చికెన్ కోసం మర్డర్.. నలుగురు అరెస్ట్..
posted on May 20, 2021 @ 12:30PM
ఆకలేస్తోందని హోటల్‌కి వెళ్లారు. చికెన్ మీల్స్ ఆర్డర్ ఇచ్చారు. చికెన్ లేదనేది సర్వర్ ఆన్సర్. కావాలంటే బోటీ ఉంది అన్నాడు. బోటీ వద్దు.. చికెనే కావాలన్నారు వాళ్లు. అయితే, చికెన్ కర్రీ లేదంటూ సర్వర్ కిచెన్‌లోకి వెళ్లిపోయాడు. కట్ చేస్తే.. అదే రోజు రాత్రి హోటల్ ముందు సర్వర్ డెడ్‌బాడీ. ఇంతకీ, సర్వర్‌ను ఎవరు చంపారు? హంతకులు వాళ్లేనా?
హైదరాబాద్‌లో జరిగిందీ హత్య. కర్ణాటకలోని బీదర్ జిల్లా మొర్కందివాడి గ్రామానికి చెందిన మహేష్(20), విజయ్(24)లు అన్నదమ్ములు. కొత్తపేట పండ్ల మార్కెట్‌లోని ఓ పండ్ల దుకాణంలో హమాలీలుగా పనిచేస్తూ అక్కడే నివసిస్తున్నారు. లాక్‌డైన్‌కు ముందు మహేష్, విజయ్ మరో ఇద్దరు మైనర్ బాలురు కొత్తపేట పండ్ల మార్కెట్ ఎదురుగా ఉన్న శ్రీ దుర్గా భవానీ హోటల్‌కు వెళ్లి భోజనంతో పాటు చికెన్ ఆర్డర్ ఇచ్చారు. సర్వర్ బాలాజీ వచ్చి చికెన్ లేదని కావాలంటే బోటి తీసుకోవాలని చెప్పి లోపలికి వెళ్లాడు. మహేష్ అతని వెనకాలే కిచెన్‌లోకి వెళ్లగా, అక్కడ కొద్దిగా చికెన్ కనిపించింది. దీంతో చికెన్ ఉన్నా మాకు ఇవ్వవా? అంటూ గొడవకు దిగాడు. ఈలోగా హోటల్ యజమాని సుధాకర్ వచ్చి సర్దిచెప్పడంతో, వారు నలుగురు భోజనం చేసి బిల్లుకట్టకుండా వెళ్లిపోయారు.
చికెన్ ఉన్నా తమకు ఇవ్వలేదని కోపం పెంచుకున్న ఆ నలుగురు.. సర్వర్ బాలాజీపై దాడి చేయాలని డిసైడ్ అయ్యారు. రాత్రి 8 గంటల సమయంలో నలుగురు మరోసారి హోటల్‌కు వచ్చారు. ముగ్గురు హోటల్ బయట ఉండగా, మహేష్ లోపలకు వెళ్లి బాలాజీని బయటకు తీసుకుని వచ్చాడు. బాలాజీ పై నలుగురు దాడి చేశారు. మహేష్ ఆవేశంతో బండరాయి తీసుకొచ్చి బాలాజీ తలపై మోదాడు. తల పగిలి తీవ్రంగా రక్తం కారడంతో ఆ నలుగురు అక్కడి నుంచి పారిపోయారు.
తీవ్రగాయాలపాలైన బాలాజీని కొత్తపేటలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ నెల 15న బీదర్‌లోని ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ 17న మృతి చెందాడు. ఫిర్యాదు అందటంతో.. సరూర్‌నగర్ పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించగా విషయం వెలుగు చూసింది. ఆ నలుగురుపై కేసు నమోదు చేసి.. అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల్లో ఇద్దరు మైనర్లు.
జస్ట్.. చికెన్ కర్రీ కోసం సర్వర్‌ను హత్య చేసిన ఆ నలుగురుకి.. ఇప్పుడు జైల్లో చికెన్ కర్రీ దొరుకుతుందా? చిప్పకూడేగా తినాల్సింది.. ఈ మాత్రం బుద్ధి అప్పుడే ఉంటే.. ఇప్పుడు చిప్పకూడు కాకుండా.. ఎంచక్కా చికెన్ కర్రీనే తినేవాళ్లుగా..!