ఇక ఇంట్లోనే కరోనా టెస్ట్.. ఇలా చేస్తే ఫినిష్.. ఐసీఎంఆర్ గైడ్ లైన్స్
posted on May 20, 2021 @ 12:21PM
కరోనా టెస్టుల కోసం ఆసుపత్రులు, పరీక్షా కేంద్రాల వద్దకు వెళ్లడానికి భయపడుతున్నారా? హాస్పిటల్స్ దగ్గర రద్దీతో అక్కడికి వెళ్లేందుకు జంకుతున్నారా? కొవిడ్ టెస్టు సెంటర్లే వైరస్ హాట్ స్పాట్లుగా మారిపోయానని ఆందోళన చెందుతున్నారా? టెస్టులకని పోతే మహమ్మారి ఎక్కడ అంటుకుంటుందోననే భయంగా ఉన్నారా?.. అయితే మీకో గుడ్ న్యూస్.. ఆ తిప్పలు పోగొట్టేందుకు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ఇంట్లోనే.. మనకు మనమే టెస్ట్ చేసుకునే వెసులుబాటును కల్పించింది. దానికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. మహారాష్ట్రలోని మైల్యాబ్ అనే సంస్థ తయారు చేసిన ‘కొవిసెల్ఫ్’ అనే స్వీయ ర్యాపిడ్ యాంటీ జెన్ కిట్ కు ఐసీఎంఆర్ అనుమతులను ఇచ్చింది.
ఇంట్లోనే కరోనా టెస్టుకు ఇవే ఐసీఎంఆర్ మార్గదర్శకాలు...
లక్షణాలున్న వారు లేదా కరోనా సోకిన వారిని కలిసిన వారు మాత్రమే టెస్ట్ చేసుకోవాలి..
టెస్టులను ఇష్టమొచ్చినట్టు చేయొద్దు..
సంస్థ టెస్ట్ కిట్ లోని యూజర్ మాన్యువల్ లో నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా పరీక్ష చేసుకోవాలి..
టెస్టులు చేసుకునేవారంతా గూగుల్ ప్లే స్టోర్ నుంచి హోం టెస్టింగ్ మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి..
పరీక్షా పద్ధతులకు సంబంధించిన పూర్తి వివరాలు ఆ యాప్ లో ఉంటాయి. అంతేగాకుండా పరీక్ష ఫలితాలు (నెగెటివ్/పాజిటివ్) అందులోనే తెలుసుకోవచ్చు..
టెస్ట్ పూర్తయిన తర్వాత.. యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్న, టెస్ట్ చేసుకున్న వ్యక్తి రిజిస్టర్ చేసుకున్న మొబైల్ ఫోన్ లోనే ఆ టెస్ట్ పేపర్ ను ఒక ఫొటో తీసుకోవాలి..
టెస్ట్ లో పాజిటివ్ వస్తే కరోనా ఉన్నట్టు.. ఒకవేళ లక్షణాలుండి నెగెటివ్ వస్తే కచ్చితంగా ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి..
పాజిటివ్ వచ్చి.. లక్షణాలు తక్కువగా ఉన్నవారు కేంద్ర ఆరోగ్య శాఖ మార్గనిర్దేశాల ప్రకారం ఇంట్లోనే ఐసోలేట్ అవ్వాలి..
లక్షణాలుండి యాంటీ జెన్ టెస్ట్ లో నెగెటివ్ వచ్చిన వారిని కరోనా అనుమానిత పేషెంట్ గానే భావించాలి. అలాంటి వారు ఇంట్లో ఐసోలేట్ అవ్వాలి..
యాప్ లోని యూజర్ వివరాలు ఐసీఎంఆర్ కొవిడ్ 19 టెస్టింగ్ పోర్టల్ లో భద్రంగా దాస్తారు..
టెస్ట్ అయిపోయిన తర్వాత సంస్థ నిర్దేశించిన ప్రమాణాల మేరకు ఆ కిట్ ను భద్రంగా పారేయాలి..