ప్రతి పరిస్థితిలోనూ మరోసారి ఓడిపోవడంతో తమ భవిష్యత్తు గురించి కాంగ్రెస్ నేతలలో ఆందోళన మొదలైంది. కీలక నేతలు సైతం పార్టీ బాధ్యతల నుంచి నిదానంగా తప్పుకుంటున్నారు. తెలంగాణను విభజించిన తరువాత అటు ఆంధ్రప్రదేశ్‌లో ఎలాగూ కాంగ్రెస్ కోట బీటలు వారిపోయింది. మరి తెలంగాణలో ఏం జరగబోతోంది. తెరాస ధాటికి కాంగ్రెస్ గడీ నిలుస్తుందా!