124A- ఓ వివాదాస్పద చట్టం
posted on Feb 17, 2016 @ 1:57PM
ఈ వ్యవహారం ఈనాటిది కాదు. దేశద్రోహం పేరుతో ఎవరినైనా జీవితకాలం పాటు జైలులో ఉంచగల 124A ఎప్పుడో బ్రిటిష్ పాలన నాటిది. దేశ స్వాతంత్ర్య సంగ్రామం ఉధృతంగా జరుగుతున్న రోజులలో ఈ చట్టం కిందనే బాలగంగాధర్ తిలక్ ఏళ్లతరబడి జైలు శిక్షను అనుభవించారు. మహాత్మా గాంధి, భగత్‌సింగ్ వంటి పోరాట యోధులనూ ఈ చట్టం కిందనే ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం హింసించింది. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఆ చట్టాన్ని కొనసాగించకూడదంటూ ఎందరో పెద్దలు సూచించినప్పటికీ, ఇంకా అది కొనసాగుతూనే ఉంది. ఇంతకీ ఏమిటీ 124A? ఎందుకని అది అంతగా వివాదాస్పదం?
124A ప్రకారం ఎవరైనా మాటల ద్వారాగానీ, చేతల ద్వారాగానీ, ప్రదర్శనల ద్వారాగానీ... మరే విధంగానైనాగానీ రాజ్యాంగం ప్రకారం ఎన్నుకోబడిన భారతదేశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ద్వేషాన్నీ, ధిక్కారాన్నీ, అవిశ్వాసాన్నీ పెంపొందించేందుకు ప్రయత్నిస్తే అలాంటి చర్యలను రాజద్రోహంగా పరిగణించవచ్చు. సదరు వ్యక్తికి జీవితఖైదు కానీ, మూడుసంవత్సరాల పాటు కారాగారవాసాన్ని కానీ శిక్షగా విధించవచ్చు. న్యాయస్థానం అవసరం అనుకుంటే ఈ శిక్షకు అదనంగా జరిమానాను కూడా విధించవచ్చు. అయితే మూడేళ్ల వరకూ లేకపోతే జీవితకాల ఖైదు అన్న నిబంధన కాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ చట్టం కింద జీవితకాల ఖైదుకి బదులుగా, ఏడేళ్ల వరకు మాత్రమే గరిష్ట కారాగార శిక్షను విధిస్తే బాగుంటుందని గతంలో వచ్చిన సలహాలను కూడా ప్రభుత్వం ఇంతవరకూ పట్టించుకోలేదు.
ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. అందుకనే న్యాయస్థానాలు కూడా ఈ చట్టం కింద తమ ముందుకి వచ్చిన కేసులను చాలా జాగ్రత్తగా పరిశీలిస్తాయి. ఎవరో ఒకరిద్దరు పనికిమాలిన నినాదాలు చేసినంత మాత్రాన వారిని దేశద్రోహం కింద అరెస్టు చేసి కఠినంగా దండించాల్సిన అవసరం లేదని, వారి వల్ల ప్రభుత్వానికి ముప్పేమీ లేదనీ కోర్టు స్పష్టం చేసిన సందర్భాలు ఉన్నాయి. అందుకనే అరుంధతీరాయ్ వంటి ప్రముఖుల మీద సైతం ఈ చట్టం కింద కేసులు దాఖలు అయినప్పటికీ, కోర్టు వారిపట్ల అంత కఠినంగా వ్యవహరించలేదు.
ప్రస్తుతం జేఎన్‌యూలో జరిగిన గొడవ సందర్భంగా 124A మళ్లీ వార్తలలోకి వచ్చింది. ఈ కేసులో తీవ్రవాది అఫ్జల్ గురుని ప్రస్తుతిస్తూ ఒక సమావేశం ఏర్పాటు అయ్యిందనీ, అందులో భారత వ్యతిరేక నినాదాలు చెలరేగాయన్నది అభియోగం. ఇందుకు బాధ్యుడిగా అక్కడి విద్యార్థి నాయకుడైన కన్నయా కుమార్‌ను అరెస్టు చేసి ఆయన మీద 124Aని మోపారు. జరిగిన దానికి కన్నయా కుమార్ ఎంతవరకూ బాధ్యుడన్న విషయాన్ని పూర్తిగా విచారించకుండానే ఆయన మీద ఇంత తీవ్రమైన చట్టాన్ని ప్రయోగించడంతో ఇప్పటి దాకా జేఎన్‌యూ వైపు వస్తున్న విమర్శలు కాస్తా ఇప్పడు ప్రభుత్వం మీదకి మళ్లుతున్నాయి. కన్నయా కుమార్ ఒక్కసారిగా సానుభూతికి కేంద్రంగా మారిపోయాడు.
ప్రస్తుతం ఈ కేసు న్యాయస్థానం ముంగిట్లో ఉండటం వల్ల దీని మీద కోర్టు ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే! కానీ ఈ సందర్భంగా 124Aని ఎలాంటి ఖచ్చితమైన పరిస్థితులలో అమలుచేయాలి, దానిని అమలు చేసే ముందు ఎలాంటి ప్రాథమిక విచారణ జరగాలి అన్నదాని మీద పోలీసు యంత్రాంగం మరింత జాగ్రత్త వహించాల్సిన అవసరం కనిపిస్తోంది. లేకపోతే ప్రభుత్వ వ్యూహం కాస్తా బెడిసికొట్టి పాలకవర్గానికే చెడ్డపేరు వచ్చే ప్రమాదం లేకపోలేదు. అప్పడు ప్రజల్లో నిజంగానే ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంది!