అసలైన నిందితుడు జారుకుంటున్నాడా!
posted on Feb 18, 2016 @ 2:33PM
జేఎన్‌యూలో గత వారం జరిగిన సంఘటన గురించి దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నప్పుడు ఉమర్ ఖాలిద్ అనే వ్యక్తి విద్యార్థుల తరఫున మాట్లాడేందుకు పలు టీవీ ఛానళ్ల ముందుకు వచ్చాడు. అమాయకంగా నవ్వుతూ కనిపించే ఉమర్ ఖాలిద్ ఎవరో సాధారణమైన విద్యార్థి నాయకుడు అయిఉంటాడనీ ప్రేక్షకులు అనుకున్నారు. కానీ ఉమర్ గురించి ఒక్కొక్కటిగా వెలికివస్తున్న నిజం, అతని నైజం ఎంత ప్రమాదకరమైనదో తెలియచేస్తోంది. ఉమర్ నాయకత్వం వహిస్తున్న DSU అనే విద్యార్థి సంఘం ఆది నుంచి వివాదాలకు నెలవుగా ఉండింది. 2010లో దంతెవాడలో 70కి పైగా సీఆర్‌పీఎఫ్ జవాన్లను మావోయిస్టులు తుదముట్టించినప్పుడు, DSF విద్యార్థులు సంబరాలు చేసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కశ్మీర్ వేర్పాటవాదులను క్యాంపస్‌కు పిలిపించి సకల మర్యాదలు చేయడం, ఆవుమాంసం కోసం క్యాంపస్ మెస్‌లో గొడవపడటం, హిందూ దేవతల నగ్న రూపాలను క్యాంపస్ గోడల మీద అతికించడం.... ఇలాంటి వివాదాస్పద కార్యకలాపాలకు DSU పెట్టింది పేరు.
నిజానికి ఫిబ్రవరి 9వ తేదీన జేఎన్‌యూలో జరిగిని వివాదాస్పద కార్యక్రమానికి ముఖ్య కర్త కూడా ఉమర్ ఖాలిదే అని తెలుస్తోంది. ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించుకుంటామంటూ అనుమతిని తీసుకుని అందులో అఫ్జల్ గురుని కీర్తించడం మొదలుపెట్టారు DSU కార్యకర్తలు. ఈ సమయంలో అక్కడే ఉన్న AISF నాయకుడు కన్నయా కుమార్‌మీదే నింద అంతా పడింది. పోలీసులు సరిగా విచారణ చేయకుండానే కన్నయాను అరెస్టుచేసి పారేశారు. కన్నయా కుమార్ వామపక్షాలకు అనుబంధంగా ఉన్న సంఘానికి నాయకుడు కావడంతో, వామపక్షాలన్నీ ఒక్కసారిగా ప్రభుత్వం మీద విరుచుకుపడ్డాయి. ఉమర్ మాత్రం తనదైన శైలిలో నవ్వుకుంటూ జారిపోయాడు. నిజానికి ఇలాంటి సమావేశాలను దేశవ్యాప్తంగా నిర్వహించాలని ఉమర్ భావించినట్లు సమాచారం. ఉమర్ వంటి ఆలోచనా ధోరణి ఉన్న మరి కొందరు తరచూ జేఎన్‌యూలోకి ప్రవేశించేవారనీ, వీరంతా కలిసి విద్యార్థులలో భారతదేశం మీద ద్వేషం కలిగేలా బ్రెయిన్‌వాష్ చేసేవారనీ తెలుస్తోంది.
జేఎన్‌యూలో తీవ్రవాదులకు అనుకూలంగా సమావేశం జరిగినప్పుడు పోలీసులు తొందరపాటుగా వ్యవహరించడం వెనక్కి తీసుకోలేని తప్పుగా మిగిలిపోనుంది. ఎందుకంటే కన్నయాకుమార్‌ను పొరపాటున అరెస్టు చేశాం అని ఒప్పుకోవడానికి పోలీసులు నామోషీ పడుతున్నారు. అందుకోసం కన్నయాకుమార్ నిందితుడు అని రుజువు చేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. పోలీసులు ఇలాంటి ప్రయత్నం చేస్తున్నకొద్దీ, విద్యార్థి నాయకుల పట్ల ప్రజల సానుభూతి పెరిగిపోతూ ఉంటుంది. దీనికి తోడు రాజకీయపక్షాలన్నీ కూడా ఈ వివాదం నుంచి తమదైన శైలిలో లాభాన్ని పొందాలని చూడటంతో ఉమర్ ఖాలిద్ మీద చెయ్యి వేయలేని పరిస్థితి వచ్చేసింది.
ముందుముందు ప్రభుత్వం ఉమర్ మీద ఎలాంటి ఆరోపణ చేసిన విద్యార్థులు దాన్ని నమ్మే స్థితిని ఇప్పటికే దాటిపోయారు. సోషల్ మీడియాలో ఉమర్‌కు పెరిగిపోతున్న ఆదరణే ఇందుకు సాక్ష్యం. ‘నీకు తీవ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయని రక్షణవర్గాలు చెబుతున్నాయి. నీ మీద ఇలాంటి ఎన్ని ఆరోపణలు వచ్చినా మేం నమ్మం.’ అంటూ ఉమర్ ఖాలిద్ పేర ఉత్తరాలు వెలుస్తున్నాయి. ప్రభుత్వం ఇకనైనా మేల్కొని జేఎన్‌యూలో చెలరేగిన వివాదానికి కారణం ఎవరో ప్రజలకి తెలియచేసి, తదనుగుణమైన చర్యలు తీసుకోవలసి ఉంది.