ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రాంతీయవాదం
posted on Feb 21, 2013 @ 12:23PM
సహకార ఎన్నికలు జరిగిన కొద్దిరోజులకే మళ్ళీ ఈరోజు శాసనమండలి ఎన్నికలు జరుగుతున్నాయి. ఆంధ్రా ప్రాంతంలో ఈ ఎన్నికలు కేవలం మండలి ఎన్నికలుగానే పరిగణిస్తున్నపటికీ, సహకార ఎన్నికలలో వెనుకబడిన తెరాస, ఈఎన్నికలలో కూడా ఓటమి చవి చూసినట్లయితే, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం చేస్తున్నట్లు తెలంగాణా సెంటిమెంటు క్రమంగా బలహీనపడిపోతోందనే వాదనను ప్రజలు కూడా విస్వశిస్తే, అది తమ ఉనికికే ప్రమాదం అవుతుందని గ్రహించి, ఈఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడమే కాకుండా, దానికి ప్రాంతీయవాదం కూడా అద్ది గెలవాలని ప్రయత్నిస్తోంది.
ఈ ఎన్నికలలో తెరాస అభ్యర్దులను గెలిపించడం ద్వారానే, ప్రజలలో తెలంగాణా సెంటిమెంట్ బలంగా ఉందని నిరూపించగలమని, ఇది సమైక్యవాదులకు తెలంగాణా వాదులకు జరుగుతున్నయుద్ధంగా భావించాలని చెపుతూ తెలంగాణా ప్రజలలో భావోద్వేగాలు రెచ్చగొట్టి ఎన్నికలలో లబ్ది పొందే ప్రయత్నం చేస్తోంది. అయితే, తెరాస ఈ ఎన్నికలను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నపటికీ, ఈ సారి వోటు వేస్తున్నవారు విద్యావంతులు మరియు ఉపాద్యాయులు అని మరిచి, వారిని భావోద్వేగాలతో లొంగ దీసుకోవాలని ప్రయత్నిస్తోంది.
ఉచితానుచితాలు తెలిసిన వారికి ఈ ఎన్నికలు ఎందుకు జరుగుతున్నాయో, ఎవరిని ఎన్నుకొంటే తమకు మేలు జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వారందరూ మనస్పూర్తిగా తెలంగాణా కోరుకొంటున్నపటికీ, తెరాసకి ఓటేయడం వలన మాత్రమే తెలంగాణా సెంటిమెంటు బలంగా ఉంటుందని తెరాస చెపుతున్న మాటలు నమ్మేఅవకాశం లేదు. ఒకవేళ తెరాస అభ్యర్దులలో తమకి ఉపయోగపడే అభ్యర్ధి ఉన్నట్లయితే వారు అతనికే ఓటువేయవచ్చునేమో కానీ, కేవలం సెంటిమెంటును అడ్డం పెట్టుకొని ఓటేయమని అడిగితే, తెరాస అభ్యర్ధికి ఓటేసే అవకాశం లేదు.