హరీశ్‌రావుకూ నా గతే పడుతుంది.. ఈటల శాపం.. కారులో కల్లోలం..
posted on Jul 6, 2021 @ 6:36PM
ఈటల రాజేందర్-హరీశ్‌రావు. ఉద్యమ కాలం నుంచీ మంచి స్నేహితులు. ప్రభుత్వంలోనూ కలిసి పని చేశారు. కేసీఆర్‌కు రైట్-లెఫ్ట్ హ్యాండ్స్‌గా ఉండేవారు. ఇదంతా గతం. కేటీఆర్ ఎంట్రీతో రెండు చేతులూ ఆయనే అయ్యారు. వాళ్లిద్దరూ కరివేపాకులా మారారు. వీళ్లకు ఒళ్లుమండింది. ఎప్పుడూ దొర కింద బానిస బతుకేనా..? తానూ యజమానినేనంటూ ఈటల గులాబీ జెండాపై ఎర్రజెండా ఎగరేశారు. కట్‌చేస్తే.. ఇప్పుడు కాషాయజెండా కప్పుకున్నారు. ఇదీ ఈటల ఎపిసోడ్.
ఇక, హరీశ్‌రావుది మరోటైప్ కహానీ. కేసీఆర్ మేనల్లుడు కావడం.. స్వతహాగా నాయకత్వ లక్షణాలు ఉండటంతో.. ఉద్యమంలో, పార్టీలో, ప్రభుత్వంలో నెంబర్ 2 పొజిషన్‌కు చేరుకున్నారు. ఇక అంతా సెటిల్ అనుకునే టైమ్‌లో కేటీఆర్ ఎఫెక్ట్ గట్టిగానే తాకింది. ఎంతైనా కొడుక్కంటే అల్లుడు ఎక్కువైతడా ఏంది? అందుకే, తంతే.. పోయి సిద్ధిపేటలో పడ్డారు. కొన్ని నెలల పాటు నియోజకవర్గం వీడి వార్తల్లోకి రాలేని దుస్థితి. గత ఎన్నికల్లో కేసీఆర్‌కు వెన్నుపోటు పొడిచి.. గజ్వేల్‌లో మామను ఓడించాలని కుతంత్రం కూడా చేశారని అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి ఒంటేరు ప్రతాప్‌రెడ్డి ఏకంగా బహిరంగ సభలోనే ప్రకటించడం తీవ్ర కలకలం రేపింది. ఆ తర్వాత కూడా హరీశ్‌రావు-ఈటల రాజేందర్‌లు కలిసి.. కేసీఆర్‌కు అగెనెస్ట్‌గా కుట్రలు చేసేందుకు ప్రయత్నించారని అంటారు.
హరీశ్‌ను ఉన్నపళంగా ఈటలను మెడబట్టి గెంటేసినట్టు గెంటేయలేరు.. అలాగని నెత్తిన పెట్టుకు ఊరేగలేరు. అందుకే, కీలకమైన నీటిపారుదలశాఖ మంత్రి నుంచి తప్పించి.. కొన్నాళ్లు ఖాళీగా ఉంచి.. పెద్దగా ప్రాముఖ్యంలేని ఆర్థిక శాఖను అప్పగించి.. ఏ ఎన్నికలోనూ ముందుంచకుండా.. ట్రబుల్ షూటర్‌కే ట్రబుల్స్ క్రియేట్ చేసి.. దారికి తెచ్చుకున్నారు సీఎం కేసీఆర్. అల్లుడికి సైతం తన స్థాయి, స్థానమేంటో తెలిసొచ్చినట్టుంది.. కేసీఆర్‌కు సరెండర్ అయి.. ఛాన్స్ కోసం ఎదురుచూశారు. ఈటల వ్యవహారంతో మళ్లీ యాక్టివ్ అయి.. సీఎం కేసీఆర్‌కు మళ్లీ దగ్గరయ్యారు. ఎంతైనా మనోడే కదాని.. హరీశ్‌ను మళ్లీ తన పక్క సీట్లో కూర్చోబెట్టుకుంటూ.. ప్రభుత్వంలో ఆయన ప్రయారిటీని పెంచేస్తున్నారు. ఇదీ హరీశ్‌రావు ఎపిసోడ్.
ఇప్పుడు వీరిద్దరి గురించి ఇంత డిష్కసన్ ఎందుకంటే.. తాజాగా మాజీ మంత్రి ఈటల రాజేందర్.. హరీశ్‌రావును ఉద్దేశించి సంచలన కామెంట్లు చేశారు. హరీశ్‌రావు.. కేసీఆర్ మెప్పు పొందాలని తనను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని.. ఆయన ఎన్నటికీ కేసీఆర్ మెప్పు పొందలేరని జోస్యం చెప్పారు. టీఆర్ఎస్‌లో హరీశ్‌రావుకు సైతం చివరికి తనకు పట్టిన గతే పడుతుందని శాపనార్థం పెట్టడం కలకలం రేపుతోంది. ఇటీవల టీఆర్ఎస్‌ను వీడే సమయంలోనూ తన దోస్త్‌ను తనపైకే ఉసుగొల్పుతున్నారంటూ ఈటల చేసిన వ్యాఖ్యలు హరీశ్‌రావు గురించే. వారి మధ్య అంత స్నేహం ఉండేది మరి. మారిన పరిస్థితుల్లో ఇప్పుడు వారి మధ్య అంతే వైరం పెరిగిందంటున్నారు. టీఆర్ఎస్‌లో తనకంటే హరీశ్‌రావే ఎక్కువ అవమానాలు పడ్డారని ఈటల అనడం.. నీపని నువ్వు చూసుకో, నా సంగతి నీకెందుకంటూ ఆ తర్వాత హరీశ్‌రావు లేఖ రాయడంతో వారి బంధం పూర్తిగా బెడిసికొట్టింది.
హుజురాబాద్ గెలుపు బాధ్యతలను మంత్రి హరీష్‌రావుకు అప్పగించారు సీఎం కేసీఆర్. కొన్ని వారాలుగా హుజురాబాద్‌లో ఈటలను దెబ్బతీసేలా.. టీఆర్ఎస్‌ను బలోపేతం చేసేలా.. హరీశ్‌రావు వ్యూహాలు పన్నుతున్నారు. ఆ చర్యలు ఈటలను బాగా ఇబ్బంది పెడుతుండటంతో.. ఆయనలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తన చిరకాల మిత్రుడు.. ఇలా శత్రువు కావడాన్ని తట్టుకోలేక.. హరీశ్‌రావుపైనా విమర్శలు చేయక తప్పని పరిస్థితి వచ్చింది. ‘హరీష్ రావు ఇక్కడి మందిని తీసుకుపోవాలే.. దావత్ ఇయ్యాలే.. డబ్బులు ఇయ్యాలే.. ఇదే పని ఆయనది అంటూ ఈటల విమర్శలు గుప్పించారు.
మావైపు తిరిగే యువకులను ఇబ్బంది పెడుతున్నారని, ప్రతి ఒక్కరిని బెదిరించి టీఆర్ఎస్ కండువాలు కప్పుతున్నారన్నారు. పోలీసులు చట్టానికి లోబడి పనిచేయకుండా, మావాళ్ళను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోబోమని ఈటల హెచ్చరించారు. ‘కొంతమంది ఎమ్మెల్యేలు బానిసలుగా ఉండవచ్చు కానీ ఇంత గోరంగా ఉంటారా..? మీకు మీరు ఆత్మవిమర్శ చేసుకోండి.. రేపు మీ నియోజకవర్గంలో మీ పరిస్థితి ఇంతే’ అని ఈటల విమర్శించారు.
ఇలా.. మారిన కాలమాన పరిస్థితుల్లో ఒకప్పటి జాన్ జిగ్రీ దోస్తులు.. ఇప్పుడిలా పరస్పరం ఓడించుకునేందుకు కత్తులు దూస్తుండటం రాజకీయాల్లో పరిస్థితి ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేమనడానికి నిదర్శనం. అయితే, హరీశ్‌రావుకు సైతం ఎప్పటికైనా తనకు పట్టిన గతే పడుతుందని ఈటల ఆరోపించడం.. టీఆర్ఎస్‌లో మామా-అల్లుల్ల కోల్డ్‌వార్‌కు ఇండికేషన్. ఏమో.. ఎవరు చెప్పగలరు.. భవిష్యత్‌లో ఈటల జోస్యమే నిజమవుతుందేమో.. హరీశ్‌రావుకూ ఈటలకు పట్టిన గతే పడుతుందేమో.. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అంటారుగా....