ముదిరాజులకు కీలక పదవులు.. ఈటలకు కేసీఆర్ అలా చెక్?
posted on May 20, 2021 @ 1:01PM
కేసీఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయ్యారు ఈటల రాజేందర్. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తనను అవమానకరంగా తొలగించారనే కసిలో ఉన్నారు రాజేందర్. బీసీ నేతగా రాజకీయాల్లో ఎదిగిన ఈటల బర్తరఫ్ తో .. బీసీ సామాజిక వర్గాలు భగ్గుమంటున్నాయి. ఈటల సొంత సామాజికవర్గమైన ముదిరాజులయితే కేసీఆర్ పై రగిలిపోతున్నారు. తమ నాయకుడిని అవమానించారంటూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. సోషల్ మీడియా వేదికగానూ సీఎం కేసీఆర్ తీరుపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. ఈటలను అవమానిస్తే... మొత్తం తమ సామాజికవర్గాన్నే అవమానించారంటూ ముదిరాజులు మండిపడితున్నారు. ఈటల ఎపిసోడ్ తో సీన్ ఇలా ఉంటే... ఇప్పుడు మాత్రం మరోలా మారింది. ఈటల రాజేందర్ ను మంత్రివర్గం నుంచి తొలగించిన కేసీఆర్... ఇప్పుడు ఈ సామాజిక వర్గానికే పెద్ద పీట వేస్తున్నారు.
ఇటీవల జరిగిన కీలక పదవులు, నామినేటెడ్ పోస్టుల భర్తీలో కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈటల బర్తరఫ్ తో తనపై వస్తున్న బీసీ వ్యతిరేకి ముద్రతో పాటు ముదిరాజులను కూల్ చేసేలా ఆయన ఎత్తుగడులు ఉంటున్నాయి. తాజాగా నియమించిన రెండు కీలక నామినేటెడ్ పోస్టుల్లో ముదిరాజులకు ప్రాధాన్యత ఇచ్చారు కేసీఆర్. చాలా కాలంగా ఖాళీగా ఉన్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు కొత్త పాలక మండలి ఏర్పాటైంది. సీనియర్ ఐఏఎస్ జనార్ధన్ రెడ్డి చైర్మెన్ గా మరో ఏడుగురు సభ్యులతో కమిటి నియమించారు. ఇందులో ముగ్గురు రెడ్డలు, ముగ్గురు బీసీలు, ఒక ఎస్టీకి అవకాశం ఇచ్చారు. అయితే ఎవరూ ఊహించని విధంగా బీసీల నుంచి ఎప్పుడు ఉండే వర్గాలకు కాకుండా ముదిరాజ్ మహిళను అపాయింట్ చేశారు సీఎం కేసీఆర్. స్పెషల్ గ్రేడ్ డిప్యూటి కలెక్టర్ గా పని చేస్తున్న ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన కోట్ల అరుణ కుమారిని టీఎస్పీఎస్సీ సభ్యురాలిగా నియమించారు. ప్రస్తుతం వికారాబాద్ లో భూ భారతి జాయింట్ డైరెక్టర్ గా, జాయింట్ క లెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు అరుణ కుమారి. బీసీల్లో బలమైన వర్గంగా ఉన్న మున్నురుకాపు, యాదవ, గౌడ వర్గాల నుంచి కాకుండా ముదిరాజుకు చోటు కల్పించడానికి ఈటల రాజేందర్ ఎఫెక్టే కారణమంటున్నారు.
గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో ఉండి.. ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో ఉన్న ప్రసిద్ధ కొమురవెల్లి మల్లన్న స్వామి ఆలయానికి కొత్త పాలక మండలి నియమించారు. మల్లన్న స్వామిని యాదవులు తమ కుల దైవంగా భావిస్తారు. అందుకే కొమురవెల్లి టెంపుల్ చైర్మెన్ పదవి యాదవులకే ఇవ్వాలనే డిమాండ్ ఉంది. గతంలోనూ ఎక్కువ సార్లు యాదవులకే ఇచ్చారు. సీఎం కేసీఆర్ మాత్రం కొమురవెల్లి మల్లన్న టెంపుల్ కమిటీ చైర్మెన్ గా గీస భిక్షపతి ముదిరాజ్ ను నియమించారు. యాదవుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వస్తున్నా పట్టించుకోకుండా ముదిరాజును ముఖ్యమంత్రి ఖరారు చేయడానికి ఈటల రాజేందరే కారణమనే చర్చ జరుగుతోంది. ఈటల బర్తరఫ్ తో రగిలిపోతున్న ముదిరాజులను మళ్లీ దగ్గరకు చేసుకునేందుకే కీలక పదవుల్లో కేసీఆర్.. ఆ వర్గం వారికి కట్టబెడుతున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.
ఇప్పటికే ముదిరాజు వర్గానికి చెందిన బండా ప్రకాష్ రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. ఈటల రాజేందర్ కు చెక్ పెట్టాలని ఎప్పటి నుంచో ఆలోచిస్తున్న కేసీఆర్.. వ్యూహాత్మకంగానే బండా ప్రకాష్ కు రాజ్యసభ సీటు ఇచ్చారనే చర్చ కూడా జరుగుతోంది. ఈటలకు పోటీగానే బండాను తెరపైకి తెచ్చారని అంటున్నారు. ప్రకాష్ ను పెద్దల సభకు పంపినపుడే.. తనకు చెక్ పెట్టబోతున్నారనే విషయాన్ని గ్రహించిన రాజేందర్.. తన దారి చూసుకోవడానికి ఏర్పాట్లు చేసుకున్నారని కూడా చెబతున్నారు. ఇకపై జరగబోయే నామినేటెడ్ పోస్టుల భర్తీలోనూ ముదిరాజులకు కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తారనే ప్రచారం టీఆర్ఎస్ వర్గాల్లోనే జరుగుతోంది. అంతేకాదు జూన్ లో ఎమ్మెల్యే కోటాలో ఆరు, గవర్నర్ కోటాలో ఒక ఎమ్మెల్సీ ఖాళీ కాబోతోంది. కొవిడ్ కారణంగా ప్రస్తుతానికి ఆ ఎన్నికలు వాయిదా పడ్డాయి. అయితే ఎమ్మెల్సీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా.. ఒక ముదిరాజుకు చోటు ఖాయమంటున్నారు.
ఈటల రాజేందర్ ముదిరాజు అయినా... ఆయన ఎక్కువగా ఆ కుల రాజకీయాల్లో పాల్గొనలేదు. బీసీ నేతగానే అడుగులు వేశారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన కాసాని జ్ఞానేశ్వర్ మాత్రం ముదిరాజు సంఘం పేరుతో ఎక్కువగా కార్యక్రమాలు నిర్వహించేవారు. గతంలో ఆయన ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. ఈటల రాజేందర్ ను అన్ని విధాలా అణగదొక్కాలనే ప్రయత్నాల్లో ఉన్న సీఎం కేసీఆర్.. కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ కు ఎమ్మెల్సీ ఇవ్వవొచ్చనే ప్రచారం జరుగుతోంది. కాసాని ద్వారా ఈటల ముదిరాజ్ అస్త్రానికి చెక్ పెట్టాలని గులాబీ బాస్ స్కెచ్ వేస్తున్నారని చెబుతున్నారు. మొత్తంగా ఈటల రాజేందర్ రాజకీయ వ్యూహాలతో.. ఆయన సామాజిక వర్గ నేతలకు ప్రభుత్వంలో మంచి అవకాశాలు వస్తున్నాయనే చర్చ రాజకీయ వర్గాలు, టీఆర్ఎస్ నేతల్లోనూ జరుగుతోంది.