జగన్, విజయసాయి, సజ్జల.. ముగ్గురితో రఘురామ చెడుగుడు..
posted on Oct 7, 2021 @ 8:49PM
రఘురామకృష్ణరాజు. ఈ పేరు వింటేనే వైసీపీలో వణుకు. పార్టీ అధినేతకే చుక్కలు చూపిస్తున్న ఘనుడు. సీఎం జగన్ సాక్షులను ప్రభావితం చేస్తున్నారని.. వెంటనే ఆయన బెయిల్ రద్దు చేసి జైలుకు తరలించాలని కోర్టులో పిటిషన్ వేసి.. విచారణతో హడావుడి చేశారు. సీబీఐ కోర్టు ఆ కేసు కొట్టేసినా.. ఇప్పుడు మళ్లీ హైకోర్టును ఆశ్రయించి వదల బొమ్మాళీ అంటున్నారు. ఏ1 జగన్‌తో పాటు ఏ2 విజయసాయిరెడ్డినీ వదలడం లేదు రఘురామ. ముందు జగన్ బెయిల్ రద్దు కోసం మాత్రమే కేసు వేశారు. ఆ తర్వాత విజయసాయిరెడ్డి బెయిల్ కూడా రద్దు చేయాలంటూ కోర్టును ఆశ్రయించారు. ఇలా వైసీపీలో నెంబర్ 1, నెంబర్ 2ల పని పడుతున్న రఘురామ.. తాజాగా నెంబర్ 3ని సైతం టార్గెట్ చేశారు.
ప్రభుత్వ సలహాదారుడిగా ఉన్న సజ్జల తన విధులు మీరుతున్నారని, వైసీపీ ప్రభుత్వం తరపున పత్రికా సమావేశాలు. ప్రకటనలు చేయకుండా నిలువరించాలని, రాష్ట్ర సివిల్ సర్వీస్ నిబంధనల మేరకు చర్చలు తీసుకునేలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించాలని హైకోర్టులో రఘురామ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం తాజాగా విచారణకు వచ్చింది. సజ్జల నియామకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోతో పాటు రాష్ట్ర సివిల్ సర్వీస్ నిబంధనలను న్యాయస్థానం ముందుంచాలని రఘురామ తరపు న్యాయవాదిని ఆదేశించింది ధర్మాసనం.
ప్రభుత్వ జీతం, ఇతర ప్రయోజనాలు పొందుతున్న సజ్జల సివిల్ సర్వీస్ నిబంధనలకు వ్యతిరేకంగా వైసీపీ ప్రతినిధిగా వ్యవహరిస్తూ మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. సుమారు 5 లక్షల జీతం పొందుతూ ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జల వైసీపీ పార్టీకి చెందిన నాయకుడని, ఆయన వైసీపీ ప్రధాన కార్యదర్శిగా మూడు జిల్లాలకు ఇంఛార్జ్ గానూ పని చేస్తున్నారని రఘురమ పిటిషన్‌లో పేర్కొన్నారు. సలహాదారులకు ప్రత్యేక నియామవళి లేదని.. వారికి సివిల్ సర్వీసెస్ నిబంధనలే వర్తిస్తాయని తెలిపారు. వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ సలహాదారు సజ్జలపై చర్యలు తీసుకునేలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించాలని రఘురామ కోర్టును కోరారు.
జగన్, విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ తరహాలోనే సజ్జలపైనా బలమైన వాదనలు వినిపిస్తున్నారు ఎంపీ రఘురామ. అయితే, జగన్, సాయిరెడ్డి కేసుల్లో సీబీఐ తటస్థంగా ఉండటం వారికి అనుకూలించగా.. సజ్జల కేసులో మాత్రం నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నట్టే భావించే అవకాశం ఉందనేది న్యాయ నిపుణుల మాట.