యాక్షన్‌లోకి వీర్రాజు.. మరి, డైరెక్షన్ ఎవరో?
posted on Jul 3, 2021 @ 7:25PM
తిరుపతి ఎన్నికల తర్వాత ఏం చేయాలో..ఏం మాట్లాడాలో కూడా అర్ధం కాని పరిస్ధితిలో పడిపోయాడు మన వీర్రాజు. కాని ఇప్పుడు ఒక అసైన్ మెంట్ సార్ కి అప్పచెప్పినట్లు కనపడుతోంది. అది ఢిల్లీ అధిష్టానం అప్పచెప్పిందా.. లేక లోకల్ ఫ్రెండ్ అప్పచెప్పాడా.. లేక, ఢిల్లీ అధిష్టానం అనుమతితో లోకల్ ఫ్రెండ్ చెప్పింది చేస్తున్నాడా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. కాని వీర్రాజు మాత్రం పనిలోకి దిగిపోయాడు. దాదాపు పది రోజుల నుంచి మొదలైంది ఆయన మిషన్. ముందు జగన్ పై విమర్శలతో మొదలైన ఆ మిషన్.. క్రమంగా టీడీపీని సైలెంట్ చేయడానికి.. వారిని వెనక్కు నెట్టి.. జగన్ కు తామే ప్రత్యామ్నాయమని చెప్పుకోవడానికే పని చేస్తోందని అర్ధమవుతోంది.
జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఇరుకున పడ్డారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నిరుద్యోగుల్లో రాజకీయాలకతీతంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఆఖరికి సాక్షి టీవీ డిబేట్ కి ఫోన్ చేసిన జగన్ ఫ్యాన్స్ సైతం..జాబ్స్ కావాలని కాస్త జగనన్నకు చెప్పండని అడగటం పరిస్ధితి తీవ్రతకు అద్దం పడుతోంది. పైగా టీచర్ పోస్టులపై మంత్రులు, సజ్జల వంటి పెద్దలు మాట్లాడిన మాటలు కూడా వైసీపీ ప్రభుత్వం డిఫెన్స్ లో పడిందనే చెబుతున్నాయి. మరోవైపు టీడీపీ నేత నారా లోకేష్ కూడా దూకుడుగా ఈ విషయంపై ముందుకు వెళుతున్నారు.
అలాగే డబ్బులు సరిపోక సంక్షేమ పథకాల్లో లబ్దిదారుల సంఖ్య తగ్గించడానికి కోతలు మొదలయ్యాయి. దీంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఇటు అమరావతి ప్రాంతంలో అసంతృప్తి... అటు విశాఖలో రాజధాని వస్తుందనే ఆనందం కన్నా.. భూముల కబ్జా వ్యవహారంతో అక్కడి ప్రజల్లో టెన్షన్..ఇలా రకరకాలుగా వైసీపీ డిఫెన్సులో పడుతోంది.
మరోవైపు కోవిడ్ కారణంతో వెనకబడ్డ టీడీపీ నేతలు ఇప్పుడు దూకుడు పెంచారు. కోవిడ్ బాధిత కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చంద్రబాబునాయుడే దీక్ష చేయడంతో కాస్త సీరియస్ నెస్ పెరిగింది. అలాగే లోకేష్ పదవ తరగతి, ఇంటర్ పరీక్షల రద్దుకు ఎక్కడా వెనక్కు తగ్గకుండా పోరాటం చేసి విజయం సాధించారనే పేరు వచ్చింది. వీటన్నిటితో టీడీపీలో యాక్టివిటీ పెరుగుతోంది. ఒకవైపు ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుండటం..మరోవైపు టీడీపీ యాక్టివ్ కావటం.. రెండూ డేంజర్ సిగ్నల్స్ గా జగన్ భావిస్తున్నట్లు కనపడుతోంది.
తన రహస్య మిత్రుడిని కాపాడటంతో పాటు.. అటు టీడీపీని వెనక్కు నెట్టేయడానికే ఇప్పుడు వీర్రాజు రంగంలోకి దూకారు. ముందు కేంద్రంలో ఫ్రెండ్ షిప్ ఏమీ లేదని చెప్పడం.. జగన్ హయాంలో అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయని ఆరోపించడం మొదలెట్టారు. జాబ్ క్యాలెండర్ పై ఒక్క రోజు లేటు అయినా.. తమ విద్యార్ధి విభాగం ఏబీవీపీని రంగంలోకి దింపారు. ఇప్పుడు జల వివాదంపై హైలెట్ చేసే పనిలో పడ్డారు. రాయలసీమకు అన్యాయమంటూ ఆందోళన కార్యక్రమాలకు ప్లాన్ చేసుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు కూడా. ఇలా తమ యాక్షన్ ప్లాన్ బూజు దులిపి.. తిరుపతి ఎన్నికల తర్వాత మళ్లీ యాక్టివ్ అవుతున్నారు సోము వీర్రాజు.