ఆటో పట్టిన చిట్టి చేతులను ఆదుకున్న లోకేశ్..
posted on Sep 4, 2021 @ 10:49AM
ఈ కుర్రాడి వయసు ఏనిమిదేండ్లు. ఆటో సీట్లో కూర్చుంటే కాళ్లు సరిగా కింద కూడా అందవు. కాని ఆ కుర్రాడు ఆటో నడుపుతున్నారు. తన తల్లిదండ్రులను సాకడానికి.. ప్రమాదమైనా ఆటో లో రయ్ మని దూసుకెళ్తున్నాడు.తప్పనిసరి పరిస్థితుల్లో ఆటో నడపాల్సి వస్తోందని పిల్లాడితో పాటు అతని తల్లిదండ్రులు చెబుతున్నారు.
జీవనోపాధి కోసం ఆటో నడుపుతున్న 8 ఏండ్ల బాలుడి విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బాలుడి దుస్థితిని చూసి చాలా మంది కన్నీళ్లు కార్చారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం గంగుడుపల్లెకు చెందిన పాపిరెడ్డి, రేవతి దంపతులకు ముగ్గురు మగపిల్లలు. కానీ ఆ దంపతులిద్దరికీ కళ్లు కనిపించవు. తల్లిదండ్రులు అంధులు కావడంతో.. పెద్ద కొడుకైనా ఎనిమిదేళ్ల గోపాల్ రెడ్డి.. చిన్న ప్రాయంలోనే కుటుంబ బాధ్యతను భుజానికెత్తుకున్నాడు. బ్యాటరీ ఆటో నడుపుతూ గ్రామంలో పప్పులు, బియ్యం విక్రయిస్తున్నాడు. ఆటోలో తల్లిదండ్రులను వెంటబెట్టుకుని, నిత్యావసరాలు తీసుకుని సమీప గ్రామాల్లో తిరుగుతాడు. ఇలా సాగే వ్యాపారమే వారి కుటుంబానికి జీవనాధారం.
ఈ చిన్నారి కష్టాలు పడుతున్న కష్టం తెలుసుకుని చలించిన టీడీపీ నేత నారా లోకేశ్ వెంటనే గోపాలకృష్ణారెడ్డి కుటుంబానికి రూ.50 వేలు సాయం ప్రకటించారు. అతడి చదువు బాధ్యతనూ తానే తీసుకుంటానని భరోసా ఇచ్చారు. బ్యాటరీ ఆటోపై ఉన్న అప్పు తీర్చేందుకు మరో రూ.2 లక్షలు టీడీపీ నుంచి అందిస్తామని ట్విటర్‌లో పేర్కొన్నారు.
మరోవైపు ఇంత చిన్నపిల్లాడు ఆటో నడిపే క్రమంలో ఏదైనా జరగరానిది జరిగితే పరిస్థితి ఏంటని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని.. మరో ప్రత్యామ్నాయ ఉపాధి మార్గం చూపాలని కోరుతున్నారు.