థర్డ్ వేవ్.. మరింత టెరిఫిక్.. 2 రోజుల్లోనే ఫసక్..!
posted on May 19, 2021 @ 4:50PM
ఫస్ట్ వేవ్ హడలెత్తించింది. ఆ తర్వాత కాస్త రెస్ట్ ఇచ్చింది. వైరస్ మరింత బలం పుంజుకుంది. రూపాంతరమూ చెందింది. సెకండ్ వేవ్ రూపంలో భారత్‌ను కుమ్మేస్తోంది. ఫస్ట్ వేవ్‌తో పోలిస్తే.. సెకండ్ వేవ్ భయానకంగా ఉంది. కొందరికి పైపైనే దెబ్బ కొట్టి వెళ్లిపోతోంది. చాలామందిలో అవయవాలను దెబ్బ తీస్తోంది. అందుకే, వైరస్ దాటికి ఆసుపత్రుల్లో బెడ్లు కరువు. టన్నులకు టన్నులు ఆక్సిజన్ తెప్పిస్తున్నా.. సరిపోవడం లేదు. జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. రోజుల వ్యవధిలోనే ప్రాణాలు విడుస్తున్నారు. దేశంలో ఎటు చూసినా కరోనా పేషెంట్ల శవాల దిబ్బలే. అంత్యక్రియల కోసం స్మశానాల దగ్గర పెద్ద పెద్ద క్యూలు.. దేశంలో మునుపెన్నడూ చూడని దారుణం.
సెకండ్ వేవ్‌లో పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే.. ముందుముందు మూడో వేవ్ ముప్పు పొంచి ఉందనే హెచ్చరికలు మరింత భయ పెడుతున్నాయి. థర్డ్ వేవ్‌లో వైరస్ మరింత మ్యూటేషన్ చెందుతుందట. ఈసారి చిన్నపిల్లలనూ వదిలిపెట్టదట. అదే జరిగితే.. ఇక దారుణ పరిస్థితే. పిల్లలకు కరోనా సోకితే.. ఇక పెద్దలు బేజారే. మూడో వేవ్‌లో కరోనా బారిన పడితే ఇక అంతే సంగతులను వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొవిడ్ సోకిన రెండు రోజుల్లోనే పరిస్థితి విషమించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. సెకండ్ వేవ్ కంటే.. థర్డ్ వేవ్‌లో మరణాల సంఖ్య భారీగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ వ్యాపిస్తున్న విధానం చూస్తుంటే థర్డ్ వేవ్ తప్పేలా లేదని కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. అయితే ఈ మూడో వేవ్ ఎప్పుడు వస్తుంది? ఎంతకాలం కొనసాగుతుంది? అనే విషయాలపై మాత్రం స్పష్టత లేదు. ప్రస్తుతం భారత్‌లో చాలా కరోనా వేరియంట్లు విజృంభిస్తున్నాయి. వీటిలో అత్యంత ప్రమాదకరమైనది డబుల్ మ్యూటెంట్. దీనికి శాస్త్రవేత్తలు పెట్టిన పేరు బి.1.617. ఇది కేవలం భారత్‌లో మాత్రమే కనిపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా యూకే, బ్రెజిల్, సౌతాఫ్రికా, అమెరికా దేశాల్లో కూడా ఈ వైరస్ వేరియంట్లు వెలుగుచూశాయి.
మన దేశంలో పలు రాష్ట్రాల్లో వేరు వేరు వేరియంట్లు దాడి చేస్తున్నాయి. వీటిలో బాగా చర్చకు వచ్చిన వైరస్ ఆంధ్రప్రదేశ్‌లో కనిపించి కరోనా వేరియంట్. ఇది మామూలు వైరస్ కన్నా 15 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతోంది. అయితే, ప్రస్తుతానికి ఇది చాలా తక్కువ ప్రాంతాల్లోనే పరిమితమైంది. ఈ వేరియంట్లు కరోనా కొత్త స్ట్రెయిన్లను సృష్టిస్తున్నాయని వైద్యులు చేసిన పరిశోధనలో తేలింది. ఇలా జరగడం వల్ల రకరకాల విధానాల్లో మానవులను ఈ వైరస్ ఎటాక్ చేస్తోందని వైద్యులు చెప్పారు. ఇన్ని వేరియంట్లు ఉండటం వల్ల కరోనా థర్డ్ వేవ్ తప్పదని అంటున్నారు.
మొదటి వేవ్‌లో మనుషుల ఊపిరితిత్తులను నాశనం చేయడానికి కరోనా వైరస్ 10 రోజుల సమయం తీసుకుంది. సెకండ్ వేవ్‌లో ఈ కాలం 5-7రోజులకు తగ్గిపోయింది. మూడో వేవ్ కనుక వస్తే 2 నుంచి 3 రోజుల్లోనే ఊపిరితిత్తులను వైరస్ నాశనం చేసి, బాధితులను ఐసీయూలో పడేలా చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కనిపిస్తున్న వేరియంట్ ఇదే పని చేస్తోందని అంటున్నారు. ఈ వేరియంట్ సోకిన వారు 2-3 రోజుల్లోనే ఐసీయూలో చేరాల్సి వస్తోంది. ఆ తర్వాత పరిస్థితులు విషమించి చనిపోతున్నారు. కరోనా వైరస్ ప్రభావం, కరోనా వేవ్స్‌పై అధ్యయనం చేస్తున్న కొంత మంది శాస్త్రవేత్తలు మరో షాకింగ్ విషయం వెల్లడించారు. కరోనా మొదటి వేవ్‌లో వృద్ధులపై వైరస్ దాడి చేసింది. సెకండ్ వేవ్‌లో యువకులపై ఎక్కువ ప్రభావం పడింది. మూడో వేవ్ గనుక వస్తే ఇది పిల్లలను టార్గెట్ చేస్తుందనేది శాస్త్రవేత్తల వాదన. అందుకే, మూడో వేవ్‌పై ఇంతటి ఆందోళన.
భారతదేశ జనాభాలో 18 ఏళ్లలోపు వారే 30 శాతంపైగా ఉన్నారు. ఈ ఏడాది అక్టోబరు నాటికి వీరికి కూడా వ్యాక్సిన్ తీసుకొస్తామని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ చెప్తోంది. కోవ్యాక్సిన్ తయారుచేసిన భారత్ బయోటెక్ కూడా ఈ పనిలోనే ఉంది. వారి వ్యాక్సిన్ ట్రయల్ దశలో ఉన్నట్లు సమాచారం. ప్రపంచంలో ఇప్పటి వరకూ ఫైజర్ కంపెనీ మాత్రమే 18 ఏళ్ల లోపు వారికి వ్యాక్సిన్ తయారు చేసింది. 12 ఏళ్లపైబడిన వారికి ఇవ్వొచ్చంటూ ఒక వ్యాక్సిన్ విడుదల చేసింది. దీనికి కెనడాలో అనుమతులు లభించాయి కూడా. అమెరికాలో కూడా దీనికి త్వరలోనే అనుమతులు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలా మనదేశంలో కూడా చిన్నారుల కోసం వ్యాక్సిన్ తయారు చేయకపోతే కరోనా మూడో వేవ్‌ను తట్టుకోవడం కష్టమేనని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.