పైసాలేదు.. పనిలేదు
posted on Aug 5, 2015 @ 12:03PM
రెండు రాష్ట్రాల్లో ఉన్న జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌లు పరిస్థితి మరీ అద్వానంగా తయారయాయి. అప్పట్లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నంద మూరి తారకరామారావు హయాంలో గ్రామాల అభివృద్ధే దిశగా.. ప్రజల వద్దకే పాలన లక్ష్యంగా ఏర్పాటు చేసిన స్థానిక సంస్ధలు ఇప్పుడు ఏదో విగ్రహల్లా మారిపోయాయి. ఒకప్పుడు నిధులు, విధులతో కళకళలాడిపోయిన జిల్లా పరిషత్‌లు ఇప్పుడు నిధులు లేక వాటి పరిస్థితి ప్రశ్నార్ధకంగా మారింది. అప్పట్లో ఎన్టీఆర్ గ్రామాల్లోని ప్రజల సమస్యలు, అభివృద్ధికి ఇతోధికంగా నిధులు విడుదల చేశారు.. కానీ కాలక్రమేణా రాష్ట్ర ప్రభుత్వాలు వీటికి నిధులు విడుదల చేయడమే మరిచిపోయినట్టు ఉన్నాయి. అయితే 14వ ఆర్థిక సంఘం ప్రకారం కేంద్ర ప్రభుత్వం మాత్రం నిధులను గ్రామ పంచాయితీలకు కేటాయిస్తుంది కాని మండల, జిల్లా పరిషత్ లకు నిధులు విడుదల చేయకపోవడంతో ఇప్పుడు వీటి పరిస్థితి ఉత్సవ విగ్రహాలుగా మారాయి. అటు దీంతో ఆ కార్యలయాల్లోని అధికారులు పనులు లేక పర్యవేక్షణకు మాత్రమే పరిమితమయ్యారు.
మరోవైపు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి నిధులు కేటాయించాలన్న విషయంపై దృష్టిపెట్టకపోవడంతో కూడా అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. కాగా మరోవైపు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు నిధులు విడుదల చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ప్రజలచే నేరుగా ఎన్నుకున్న తమకు నిధులు, విధులు లేక ఉత్సవవిగ్రహాలుగా మార్చొద్దని వారు వేడుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా జిల్లా పరిషత్, మండల పరిషత్‌ల మనుగడకు నిధులు విడుదల చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ మేరకు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఏ మేరకు చర్యలు తీసుకుంటాయో వేచిచూడాల్సిందేమరీ. ఇప్పటికే అన్ని విషయాల్లో గొడవ పడుతున్న రెండు ప్రభుత్వాలు కొంచెం ఎంపీటీసీలు, జడ్పీటీసీలు పరిస్థితి కూడా కొంచెం ఆలోచిస్తుందే బావుంటుంది.