మెడిటేషన్ కాదు.. మోడిటేషన్!

మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కన్యాకుమారిలో అప్పుడెప్పుడో స్వామి వివేకానంద ధ్యానం చేసిన ప్రదేశంలోనే 45 గంటలపాటు ధ్యానానికి కూర్చోవడం ఎంత గొప్ప విషయమో మాటల్లో చెప్పలేం. 45 గంటలు ధ్యానం చేసే సమయంలో ఆయన ఎవరితోనూ మాట్లాడరట. కేవలం ద్రవ పదార్ధాలే తీసుకుంటారట. అద్భుతం. మోడీ గారు కాషాయ వస్త్రాలు ధరించి ధ్యానంలో కూర్చున్న ఫొటోలు చూసి భారతీయుల హృదయాలు పులకరించిపోతున్నాయి. స్వామి వివేకానంద 2 పాయంట్ ఓ ని చూసినట్టు అనిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే, స్వామి వివేకానందే ఈ దేశాన్ని మరోసారి ఉద్ధరించడం కోసం నరేంద్ర మోడీ రూపంలో అవతరించారా అనిపిస్తోంది. మనందరి అదృష్టం బాగుంది కాబట్టే నరేంద్ర మోడీ లాంటి యోగి పుంగవుడు మనకు ప్రధానమంత్రి అయ్యాడు. ఎన్నికలు జరిగిన ప్రతిసారీ ఆయన ఇలా భారీ స్థాయిలో ధ్యానం చేయడం సహజమేనేమో. ఎందుకంటే, 2019లో ఎన్నికలు ముగియగానే హిమాలయాలకు వెళ్ళి అక్కడ ఒక గుహలో అద్భుతంగా ధ్యానం చేశారు. ఆ సందర్భంలో ఆయన ఫొటోలు చూస్తుంటే, మహావతార్ బాబా అంటే మరెవరో కాదు.. నరేంద్ర మోడీనే అనిపించింది. పాపం మోడీ గారు ఏర్పాటు చేసుకోరుగానీ, ఆయన ధ్యానం చేస్తున్న సమయంలో ఎవరో అద్భుతంగా ఫొటోలు తీసి బయటి ప్రపంచానికి పంపిస్తూ వుంటారు. అంతా మన భారతీయుల అదృష్టం. 

సాధారణంగా ధ్యానం అనేది ఎవరైనా గుట్టుగా చేసుకుంటారు. కానీ, మెడిటేషన్ అలా గుట్టుగా చేయకూడదని, ఆ ధ్యాన పరిమళాలు అంతటా వ్యాపించేలా చేయాలని నరేంద్ర మోడీ చాటారు. 2019లో హిమాలయాల్లో గానీ, ఇప్పుడు కన్యాకుమారిలోగానీ మోడీ గారు చేసిన ధ్యానం న్యూసు, ఫొటోలు ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించాయి. ఇలాంటి సందర్భాల్లో మోడీని చూస్తుంటే, ‘నమో నారాయణాయ’ మంత్రాన్ని గురువుగారు తన చెవిలో చెబితే, ఆ మంత్రం అందరికీ అందాలని గుడి గోపురం మీద ఎక్కి పెద్దగా ‘ఓం నమో నారాయణాయ’ అని అరిచిన రామానుజా చార్యులు గుర్తొస్తున్నారు. బహుశా.. రామానుజాచార్యుల వారి మరో అవతారం మోడీ గారేనేమో!

హిమాలయాల్లో, కన్యాకుమారిలో మోడీ గారు ధ్యానం చేస్తుండగా తీసిన ఫొటోలు చూస్తుంటే, రెండు చేతులు జోడించి నమస్కరించాలని అనిపిస్తూ వుంటుంది. ముఖంలో ఆ ప్రశాంతత, తేజస్సు, వర్చస్సు... అబ్బబ్బ.. మోడీ గారికి మోడీ గారే సాటి. చాలామంది ఇంట్లో కూర్చుని ధ్యానం చేయడానికే వీల్లేక డిస్ట్రబ్ అయిపోతున్నాం అంటారు.. మోడీ గార్ని చూడండి.. ఓపెన్ ప్లేసులో, జనాలు, కెమెరాల సమక్షంలో ఎంత బాగా ధ్యానం చేస్తున్నారో. ప్రపంచంలో వున్న ధ్యానులందరూ మోడీ గారిని చూసి నేర్చుకోవాల్సింది చాలా వుంది. ఒక్కమాట చెప్పి, ముగిద్దాం.. అసలు ‘మెడిటేషన్’ అనే మాటని క్యాన్సిల్ చేసేసి ‘మోడిటేషన్’ అని మారిస్తే మంచిది.

Teluguone gnews banner