రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్ సింగ్ ఎన్నిక
posted on Sep 14, 2020 @ 7:06PM
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా జేడీయూ నేత, ఎన్డీయే అభ్యర్థి హరివంశ్ నారాయణ్ సింగ్ ఎన్నికయ్యారు. హరివంశ్ సింగ్ డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికైనట్టు రాజ్యసభ చీఫ్ వెంకయ్యనాయుడు ప్రకటించారు.
డిప్యూటీ చైర్మన్ పదవి కోసం హరివంశ్ పేరును బీజేపీ జాతీయ అధ్యక్షుడు, ఎంపీ జేపీ నడ్డా ప్రతిపాదన చేయగా, కేంద్రమంత్రి తవర్చంద్ గెహ్లాట్ బలపరిచారు. అటు, విపక్ష అభ్యర్థిగా ఆర్జేడీ నేత మనోజ్ కుమార్ ఝా పేరును కాంగ్రెస్ నేత గులాంనబీ అజాద్ ప్రతిపాదించగా, కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ బలపరిచారు. వాయిస్ ఓట్ ద్వారా రాజ్యసభ ఛైర్మన్ ఎన్నిక నిర్వహించగా.. మనోజ్ ఝాపై హరివంశ్ సింగ్ విజయం సాధించారు.
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్ వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. హరివంశ్ తొలిసారిగా 2018 ఆగస్టు 8న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా ఎన్నికయ్యారు. అయితే రాజ్యసభ సభ్యుడిగా ఆయన పదవీకాలం 2020 ఏప్రిల్ తో ముగిసింది. అనంతరం మరోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. గత రెండేళ్లుగా పెద్దల సభను హరివంశ్ నడిపించిన తీరుతో పార్టీలకు అతీతంగా పలువురు సభ్యుల నుంచి ఆయనకు ప్రశంసలు లభించాయి.
ఇక, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి హరివంశ్ కి వైసీపీ, టీడీపీ, బీజేడీ మద్దతు ఇచ్చాయి. ఈ ఎన్నికకు టీఆర్ఎస్ దూరంగా ఉంది.