తెలంగాణ ఎంపీలు ధర్నా ఎందుకో?
posted on Feb 21, 2013 @ 1:02PM
తెలంగాణా అంశంపై కాంగ్రెస్ వెనకడుగు వేసిన తరువాత, ఆ పార్టీకి చెందిన తెలంగాణ కాంగ్రెస్ యం.పీ.లు రాజీనామాలు చేసేస్తామని కొన్ని రోజులు హడావుడి చేసారు. అయితే, ఆఖరి నిమిషంలో రాజీనామాల విషయంలో తమ మద్య అభిప్రాయబేధాలు ఏర్పడాయనే సాకుతో ఆ తరువాత ఎవరూ కూడా తమ రాజీనామాలు ఆమోదించాలని అధిష్టానాన్ని గట్టిగా పట్టుబట్టలేదు. ఆ తరువాత, వారందరూ పార్లమెంటు బడ్జెట్ సమావేశాలలో తాము పాల్గొనాలా వద్దా, లేక పాల్గొని సభను అడ్డుకోవాలా వంటి రకరకాలయిన ఆలోచనల చేస్తూ ఇంత కాలకాలక్షేపం చేసారూ.
తమ రాజీనామాల ఆమోదం కోసం పట్టుబట్టడం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువని గ్రహించిన వారందరూ, మధ్యే మార్గంగా పార్లమెంటు ముందు ఈ రోజు ధర్నాలు మొదలుపెట్టారు. తద్వారా, తమను తెలంగాణా ద్రోహులుగా చిత్రీకరిస్తున్న తెరాస మరియు తెలంగాణా జేయేసీల దాడి నుండి తమను తాము కాపాడుకోవడమే కాకుండా, తాము కూడా తెలంగాణా కోసం పోరాడుతున్నామనే సందేశం ప్రజలలోకి పంపే ప్రయత్నం చేస్తున్నారు. అంతే కాకుండా, ఒకవైపు తమ పదవులను కాపాడుకొంటూ తెలంగాణా అంశంపై పోరాడుతూనే, పార్టీ అధిష్టానానికి ఆగ్రహం తెప్పించకుండా తమ గోడు వినిపించే ప్రయత్నం చేయగలుగుతున్నారు.
నిజామాబాద్ యంపీ మధు యాష్కి తప్ప మిగిలిన యంపీలయిన మందా జగన్నాధం,గుత్తా సుఖేందర్ రెడ్డి, వివేక్, రాజయ్య,పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి మరియు పాల్వాయి గోవర్ధనరెడ్డి ఈ రోజు పార్లమెంటు ఆవరణలో దర్నా చేశారు. వారి సమస్యను అర్ధం చేసుకొన్నకాంగ్రెస్ అధిష్టానం, ప్రస్తుతం వారిని ఉపేక్షించినప్పటికీ, వోటింగ్ ప్రక్రియ ఉన్నపుడు వారిని సభలోకి రప్పించగలదని గతంలో యఫ్.డీ.ఐ. వోటింగు సమయంలో నిరూపించింది. తమ అధిష్టానం ఇప్పుడు తెలంగాణా ఇవ్వదని స్పష్టం అయిన తరవాత కూడా, తెలంగాణ కాంగ్రెస్ యం.పీ.లు ఈ విధంగా ధర్నా చేయడం చూస్తుంటే, వారు తమ ప్రాంతాలలో తమ ఉనికిని కాపాడుకొనే ప్రయత్నంలో భాగంగానే చేస్తున్నారని భావించవలసి ఉంటుంది.