అసెంబ్లీ సమావేశాలకు జగన్ డుమ్మా!?..
posted on Jun 20, 2024 @ 11:30AM
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టనున్నారా? అందు కోసం ఆయన దారులు వెతుక్కుంటున్నారా? అసెంబ్లీకి ముఖం చాటేసి... తాను ముఖ్యమంత్రిగా ఉండగా చేసిన తప్పిదాలను ఎత్తి చూసి సంధించే ప్రశ్నాస్థ్రాల నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారా? అంటే పరిశీలకుల నుంచి ఔననే సమాధానమే వస్తున్నది.
అసెంబ్లీ సమావేశాలకు ముందుగానే పార్టీ శాసనసభా పక్ష సమావేశం నిర్వహించి శాసనసభాపక్ష నేతను ఎన్ను కోవలసి ఉంటుంది. కానీ ఫలితాలు వెలువడి ఇన్ని రోజులైనా జగన్ వైసీపీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించలేదు. సభ్యుల చేత లాంఛనంగా తానే శాసనసభాపక్ష నేతను అన్న ఏకగ్రీవ తీర్మాం చేయించలేదు. పైగా పార్టీ విస్తృత స్థాయి సమావేశం అంటున్నారు. అంటే దీని ఈ శుక్రవారం (ఈ నెల 21) నుంచి జరగనున్న శాసనసభ సమావేశాలకు జగన్ హాజరయ్యే అవకాశాలు దాదాపు మృగ్యమే అని తెలుస్తోంది. ప్రభుత్వం మారిన తరువాత జరిగే తొలి అసెంబ్లీ సెషన్ లో కేవలం సభ్యుల ప్రమాణ స్వీకారం, దాని కంటే ముందు ప్రొటెం స్పీకర్ ఎన్నిక ఉంటుంది. కనీసం అసెంబ్లీ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు కూడా జగన్ సభకు వచ్చే అవకాశాలు లేవని అంటున్నారు. ఎవరూ తరువాతెప్పుడో ఎవరూ లేకుండా స్పీకర్ ఛాంబర్ లో శాసన సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసేందుకే జగన్ మొగ్గు చూపుతున్నట్లు చెబుతున్నారు. అంటే తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమి తరువాత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశాలకు ముఖం చాటేసిన విధంగానే జగన్ అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటారని అంటున్నారు.
కాగా అధికారంలో ఉండగా ప్రత్యర్థులకు పూచిక పుల్ల పాటి విలువ కూడా ఇవ్వకుండా అహంకారంతో వ్యవహరించడంలో కేసీఆర్, జగన్ లకు సారూప్యత ఉందనీ, అదే విధంగా ఎన్నికల తరువాత ఓటమిని అంగీకరించకుండా తమకు ఓటు వేయకుండా జనం తప్పు చేశారన్నట్లుగా వ్యాఖ్యలు చేసిన తీరులో కూడా ఇరువురి వైఖరీ ఒకేలా ఉందనీ పరిశీలకులు పోల్చి చూపుతున్నారు. అదే విధంగా అసెంబ్లీ సమావేశాలకు హాజరు విషయంలో కూడా జగన్ కేసీఆర్ లాగే ముఖం చాటేసే అవకాశాలే ఎక్కువ ఉన్నాయంటున్నారు.