జలదిగ్బంధంలో వరంగల్ రైల్వే స్టేషన్
posted on Oct 29, 2025 @ 8:35PM
తీవ్ర తుపాను మొంథా ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా వరంగల్ జిల్లాలో అతిభారీ వర్షాలు నమోదయ్యాయి. వరంగల్ జిల్లా కల్లెడలో అత్యధికంగా 34 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీని తరువాత కాపులకనపర్తిలో 25.23, రెడ్లవాడలో 24.63, ఉరుసులో 23.7, సంగెంలో 23.48 సెంటీమీటర్ల వర్షం పడింది. అదే విధంగా జనగామ జిల్లా గూడూరులో 23.58, వర్ధన్నపేట (వరంగల్)లో 22.8, హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో 21.8, మహబూబాబాద్ జిల్లా ఇనగుర్తిలో 19.23, కరీంనగర్ జిల్లా బోర్నపల్లిలో 17.58, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో 16.45, యాదాద్రి జిల్లా ఆత్మకూరులో 16.23 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
భారీ వర్షాల కారణంగా వరంగల్ రైల్వే స్టేషన్‌లోకి వరద నీరు చేరింది. పట్టాలపైకి రెండు అడుగుల మేర నీరు నిలవడంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. గోల్కొండ ఎక్స్‌ప్రెస్ను నిలిపివేయగా, ప్రయాణికులను బస్సుల ద్వారా గమ్యస్థానాలకు తరలించారు.ఇక మహబూబాబాద్‌లో కృష్ణా ఎక్స్‌ప్రెస్ ఐదు గంటల పాటు నిలిచిపోయింది. ట్రాక్‌పై నీరు తగ్గకపోవడంతో రైలును వరంగల్‌కు తిరిగి పంపి, దారి మళ్లించారు. అలాగే గుండ్రాతిమడుగు నుంచి వరంగల్‌కు కోణార్క్ ఎక్స్‌ప్రెస్ను కూడా మళ్లించారు.
ఈ క్రమంలో ప్రయాణికులకు ఆహారం, తాగునీరు అందించేందుకు పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చాయి. మానవతా సేవలు అందించిన పోలీసులను డీజీపీ అభినందించారు. ఇదిలా ఉండగా, డోర్నకల్ రైల్వే స్టేషన్‌ను కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. భారీ వర్షాలతో వరంగల్ పట్టణంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షపు నీటితో రోడ్లు చెరువుల్లా మారాయి. మోటార్ల సహాయంతో అధికారులు వరదనీటిని బయటకు పంపే పనులు చేస్తున్నారు.