న బూతో.. న భవిష్యత్! ఏపీ మంత్రుల బాటలో గులాబీ లీడర్స్
posted on Aug 26, 2021 @ 2:11PM
తెలుగురాష్ట్రాల్లో బూతుల మంత్రి ఎవరంటే టక్కున వినిపించే పేరు కొడాలి నాని. అమ్మనా బూతులు తిట్టడానికి ఆయన ఏమాత్రం సిగ్గుపడరు. సిగ్గు లేకుండా.. మర్యాద పాటించకుండా.. నోటికొచ్చిన తిట్లన్నీ తిట్టేయడానికి ఆయన అసలేమాత్రం వెనకాడరని అంటారు. ఎంత తిడితే అంత గొప్పగా ఫీల్ అవుతారు. తానో మంత్రినని.. ఆ పదవిలో ఉన్నవాళ్లు కాస్త సంస్కారం పాటించాలనే విషయాన్ని ఆయన అసలేమాత్రం పట్టించుకోరు. విపక్ష నేతలపై బండ బూతులతో విరుచుకుపడుతూ తన మంత్రి పదవిని ఎప్పటికప్పుడు కాపాడుకుంటారని అంటారు. కొడాలి నాని తర్వాత మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌కే బూతుల పోటీలో సెకండ్ ర్యాంక్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ఇద్దరు మంత్రులు నోటికి పని చెబుతూ.. ప్రజల్లో బాగా చీప్ అయిపోయారు. ఆ విషయం పసిగట్టినట్టున్నారు ఈ మధ్య వాళ్ల నోటి దురుసుకు తాళం పడింది. జలజగడంపై తెలంగాణ మంత్రులు వైఎస్సార్‌ను, వైఎస్ జగన్‌ను దొంగ, గజదొంగ, నరరూపరాక్షసుడు లాంటి పెద్ద పెద్ద బిరుదులు ఇచ్చినా.. పాపం తేలుకుట్టిన దొంగల్లా గమ్మున ఊరుకుంటున్నారే గానీ.. తమ నోటికి గానీ, బూతులకు గానీ పని చెప్పడం లేదు ఏపీ మంత్రులు. ఇక, ఆ విషయం పక్కనపెడితే.. ఏపీ మంత్రులను టీఆర్ఎస్ నేతలు బాగానే ఫాలో అవుతున్నట్టున్నారు.
నాని, అనిల్‌ల మాదిరిగానే పలువురు గులాబీ నాయకులు ఇటీవల తమ నోటి దురుసుతనాన్ని మీడియా ముఖంగా చాటుతున్నారు. మైకులు పగిలేలా.. వినేవారు చెవులు మూసుకునేలా తిట్లపురాణం అందుకుంటున్నారు. మొన్న ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు.. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను ఆటాడుకుంటే.. తాజాగా మంత్రి మల్లారెడ్డి.. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని ఓ రేంజ్‌లో కుమ్మేశారు. తిట్లనే వాళ్లు ఆయుధాలుగా ప్రయోగించి.. రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇలా బీజేపీ, కాంగ్రెస్‌లపై అధికార పక్షం తిట్లతో విరుచుకుపడుతూ.. ఏపీ వైసీపీ మార్క్ పాలిటిక్స్‌ను తెలంగాణలో టీఆర్ఎస్ అమలు చేస్తోందా? అనే అనుమానం.
ఇన్నేళ్ల పొలిటికల్ కెరీర్‌లో మైనంపల్లికి తెలంగాణలో ఎంత పాపులారిటీ ఉందో తెలీదుగానీ.. బండి సంజయ్ ఎపిసోడ్‌తో మాత్రం ఇప్పుడు రాష్ట్రంలో మైనంపల్లి అంటే తెలీని వారే లేరని చెప్పొచ్చు. బీజేపీ కార్పొరేటర్‌పై ఎమ్మెల్యే మనుషులు దాడి చేయడం.. బాధితుడిని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పరామర్శించడం.. మైనంపల్లి సంగతి చూస్తామంటూ వార్నింగ్ ఇవ్వడం వెంటవెంటనే జరిగిపోయాయి. బండి సంజయ్ వార్నింగ్‌కు ఎమ్మెల్యే మైనంపల్లి ఇచ్చిన కౌంటరే కాంట్రవర్సీగా మారింది. అరేయ్ బండిగా.. గుండుగా.. లుచ్చా.. మెంటల్.. బట్టేబాజ్.. రారా చూసుకుందాం.. ఇలా తిట్ల దండకం అందుకున్నారు మైనంపల్లి. ఇదేదో బాగుందనుకున్నారేమో ఏమో.. మంత్రి మల్లారెడ్డి సైతం మైనంపల్లి బాటలో ఏకంగా పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మీద బూతుపురాణం మొదలుపెట్టడం మరింత కలకలం రేపుతోంది.
మూడుచింతలపల్లిలో జరిగిన 48 గంటల దీక్ష ముగింపు సందర్భంగా రేవంత్‌రెడ్డి.. మంత్రి మల్లారెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. పాల మల్లన్న.. జోకర్ మల్లన్న.. బ్రోకర్ మల్లన్న.. అంటూ కాస్త నోరుకూడా జారారు. ఆ విషయం తెలిసి మంత్రి మల్లారెడ్డి ఇక తన నోటి కంపునంతా బయటపెట్టేశారు. బట్టేబాజ్, లుచ్చా, సాలే, గూట్లే, లఫూట్, దొంగ, రాస్కేల్, బ్రోకర్, జోకర్, ఆడిబట్లోడ, మగాడివి కావా? దమ్ముందా? బ్లాక్ మెయిలర్, ఛీటర్.. ఇలా తిట్లతో గబ్బుగబ్బు లేపారు. అయితే మంత్రి మల్లారెడ్డి బూతులకు స్పందించి రేవంత్‌రెడ్డి తన స్థాయిని తగ్గించుకోదలుచుకోలేదు. కానీ, రేవంతన్న అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో మంత్రి మల్లారెడ్డిని తిట్లు, బూతులతో ఫుట్‌బాల్ ఆడుకుంటున్నారు. తెలుగు డిక్షనరీలో ఉన్నవి, లేనివి అన్నీ కూడేసి మల్లారెడ్డిని ట్రోల్స్‌తో, కామెంట్స్‌తో, వీడియోలతో కుమ్మేస్తున్నారు.
ఇలాంటి తిట్ల దండకంతో అసలు మేటర్ పక్కకు పోయి.. పనికి రాని, పనికి మాలిన రచ్చంతా జరుగుతోంది. అసలు తెలంగాణలో తిట్ల కల్చర్ తీసుకొచ్చిందే కేసీఆర్. ఉద్యమ సమయంలో ఆంధ్రోళ్లంటూ ఒక తిట్లు తిట్లలేదు గులాబీ బాస్. ఇప్పుడు అధినేత దారిలోనే నడుస్తూ.. ఏపీ మంత్రులను స్పూర్తిగా తీసుకుంటూ.. తిట్లు, బూతు పురాణం మొదలుపెట్టినట్టున్నారు టీఆర్ఎస్ నాయకులు. మరి, ముందుముందు ఈ బ్యాడ్ కల్చర్ ఇంకెంత చెత్తగా, కంపుగా, రచ్చగా మారుతుందో..