JNU- పరిస్థితి చేయి దాటిపోతోందా!
posted on Feb 15, 2016 @ 4:36PM
దేశ రాజధానిలోని జవహర్‌లాల్ విశ్వవిద్యాలయం రోజురోజుకీ ఉద్రిక్తంగా మారుతోందే కానీ, సమస్య సామరస్యంగా ముగిసే పరిస్థితి కనిపించడం లేదు. దేశంలోని పార్టీలు, మేధావులు అంతా రెండుగా చీలిపోయి వివాదానికి ఏదో ఒక వైపున నిల్చొన్న వైరభావం కనిపిస్తోంది. సహనంతో మెలగాల్సిన వారు, పెద్దమనుషులుగా బుద్ధి చెప్పాల్సినవారూ... తాము కూడా తలా ఓ రాయి తీసుకుని బయల్దేరుతున్నారు. ఈ వివాదంలో చివరికి నష్టపోయేది ఎవరో చెప్పనవసరం లేదు. దేశవ్యతిరేక వ్యాఖ్యలు చేస్తే సహించాల్సిన పని లేదంటూనే రాహుల్ గాంధి హుటాహుటిన విశ్వవిద్యాలయానికి వెళ్లిన తీరు ఆశ్చర్యం కలిగించక మానదు. స్వాతంత్ర్యంనాటి నుంచీ కూడా రాజకీయంలో ఎంతటి శత్రుపక్షాలైనా ఒకప్పుడు సున్నితమైన సందర్భాలలో ఆచితూచి స్పందించేవి. పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు కూడా చర్చ వినదగ్గదిగా ఉండేది. కానీ... భావోద్వేగాలతో కూడుకున్న వివాదాలలో రాహుల్ గాంధి ప్రవర్తిస్తున్న తీరు కాంగ్రెస్ పండితులను సైతం ఆశ్చర్యం కలిగించక మానదు.
రాహుల్ గాంధికి పరిణతి లేదనీ, తనదైన అభిప్రాయాలు ఉండవనీ వచ్చే విమర్శలను తిప్పికొట్టేందుకు ఆయన కావాలని ఇలాంటి వివాదాలలో స్వయంగా పాల్గొంటున్నట్లు తోస్తోంది. లేదా బీజేపీని వ్యతిరేకించే శక్తులన్నింటినీ కాంగ్రెస్ వైపు మళ్లించేందుకన్నా ఆయన ప్రయత్నాలు సాగుతూ ఉండవచ్చు. కారణం ఏదైనా రాహుల్ ఒక కొత్త పంథాకు దారితీశారనే చెప్పవచ్చు. దీని వల్ల మున్ముందు నిజంగానే కాంగ్రెస్ లాభపడినా ఆశ్చర్యపడనవసరం లేదు. జేఎన్‌యూ వివాదంలోకి చేరేందుకు వామపక్షాలు కూడా ఉత్సాహపడుతున్నాయి. సీతారాం ఏచూరి, సురవరం, డి.రాజా... హుటాహుటిన రాజధానికి చేరుకుని విద్యార్థి సంఘాలకు తమ నైతిక మద్దతుని అందించారు. విద్యార్థుల గొంతు నొక్కేస్తున్నారంటూ ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు.
విచిత్రం ఏమిటంటే ఎవరూ జరిగినదాని గురించి నిజానిజాలు వెలికితీసేంతవరకూ వేచి చూసేందుకు సిద్ధంగా లేరు. చట్టం తన పని తాను చేసుకుపోయేలోపే, బరిలోకి దిగి బాహాబాహీ తలపడేందుకే మొగ్గుచూపుతున్నారు. జేఎన్‌యూలో అసలు ఏం జరిగింది? పాకిస్తాన్‌కు అనుకూలమైన నినాదాలు చేశారా లేరా? తీవ్రవాదులను శ్లాఘిస్తూ సభని నిర్వహించారా లేదా? ఈ మొత్తం సంఘటనలో ఎవరి బాధ్యత ఎంత?... వంటి ప్రశ్నలను ఎవరూ పట్టించుకుంటున్నట్లు లేదు.
మరోవైపు కొందరు బీజేపీ నేతలు కూడా ఓరిమిలేకుండా వివాదాన్ని రగులుస్తున్నారు. సాక్షాత్తూ హోం మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి పూర్వాపరాలను ఆలోచించకుండా, జేఎన్‌యూ వెనుక ‘హఫీజ్ సయీద్’ అనే అంతర్జాతీయ తీవ్రవాది హస్తం ఉందని ప్రకటించడాన్ని ఎలా జీర్ణించుకోగలం! తరువాత అదేదో తప్పుడు వార్త అంటూ తన నాలుకను కరుచుకోవడంతో ఇప్పడు విమర్శలకు మరింత బలాన్ని అందించినట్లైంది. నిజంగానే ఇప్పుడు హఫీజ్ సయీద్ ఈ ఘటన గురించి మాట్లాడటం మొదలుపెట్టాడు. ఇక బీజేపీ అనుకూల సంస్థలైన ABVP, RSSలు కూడా ఆనాటి విద్యార్థుల గురించి తీవ్రమైన వ్యాఖ్యలు చేయడంతో ఇది ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య జరుగుతున్న యుద్ధంగా మారిపోయింది. ప్రస్తుతం ఈ వివాదం న్యాయస్థానాలకు చేరుకుంది కాబట్టి, కనీసం మన న్యాయవ్యవస్థ అయినా ఈ సమస్యను పరిష్కరిస్తుందనీ, మున్ముందు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తుందనీ ఆశిద్దాం!