ఇద్దరు మిత్రుల మధ్య జగడమా? జగన్, కేసీఆర్ పై రఘురామ సంచలనం..
posted on Jul 6, 2021 @ 6:07PM
తన లేఖలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సీఎం జగన్మోహన్ రెడ్డిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాలపై కొన్ని రోజులుగా సాగుతున్న జల జగడంపై తనదైన శైలిలో స్పందించారు రఘురామ. ఈ అంశంపై ఆయన కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్‌కు లేఖ రాశారు. ఇరు రాష్ట్రాల మధ్య నీటి వివాదాన్ని పరిష్కరించాలని కోరారు. ఇద్దరు శత్రువుల మధ్య వివాద పరిష్కారం సులువుగా చేయొచ్చన్నారు ఎంపీ రఘురామకృష్ణరాజు. కాని ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు మంచి మిత్రులని చెప్పారు. ఇద్దరు మిత్రుల మధ్య వివాద పరిష్కారం అంత సులువు కాదన్నారు రఘురామ రాజు. వివాదం ముదిరి శాంతిభద్రతల సమస్యగా మారే ప్రమాదం ఉందని లేఖలో పేర్కొన్నారు. ఈ విషయంలో కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు. శ్రీశైలం డ్యామ్, విద్యుత్ కేంద్రాల దగ్గర కేంద్ర బలగాలతో భద్రత ఏర్పాటు చేయాలన్నారు. నీరు, విద్యుత్ పంపిణీ బాధ్యతలు కేంద్రం తీసుకోవాలని తన లేఖలో కోరారు ఎంపీ రఘురామ రాజు.
నవ సూచనలు పేరుతో సీఎం జగన్ కు లేఖాస్త్రాలు సంధిస్తున్న రఘురామ.. తాజాగా మరో లేఖ రాశారు. ఏపీ ప్రభుత్వంలో సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర ఏంటో స్పష్టంగా వివరించాలని సీఎం జగన్ ను డిమాండ్ చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఏపీ ప్రభుత్వానికి ప్రజా సంబంధాల విషయంలో సలహాదారు అని అందరికీ తెలిసిందేనని, కానీ, ఆయన ప్రతి అంశంపైనా స్పందిస్తున్నాడని, ఈ అధికారం ఆయనకు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. లేకపోతే లోగుట్టు పెరుమాళ్లకెరుక అని భావించాలా? అని పేర్కొన్నారు. సజ్జల రాజ్యాంగేతర శక్తిగా పరిణమిస్తున్నాడని ప్రజానీకం భావిస్తోందన్నారు రఘురామ. అధికారులకు సూచనలు ఇస్తూ ప్రభావితం చేయడం, మంత్రులను బెదిరించడం, ప్రభుత్వం పేరిట పార్టీ కార్యకలాపాల్లో జోక్యం చేసుకోవడం వంటి చర్యలకు పాల్పడుతున్నట్టు బయట ప్రచారం జరుగుతోందన్నారు. తన అధికారాన్ని, హోదాను ప్రదర్శిస్తూ తెరవెనుక హోంమంత్రిగా చెలామణీ అవుతున్నారని వైసీపీ వర్గాలే అనుకుంటున్నాయని చెప్పారు రఘురామ.
డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ వంటి ఉన్నత విద్యావంతులైన వృత్తి నిపుణులు జగన్ క్యాబినెట్లో మంత్రులుగా ఉన్నారన్నారు రఘురామ రాజు. కానీ, సజ్జల వారిని కూడా మించిపోయి క్యాబినెట్ మంత్రి తరఫున నీటి పారుదల అంశాలపై మాట్లాడుతున్నారని చెప్పారు. ఇది నా ఒక్కడి అభిప్రాయం మాత్రమే కాదని, ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి మనసులోనూ ఈ అసంతృప్తి ఉందన్నారు. ఇకనైనా ఈ ప్రభుత్వంలో సజ్జల పాత్ర ఏంటో వివరించాలని తన లేఖలో సీఎంను కోరారు రఘురామ. సజ్జల ప్రభుత్వం తరఫున మాట్లాడాలి అనుకుంటే ఆయనను మండలికి పంపడమో, మంత్రివర్గంలోకి తీసుకోవడమో చేయండి.. అలా కాకుండా సజ్జలను ఇలాగే కొనసాగిస్తే మాత్రం ప్రజాతీర్పును అపహాస్యం చేస్తున్నట్టే లెక్క అని ఘాటుగా విమర్శలు చేశారు ఎంపీ రఘురామ రాజు.