స్కిల్ కేసు కొట్టివేత

Publish Date:Jan 13, 2026

సోమవారం ఉదయం, పోలవరం-నల్లమల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను భారత సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ పిటిషన్ విచారణకు అర్హత లేదని, రాష్ట్ర ప్రభుత్వ చట్టపరమైన విధానానికి ఎదురుదెబ్బ తగిలిందని కోర్టు పేర్కొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శిస్తూ కవిత Xలో పోస్ట్ ద్వారా ఈ పరిణామంపై స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌తో కృష్ణా, గోదావరి జల వివాదాలను పరిష్కరించడంలో పాలక ముఖ్యమంత్రి మరోసారి తన అసమర్థతను చూపించారని ఆమె అన్నారు. నీటి హక్కులపై పొరుగు రాష్ట్రాలతో పోరాడకూడదని బహిరంగంగా చెప్పిన ముఖ్యమంత్రి ఉండటం తెలంగాణకు దురదృష్టకరమని ఆమె వ్యాఖ్యానించారు. కోర్టు ఫలితం తెలంగాణకు మరో అడ్డంకిని జోడించిందని కవిత పేర్కొన్నారు. రిట్ పిటిషన్ దాఖలు చేయడం వల్ల పోలవరం-నల్లమల సాగర్ లిఫ్ట్ ప్రాజెక్ట్ అక్రమ నిర్మాణంపై తెలంగాణ హక్కులు బలహీనపడ్డాయి. ఈ చర్య రాష్ట్రాన్ని రక్షించడానికి బదులుగా రాష్ట్ర స్థానాన్ని దెబ్బతీసిందని ఆమె పేర్కొన్నారు. ముఖ్యమంత్రి మరియు కొంతమంది కీలక ప్రభుత్వ సభ్యులు తీసుకున్న నిర్ణయాల కారణంగా తెలంగాణ ప్రజల నీటి హక్కులు నిరాకరించబడుతున్నాయని కవిత ఆరోపించారు. ఆ హక్కులను కాపాడుకోవడానికి తెలంగాణ జాగృతి ఏపీ నీటి ప్రాజెక్టులపై పోరాడుతుందని ఆమె నొక్కి చెప్పారు.

జేపీ, లక్ష్మీనారాయణ బాటలో ఏబీవీ!

Publish Date:Jan 13, 2026

ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు ప్రకటించారు. అందుకు అవసరమైన గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్లు తెలిపారు.గతంలో అంటే 2014-2019 మధ్య కాలంలో ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ గా పని చేశారు. ఆ కాలంలో  రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. 2019 ఎన్నికలలో రాష్ట్రంలో వైసీపీ విజయం సాధించి జగన్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైన క్షణం నుంచీ ఏబీ వెంకటేశ్వరరావు(ఏబీవీ) వేధింపులను ఎదుర్కొన్నారు. అవినీతి ఆరోపణలతో సస్పెండయ్యారు. 2020 ఫిబ్రవరిలో ఆయనను జగన్ సర్కార్ సస్పెండ్ చేసింది.   అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆయన అలుపెరుగని న్యాయపోరాటం చేశారు. క్యాట్, హైకోర్టు,  సుప్రీంకోర్టులో సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత, ఆయన తిరిగి సర్వీసులో చేరారు. అదీ సరిగ్గా పదవీ విరమణ రోజు.   ఆ తరువాత ఆయన  జగన్ ప్రభుత్వాన్ని బహిరంగంగా విమర్శిస్తూ ఆయన అనేక ఇంటర్వ్యూలు ఇచ్చారు.  ప్రెస్ మీట్లు నిర్వహించారు.  డిజిటల్ ఫ్లాట్ ఫారమ్ లలో కూడా చురుగ్గా ఉంటూ.. జగన్ హయాంలో జరిగిన అన్యాయాలూ, అక్రమాలు, ఆర్థిక అవకతవకలను ఎండగట్టారు.   అది పక్కన పెడితే 2024 ఎన్నికలలో రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత..  ప్రభుత్వం ఏబీవీ సస్పెన్షన్ కాలాన్ని విధుల్లో ఉన్నట్లుగానే పరిగణించింది. ఆయనపై జగన్ సర్కార్ తీసుకున్న క్రమశిక్షణ చర్యలను రద్దు చేసింది. అలాగే..  ఆంధ్రప్రదేశ్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమించింది. అయితే తన కృషికి తగిన గుర్తింపు రాలేదన్న కినుకతో ఏబీవీ ఉన్నట్లు కనిపిస్తున్నారు.ఏపీ పోలీసు హౌసింగ్ బోర్డు చైర్మన్ పదవిని చేపట్టలేదు. జగన్ హయాంలో జరిగిన అవకతవకలపై విమర్శలతో పాటుగా, ప్రస్తుత తెలుగుదేశం కూటమి ప్రభుత్వ నిర్ణయాలనూ ప్రశ్నించడం ఆరంభించారు. ఇప్పుడు ఏకంగా కొత్త పార్టీ ఏర్పాటును ప్రకటించారు. లైక్ మైండెడ్ పీపుల్ తో కలిసి  ముందుకు సాగుతాననీ,  పార్టీకి అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చుకునే పనిలో ఉన్నాననీ కూడా ఏబీవీ చెప్పారు.  అయితే ఇక్కడే ఆయన రాజకీయ అడుగులు ఏ మేరకు సక్సోస్ అవుతాయన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. నిస్సందేహంగా ఏబీవీ నిజాయితీగల అధికారిగా విధినిర్వహణలో గుర్తింపు పొందారు. ఆయనకు పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. అయితే ఆ గుర్తింపు, ఆ అభిమానం ఒక రాజకీయ పార్టీని విజయవంతంగా లక్ష్యం దిశగా నడిపించేందుకు సరిపోతాయా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏబీవీలాగే  మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాశ్ నారాయణ కు కూడా నిజాయతీ పరుడైన అధికారిగా పేరు ఉంది. ఆయన సర్వీసులో ఉండగానే ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో సొంతంగా పార్టీ పెట్టారు. ఎన్నికల రణరంగంలోకి కూడా దిగారు. కానీ ఒకే ఒక ఎన్నికలో 2014లో ఆయన లోక్ సత్తా పార్టీ తరఫున పోటీ చేసిన అందరూ డిపాజిట్ కోల్పోయారు. ఆయన ఒక్కరు మాత్రమే విజయం సాధించారు. అది పక్కన పెడితే.. ఆ తరువాత ఆయనా, ఆయన పార్టీ కూడా క్రియాశీల రాజకీయాలలో పూర్తిగా కనుమరుగయ్యారు. ఇక ఆయన తరువాత  సీబీఐ మాజీ జేడీ  కూడా నిజాయతీగల అధికారిగా ప్రజలలో మంచి గుర్తింపు పొందారు. ప్రజాభిమానాన్ని కూడా చూరగొన్నారు. ఒక విధంగా చెప్పాలంటే జయప్రకాశ్ నారాయణ, లక్ష్మీనారాయణలకు ఏబీవీ కంటే ఎక్కువ గుర్తింపే ప్రజలలో ఉంది. అయితే క్రీయాశీల రాజకీయాలలో వారు తేలిపోయారు. ఉనికి మాత్రంగా మిగిలిపోయారు.  ఈ నేపథ్యంలోనే ఏబీవీ రాజకీయపార్టీ అనగానే పరిశీలకులు ఆయన ఏ మేరకు రాణిస్తారు అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.  

మాట మార్చిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

Publish Date:Aug 28, 2025

  ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు 75 ఏళ్లకు రిటైర్ అవ్వాలని వ్యాఖ్యానించిన ఆర్ఎస్ఎస్ చీఫ్ ఇవాళ మాట మార్చారు. 75 ఏళ్లకు రిటైర్ అవ్వాలని నేను ఎవరికీ చెప్పలేదు అన్నారు. 75 ఏళ్ల తర్వాత కూడా చురుగ్గా పనిచేసే శక్తి ఉందని ఆయన తెలిపారు.సంఘ్ ఎలా చెప్తే అలా నడుచుకుంటామని వెల్లడించారు. కేంద్రం, ఆర్‌ఎస్‌ఎస్‌ మధ్య ఎలాంటి విభేదాలు లేవని  ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ స్పష్టం చేశారు.  . రాష్ట్రీయ స్వయం సేవక్‌  సంఘ్‌ వందేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. కొన్ని విషయాల్లో అభిప్రాయ బేధాలు ఉండొచ్చు.. వివాదం కాదంటూ చెప్పుకొచ్చారు. దేశ ప్రయోజనాలే ఇద్దరి ప్రాధాన్యతగా పేర్కొన్న మోహన్‌ భగవత్‌..  బీజేపీ అధ్యక్షుడి ఎన్నికను ఆర్‌ఎస్‌ఎస్‌ శాసించదన్నారు. ‘మేం సలహా ఇవ్వగలం  .. తుది నిర్ణయం వారిదేని తెలిపారు.  నూతన విద్యా విధానానికి మేం మద్దతిస్తున్నాం. ఇంగ్లీష్‌ నేర్చుకోవడంలో తప్పులేదు’’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ తరఫున ఆర్‌ఎస్‌ఎస్‌ నిర్ణయాలు తీసుకుంటుందని  ప్రతిపక్షాల నుండి వస్తున్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రాలతో తమకు మంచి సమన్వయం ఉందని మోహన్ భగవత్ వెల్లడించారు.  

మనిషికి, డబ్బుకు మధ్య సంబంధం!

Publish Date:Jan 12, 2026

“మనం డబ్బును సంపాదిస్తాం కానీ, డబ్బు మనల్ని సంపాదించడం లేదు కదా?” అని డాంబికంగా పలికేవారున్నారు. అనడానికైతే ఇలా అన్నప్పటికీ వారి జీవితమంతా డబ్బుకు దాస్యం చేస్తూనే వుంటారు. ఆ డబ్బుకై ఎవరినైనా ఆశ్రయిస్తారు. ఎంతైనా వేడుకుంటారు. లేనితనం వల్ల వీరిలా తయారైనారా అంటే అది నిజం కాదు, కేవలం ధనం మీద ఆపేక్షే వీరినిస్థితికి తెచ్చింది. అసలీ జీవితాన్ని ధనార్జనకు కాక మరొకందుకు వినియోగించే వీలుందనే ఆలోచన కలగదు. మతాన్ని ఆశ్రయించామని, దైవారాధనకు అంకితమయామని ప్రకటించే వారిలో కూడా చాలా మందికి ధనమే దైవం వారు తలపెట్టే “మహత్కార్యా” లన్నిటికీ ధనం పోగుచేస్తుంటారు. ఎక్కడో వందలాది ఎకరాల స్థలం కొంటామంటారు. అక్కడ అనేకమందిని చేర్చి ఏదో విశ్వమానవ కల్యాణం సాధిస్తామంటారు. మిగతా రంగాల్లో పనిచేసేవారు కూడా ఇలాంటి "లోక కళ్యాణ” పథకాలే రూపొందిస్తుంటారు. సినిమాలు తీసేవారు, సినిమాహాళ్ళు కట్టించేవారు. హోటళ్ళు నెలకొల్పేవారూ, మార్కెట్లోకి కొత్తపత్రికలు వెలువరించేవారూ, మార్కెట్లోకి కొత్త సబ్బు, విశిష్టమైన సూటింగ్ క్లాత్, చల్లటి కూల్డ్రింకు ప్రవేశ పెట్టేవారూ, అందరూ కూడా ప్రజాక్షేమం కాంక్షించే ఈ పనులు చేస్తున్నామంటారు. కానీ అందరికీ కావలసింది డబ్బే. కానీ డబ్బు అక్కరలేనివారు అరుదుగా ఎక్కడైనా కనిపించవచ్చు. అలాంటివారు కోర్కెల్నీ, సంకల్పాలనూ దాటి వుంటారు. నీమ్ కరోలి బాబా అలాంటి యోగి. ఆయన ఇటు ఇహంలోను, అటు పరంలోనూ ఏక కాలమందు నివసించినట్లు ఉండేవాడని అంటారు స్వామీ రామా. బాబా ఎవరి పరిచయమూ కోరేవాడు కాదు. ఎవరైనా తన దర్శనార్థమై వస్తే, “నేను మిమ్మల్ని చూడడమైనది. మీరు నన్ను చూడడమైనది. ఇక వెళ్ళిరండి" అనేయడం ఆయనకు అలవాటు. నైనిటాల్లో ఒకసారి బాబాతో కూచోనుండగా, భారతదేశంలోని అత్యంత ధనికుల్లో ఒకరైన ఒక వ్యక్తి కరెన్సీ కట్టలతో బాబా వద్దకు వచ్చారని అంటాడు స్వామీ రామా. " ఈ ధనమంతా మీకు సమర్పించడానికి తెచ్చానండీ" అన్నాడు ఆ ధనికుడు.  బాబా ఆ నోట్లకట్టలను కిందపరిచి చక్కగా వాటి మీద ఆసీనుడయ్యాడు. "కూర్చుకునేందుకు అంత మెత్తగా లేవు. వీటికన్నా దిండు నయం. నాకు చలిమంట వేసుకునే అలవాటు లేదు, పోనీ అందుకైనా ఉపయోగిద్దామంటే వీటినేమి చేయను?" అని అడిగాడు బాబా. "అయ్యా ఇది ధనమండీ" అన్నాడు అతడు.  బాబా ఆ మొత్తం తిరిగి ఇచ్చేస్తూ "దీనితో కాసిని పళ్ళు కొనుక్కురండి. అందరం తినచ్చు" అన్నాడు. "ఈ ప్రాంతంలో మార్కెట్ లేదు గదండీ?” అన్నాడు అతడు. "ఐతే మరి ఇది డబ్బెలా అవుతుందయ్యా. పండ్లు కూడా కొనలేని దీనిని నేనేమి చేసుకోను" అని, కాసేపు ఆగి "ఏమి కావాలని నావద్దకొచ్చావు" అన్నారు.  "నాకు విపరీతమైన తలనొప్పి, భరించలేని బాధ" అని చెప్పాడు అతడు "అది నువ్వు సృష్టించుకున్నదే, నేనేమి చేయగలను." అన్నారు బాబా.  "అలా అంటే ఎలా మహాత్మా? మీరు నాకు సాయపడాలి.” అని వేడుకున్నాడు అతను. అప్పుడు బాబా, “పోనీ పాపం” అనుకున్నట్లున్నారు.. “సరే ఇకనుండి నీకు తలనొప్పి ఉండదు పో, కానీ ఇవాళ నుండి నీవు ఇతరులకు పెద్ద తలనొప్పిగా రూపొందుతావు. నీ దగ్గర వెర్రి డబ్బు పోగవుతుంది. తద్వారా నీవు సమాజానికి గొప్ప శిరోవేదన కలిగిస్తావు, ఇక వెళ్ళు" అని పంపించేశాడు నీమ్ కరోలి బాబా. ఆయన చెప్పినట్లే, ఆ ధనికుడు ఆరోగ్యవంతుడై, తన జీవన విధానంతో సంఘానికి గొప్ప “శిరోభారం" గా పరిణమించాడు.                                             ◆నిశ్శబ్ద.
[

Health

]

చలికాలంలో నువ్వులు, అవిసె గింజలు తింటున్నారా? ఈ నిజాలు తెలుసుకోకుంటే నష్టపోతారు..!

Publish Date:Jan 12, 2026

మన శరీర ఉష్ణోగ్రత ప్రతి సీజన్‌లో నార్మల్ గా ఉంటుంది.  దాదాపు 37-38 డిగ్రీల సెల్సియస్  వరకు శరీర ఉష్టోగ్రత ఉంటుంది. అయితే చలికాలంలో బయటి ఉష్ణోగ్రత 5, 10, 15, లేదా 18 డిగ్రీల సెల్సియస్‌ గా నమోదు అవుతూ ఉంటుంది. ఇలాంటి  పరిస్థితిలో  శరీరం వెచ్చగా ఉండటానికి చాలా కష్టపడుతుంది. సరైన ఆహారం,  ఆరోగ్యకరమైన జీవనశైలి లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది.చాలామంది చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి నువ్వులు, అవిసె గింజలు తినడానికి ఆసక్తి చూపుతారు. చాలామంది వీటిని లడ్డులుగా చేసుకుని తింటుంటారు.  ఇవి ఆరోగ్యానికి ఆరోగ్యం,  పోషకాలతో మెరుగ్గా ఉంటాయి.  ఆరోగ్యకరమైన ఆహారాలుగా కూడా పరిగణింపబడతాయి. అయితే ఈ లడ్డులను తయారు చేసుకుని తినేవారు ఖచ్చితంగా కొన్ని విషయాలు తప్పక తెలుసుకోవాలని అంటున్నారు ఆహార నిపుణులు.  నువ్వులు, అవిసె గింజలు లాంటి పదార్థాలను తీసుకునే ముందు కొన్ని విషయాలు తప్పక తెలుసుకోవాలి.  లేకపోతే చాలా నష్టం చూడాల్సి ఉంటుంది. ఇంతకీ ఆ విషయాలు ఏంటో తెలుసుకుంటే.. శీతాకాలంలో ఆరోగ్యకరమైన లడ్డులు తినడం ఒక ట్రెండ్. కానీ చాలామంది మొదట రుచికి, తరువాత ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తారు. అందుకే లడ్డులు తయారుచేసినప్పుడల్లా రుచి  కంటే  ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడం కోసమే వాటిని తింటున్నామని గుర్తుంచుకోవాలి. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. చలికాలంలో నువ్వులు,  అవిసె గిండలతో  చేసిన లడ్డులు రోజుకు ఒక చిన్న లడ్డూ సరిపోతుంది. దీని కంటే ఎక్కువ అవసరం లేదు. ఉదయం అల్పాహారం తర్వాత లేదా మధ్యాహ్నం సమయంలో  తినడం మంచిది.  సాయంత్రం స్నాక్‌గా కూడా ఆస్వాదించవచ్చు. రాత్రిపూట వీటిని తినడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి రాత్రిపూట వాటిని తినకుండా ఉండటం మంచిది. ఒకే రకమైన లడ్డూ తినడం కంటే.. 3-4 రకాల లడ్డూలను తయారు చేసి, ఒక్కొక్క సారి ఒక్కొక్కటి తినడం మంచిది.   ఇవి ఆరోగ్యకరమైనవి. చాలామంది అన్ని రకాల  విత్తనాలు కలిపి లడ్డులు చేస్తుంటారు. ఇది మంచిది కాదు. ఈ లడ్డులను  తీసుకునేటప్పుడు పాలు తాగాల్సిన అవసరం లేదు. లడ్డులు  సులభంగా జీర్ణమైతేనే తీసుకోవాలి. వాటిని తిన్నప్పుడు జీర్ణసంబంధ సమస్యలు వచ్చినా,  గ్యాస్, ఉబ్బరం, అసిడిటీ వంటి సమస్యలు వచ్చినా వాటిని తీసుకోకపోవడం మేలు. పిల్లలు,  వృద్ధులు నువ్వులు, అవిసె గింజలతో చేసిన  లడ్డులను తినకూడదు. ఎందుకంటే వారిలో   జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉంటుంది. జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉన్నవారు ఈ రకమైన లడ్డులు   తినకూడదు. ఈ తప్పులు చేయకూడదు.. లడ్డులను కట్టడానికి పెద్ద మొత్తంలో నెయ్యిని ఉపయోగిస్తారు. దీని వల్ల వాటిలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. చక్కెరకు బదులుగా బెల్లం వాడటం వల్ల లడ్డు ఆరోగ్యంగా మారుతుంది, కాబట్టి మధుమేహం ఉన్నవారు కూడా దీనిని తినవచ్చనుకుంటారు. కానీ  చక్కెర స్థాయి అదుపులో లేనప్పుడు ఈ లడ్డులను తినడం మంచిది కాదు. తీవ్రమైన కాలేయం,  మూత్రపిండాల రోగులు ఈ లడ్డులను  వైద్యులు  లేదా డైటీషియన్‌ను సంప్రదించకుండానే తీసుకోకూడదు. ఈ లడ్డులను స్నాక్స్ గా చిరుతిండిగా తీసుకుంటారు. కానీ వీటిని స్నాక్స్ పేరుతో ఎక్కువ తినడం కంటే ఇవి శరీరానికి ఒక మంచి మెడిసిన్ అనుకుని తీసుకుంటే మంచిది. లడ్డులను ఇంట్లోనే తయారు చేసుకుని తినడం మంచిది. బయటి లడ్డుల తయారీలో కల్తీ పదార్ధాలు వాడే అవకాశం ఎక్కువ. ఇంట్లో ఈ లడ్డులు తయారు చేసేటప్పుడు పాలను కలపడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. కాబట్టి పాలను వాడకపోవడం మంచిది.                         *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...