ఎంతమాటా! ఎంతమాటా!
posted on Feb 19, 2016 @ 2:57PM
- ‘ఆత్మహత్యలు చేసుకోవడం రైతులకి ఓ ఫ్యాషన్ అయిపోయింది. వారికి నష్టపరిహారాలు చెల్లించేందుకు ప్రభుత్వాలు పోటీపడుతున్నాయి’ రైతుల ఆత్మహత్యల గురించి గోపాల్ అనే పార్లమెంటు సభ్యుని వ్యాఖ్య.
- ‘నక్క ఎంత రంగుని పులుముకున్నా, దాని స్వభావాన్ని మార్చుకోలేదు. మిగతా నక్కలు ఊళలు వేసినప్పుడు, అది కూడా ఊళ వేసి తీరుతుంది’ఒక న్యాయమూర్తి మీద కేరళ రాష్ట్ర మంత్రి జోసెఫ్ అక్కసు.
- ‘రాహుల్‌గాంధి ఓ దేశద్రోహి. అలాంటివాడిని ఉరితీయాలి. కాల్చిపారేయాలి’ ఒక రాజస్థాన్ శాసనసభ్యుని ఉవాచ.
యాదృచ్ఛికమో మరోటో కానీ ఈ మూడు వ్యాఖ్యలూ ఒకేరోజు వార్తల్లో నిలిచాయి. గౌరవనీయులైన మన రాజకీయ నాయకులు ఎంత తిన్నగా ఆలోచిస్తున్నారో, మరెంత హుందాగా ప్రతిస్పందిస్తున్నారో ఈ వ్యాఖ్యలే చెబుతున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో కనీవినీ ఎరుగని కరువు రాజ్యమేలుతోంది. అధికారిక లెక్కల ప్రకారం చూసుకున్నా రోజుకి ముగ్గురు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వరుసగా మూడో సంవత్సరం అక్కడ పంటలు ఎండిపోయాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైకి కాస్త దూరంలోనే ఇదంతా జరుగుతోంది. అయినా ప్రభుత్వం కిమ్మనకుండా ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాక్షాత్తూ న్యాయస్థానమే రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షిస్తోంది. ఇలాంటి సందర్భంలో ఒక బాధ్యతాయుతమైన పార్లమెంటు సభ్యుడు అన్నమాటలని మనం తొలి పంక్తిలోనే చూశాం.
మనిషన్నాక మాట ఆవేశం సహజం. ఆ ఆవేశంలో మాట తూలడమూ సహజమే! కాకపోతే ప్రజాజీవితంలో ఉండే నాయకులు కాస్త సంయమనం పాటిస్తారనీ, వివపరీత వ్యాఖ్యల జోలికి పోరనీ ఆశించడం తప్పేమీ కాదు. ఒకప్పుడు ప్రతిపక్షాలు ఒకరిమీద వేరొకరు ఎలాంటి ఆరోపణలు చేసుకున్నా అవి సైద్ధాంతింకంగా ఉండేవి. రాన్రానూ అవి వ్యక్తిగత స్థాయిలోకి దిగజారిపోయాయి. ఇక చంపుతాను, నరుకుతాను అని హెచ్చరించుకోవడం తాజా పరిణామంగా భావించాలేమో! మీడియా కూడా దీన్ని ఒక సంచలన ప్రకటనగానే భావించడం, ప్రజలు కూడా చూసీచూడనట్లు ఊరుకోవడం కూడా ఇలాంటి వ్యాఖ్యలకు ఊతమిస్తోంది. ఒకవేళ ఖర్మకాలి ఎవరన్నా ‘మీ మాట తప్పు. దానికి క్షమాపణ చెప్పండి’ అంటే సంజాయిషీ ఇవ్వడానికి కూడా నిరాకరించే బరితెగింపు నేటి నేతలలో కనిపిస్తోంది. ఆ వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని, వారివారి పార్టీలు కూడా వెనకేసుకు రావడం మరో ఘోర పరిణామం. విశాఖ ఎమ్మల్యే గిడ్డి ఈశ్వరి ‘చంద్రబాబు తల నరుకుతాను’ అని వదరడం, ఆంధ్రప్రదేశ శాసనసభలో రోజా సాటి మహిల గురించి అసభ్యంగా మాట్లాడటం... వాటికి వారివారి పార్టీ పెద్దలు మద్దతు పలకడం చూస్తుంటే ఇదెంత నిజమో అర్థమవుతుంది.
ఈ ధోరణి కేవలం మన రాష్ట్రానికో, దేశానికో పరిమితం కాదు. అమెరికాకి భావి అధ్యక్షునిగా భావింపబడుతున్న డొనాల్డ్ ట్రంప్ మహాశయుల మాటలని ఓసారి వింటే, పెద్దన్నగారి వాక్చాతుర్యానికి ముక్కునవేలేసుకోక తప్పదు. ‘చైనా ఓ దొంగ; నేరస్తులని హింసించడంలో తప్పులేదు; అమెరికాలో మసీదులని మూసిపారేయాలి; మెక్సికోకీ, అమెరికాకి మధ్య గోడలు కట్టేయాలి....’ ఇలా సాగుతుంటాయి ఆయన ప్రసంగాలు. సమాజం ఒక్కో అడుగూ ముందుకు వేస్తున్న కొద్దీ సాటి మనిషి పట్ట సహృద్భావం, సమాజం పట్ల బాధ్యతా మరింతగా పెరగాలి. కానీ ప్రస్తుత పరిస్థితులన్నీ దానికి విరుద్ధంగా కనిపిస్తున్నాయి. మనిషిలో వ్యక్తిగత స్వార్థం, అసహనం పెరిగిపోతున్నాయి. సంస్కారపు విలువలు దిగజారిపోతున్నాయి. మరి మన రాజకీయ నేతలు కూడా వీటికి అతీతం కాదని సరిపుచ్చుకోవాలేమో!