రూ.100 కోట్ల బ్లాక్ మనీ!.. హెటిరో ఐటీ రైడ్స్‌లో సంచలనం.. జగన్‌తో లింకేంటి?
posted on Oct 7, 2021 @ 9:23PM
ఒకటి రెండు కాదు.. రూ.100,00,00,000. అక్షరాల వంద కోట్లు. హెటిరో డ్రగ్స్ సంస్థల కార్యాలయాల్లో జరిగిన ఐటీ రైడ్స్‌లో దొరికిన నగదు. రెండు రోజుల పాటు హెటిరో డ్రగ్స్ ఆఫీసుల్లో ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. సీఈవో, డైరెక్టర్లు, ముఖ్య ఉద్యోగుల ఇళ్లలో తనిఖీలు జరిపారు. హైదరాబాద్‌లోని కార్పొరేట్ కార్యాలయంతో పాటు ఏపీలోని నక్కలపల్లిలో ఐటీ ఆపరేషన్ కొనసాగింది.
హైదరాబాద్, విశాఖలోని పలు కార్యాలయాల్లో రూ.100 కోట్లకుపైగా నగదు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఇంత పెద్ద మొత్తంలో నగదు లభించడంపై అధికారులే ఆశ్చర్యపోతుర్నారు. ఏకంగా 100 కోట్ల నగదు ఎక్కడి నుంచి ఎలా తీసుకొచ్చారనే దానిపై ఆరా తీస్తున్నారు.
నగదుపై ఉన్న బ్యాంకు సీల్‌ను పరిశీలించడంతో పాటు ఆ మొత్తాన్ని ఎప్పుడు డ్రా చేశారు? ఏ బ్యాంకు నుంచి డ్రా చేశారు? తదితర వివరాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఐటీ సోదాల్లో అనేక కీలక డాక్యుమెంట్లు, హార్డ్‌డిస్క్‌లు సీజ్ చేశారు. ట్యాక్స్ చెల్లింపుల్లో భారీగా అవకతవకలు జరిగినట్లు గుర్తించారు.
విదేశాల నుంచి హెటిరో సంస్థ పెద్ద మొత్తంలో ముడి సరుకు దిగుమతి చేసుకుంటోందని.. అయితే, ఆ ఎగుమతి, దిగుమతిలో భారీగా వ్యత్యాసాలున్నట్లు తెలుస్తోంది. విలువ తక్కువ చేసి ఇన్‌వాయిస్‌లు సృష్టించినట్లు తేల్చారు. మరో రెండు రోజుల పాటు ఐటీ రైడ్స్ కొనసాగుతాయని సమాచారం. సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడైన పార్థసారధిరెడ్డికి చెందిన హెటిరో డ్రగ్స్ సంస్థల్లో.. లెక్కల్లో చూపించని 100 కోట్ల నగదు లభించడం సంచలనంగా మారింది. ఇంత పెద్ద స్థాయిలో బ్లాక్‌మనీని.. అది కూడా కరెన్సీ నోట్ల రూపంలో దాయడం మామూలు విషయమేమీ కాదు. డిజిటల్ ఇండియా స్పూర్తికే విఘాతం అంటున్నారు. మరోవైపు, ఆ 100 కోట్లు హెటిరో యజమాని పార్థసారధిరెడ్డివేనా? ఆయన జగన్, విజయసాయిరెడ్డిలకు చాలా చాలా క్లోజ్ కాబట్టి.. ఆ బ్లాక్‌మనీతో వారికేమైనా సంబంధముందా? అనే అనుమానమూ వస్తోందంటున్నారు.