కోడ్ తో కారు పార్టీకి రిలీఫ్.. విపక్షాల పాదయాత్రలకు బ్రేక్
posted on Nov 15, 2021 @ 4:08PM
తెలంగాణలో నాలుగైదు నెలల పాటు సాగిన హుజూరాబాద్ ఉప ఎన్నికల రాజకీయం అధికార తెరాస ఓటమితో ముగిసింది. అయితే ఆ తర్వాత కూడా ఉప ఎన్నిక ఫలితం రేపిన రాజకీయ దుమారం ఏదో ఒక రూపంలో చెలరేగుతూనే వచ్చింది. ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్ హుజూరాబాద్ ఓటమి పార్టీలో ప్రకంపనలకు దారితీస్తుందని గ్రహించి, ఓ పద్దతి ప్రకారం దిద్దుబాటు చర్యలు తీసుకున్నారు. ఓటమిని జీర్ణించుకునేందుకు కొంత సమయం తీసుకున్నా ఆతర్వాత నేరుగా రంగంలోకి దిగి మాటల గారడీతో చర్చను పక్కదారి పట్టించారు. ఓటమిని మరిపించారు. అందుకు కొనసాగింపుగా హరీష్ రావుకు ఆరోగ్య శాఖను అదనంగా కేటయించి అసమ్మతికి అగ్గిపెట్టె అందకుండా చేశారు.
ఇంతలోనే వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికలు, ముఖ్యమంత్రి కేసీఆర్ నెత్తిన కుండల కొద్దీ పాలను కుమ్మరించాయని, ఒక విధంగా క్షీరాభిషేకం చేశాయని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రాకుంటే ఇంకొంత కాలం హుజురాబాదు ఓటమిచేసిన గాయం అలా ఎదో ఒక రూపంలో స్లుపుతూనే ఉండేదని, ఇప్పుడు ఎన్నికల కోడ్ రావడంతో విపక్షాల కాళ్ళకు సంకెళ్ళు పడ్డాయని విశ్లేషకులు అంటున్నారు. హుజూరాబాద్ వేడి చల్లారకుండా చూసుకునేందుకు బీజేపీ మిలియన్ మార్చ్ ప్లాన్ చేసింది. నవంబర్ 16 హైదరాబాద్ లో జరప తలపెట్టిన నిరుద్యోగుల మిలియన్ మార్చికి, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ బ్రేకులు వేసింది. బీజేపీ ఆశలపై కోడ్ నీళ్ళు చల్లింది. అలాగే బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నవంబర్ 21 నుండి ప్రారంభించాల్సిన రెండవ విడత ప్రజా సంగ్రామ యాత్రకు కూడా బ్రేకులు పడ్డాయి.
బీజేపీతో పాటుగా కాంగ్రెస్’ ప్లాన్స్’ కు కూడా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్’ బ్రేకులు వేసింది. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఘోర ఓటమిని చవి చూసిన కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు మరోసారి బయట పడ్డాయి. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మూడు ముఠాలు, ఆరు గ్రూపులుగా చీలిపోయి తగువును ఢిల్లీ దాకా తీసుకు పోయారు. ముఖ్యంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అనుకూల, వ్యతిరేక వర్గాలుగా పార్టీ చీలిపోయింది. హుజూరాబాద్ ఓటమికి రేవంత్ రెడ్డిని బాధ్యుని చేసేందుకు ఆయన దూకుడుకు కళ్ళెం వేసేందుకు ఆయన వ్యతిరేక వర్గం ఢిల్లీలో గట్టిగానే చక్రం తిప్పింది. ఏఐసీసీ ఆదేశాల మేరకు ఆదివారం నుంచి తలపెట్టిన ప్రజా చైతన్య యాత్రలు ఎన్నికల కోడ్ తో వాయిదా పడ్డాయి. ప్రజా చైతన్య యాత్రలు, పాదయాత్రల ద్వారా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో జోష్ పెంచేందుకు రేవంత్ రెడ్డి సిద్ధం చేసుకున్న ప్రణాళికకు కోడ్ బ్రేకులు వేసింది. అలాగే, వంక వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాద యాత్ర కూడా కోడ్ కారణంగా అర్థాంతరంగా ఆగి పోయింది.
మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అన్ని స్థానాలను సునాయసంగా గెలుస్తుంది. అభ్యర్ధుల ఎంపిక విషయంలో చిన్న చిన్న చిటపటలు వినిపించినా,అంతిమంగా ఎమ్మెల్సీ ఎన్నికలను కారు పార్టీ స్వీప్ చేయడం ఖాయమని వేరే చెప్పనక్కరలేదు. దుబ్బాక , జీహెచ్ఎంసీ దెబ్బ తర్వాత వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికలు, అధికార పార్టీలో కొత్త ఉత్సాహన్ని నింపాయి.. ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికలే హుజూరాబాద్ షాక్ నుచి తెరాసను బయట పడేస్తాయని, ఆ విధంగా ఎమ్మెల్సీ ఎన్నికలు తెరాస, కేసీఆర్ నెత్తిన పాలు పోశాయని అంటున్నారు, విశ్లేషకులు.