పోరాడకుండా జగన్ కు భజన చేస్తారా? బీజేపీ నేతలకు అమిత్ షా క్లాస్..
posted on Nov 15, 2021 @ 3:36PM
రాకరాక వచ్చారు. తప్పక రావాలి కాబట్టి వచ్చారు. సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశాన్ని కేంద్రహోంశాఖ అమిత్‌షా మమ అనిపించారు. లడ్డూ కావాలా నాయనా.. అని జగన్‌రెడ్డిని అడుగుతారేమోనని అనుకున్నారు. పాచిపోయినా లడ్డూ గురించి జగన్‌రెడ్డీ గట్టిగా ప్రశ్నించింది లేదు. ఏదో అఫీషియల్ మీటింగ్‌ను అలా ముగించేశారు. కట్‌చేస్తే.. మర్నాడు తిరుపతి వేదికగా అసలైన రాజకీయ సమావేశం పెట్టారు అమిత్‌షా. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ మోదీ రాజ్య స్థాపనే ఆయన లక్ష్యం కాబట్టి.. అందుకు అనుగుణంగా ఏపీలోనూ బీజేపీని బలోపేతం చేసేలా.. రాష్ట్ర పార్టీ కీలక నేతలతో మీటింగ్ నిర్వహించారు. ఆ భేటీలో ఏపీ బీజేపీపై ఓ రేంజ్‌పై చెలరేగిపోయారట అమిత్‌షా.
బద్వేల్‌లో బీజేపీకి డిపాజిట్ ఎందుకు రాలేదు? అమిత్‌షా అడిగిన మొదటి ప్రశ్న.బద్వేల్ ఓటమిపై ఎవరి దగ్గరా ఆన్సర్ లేదు. అంతా బ్లాంక్ ఫేస్ పెట్టి మౌనంగా కూర్చున్నారట. తిరుపతి ఎంపీ ఉప ఎన్నికల్లోనూ బీజేపీకి డిపాజిట్ ఎందుకు రాలేదు? అమిత్‌షా అడిగిన సెకండ్ క్వశ్చన్. ఇక అంతే. రూమ్‌లో ఏసీ ఉన్నా.. మీటింగ్‌లో ఉన్న వారందరికీ ముచ్చెమటలు పట్టాయట. జనసేనతో పెత్తు ఉంది కదా? అయినా ప్రతీ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోతున్నాం? మరో ప్రశ్న. స్థానిక సంస్థల ఎలక్షన్లలోనూ ఎందుకు గెలవలేకపోతున్నారు? ఇంకో క్వశ్చన్. వైసీపీ ప్రభుత్వంపై మీరు చేస్తున్న పోరాటమేంటి? అమరావతి ఉద్యమాన్ని పార్టీ ఎందుకు ఓన్ చేసుకోలేకపోయింది? ఆలయాల దాడులపై ఎందుకు బలంగా పోరాడలేకపోయారు? ఏపీలో పెద్ద ఎత్తున మత మార్పిడులు జరుగుతున్నా సర్కారును ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారు? రాష్ట్రం చేస్తున్న అప్పులపై కేంద్రం తరఫున ఎప్పటికప్పుడు కొర్రీలు పెడుతున్నాం.. మరి, మీరెందుకు ఈ విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నారు? అప్పులపై, పథకాల డొల్లతనంపై బీజేపీ నేతలు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఇలా.. సోము వీర్రాజుతో సహా పలువురు కీలక నేతలను అమిత్‌షా కడిగిపారేశారని అంటున్నారు.
ఏ రాష్ట్రంలోనైనా సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడమే బీజేపీ ప్రధాన ఉద్దేశ్యం, లక్ష్యం. బీహార్, పంజాబ్‌లాంటి చోట్ల మినహా.. అనేక స్టేట్స్‌లో కమలం సింగిల్‌గానే ముందుకు పోతోంది. ఇక ఎప్పటినుంచో దక్షిణాదిపై ఫోకస్ పెట్టిన కాషాయం పార్టీ కర్నాటకను గుప్పిట్లో పెట్టుకోగా.. తమిళనాడు, కేరళ మాత్రం అంతుచిక్కడం లేదు. అందుకే ఏపీ, తెలంగాణపైనే ప్రధానంగా ఫోకస్ పెట్టింది. తెలంగాణలో దూకుడు మీదుండగా.. ఆంధ్రప్రదేశ్‌లోనే బీజేపీ చచ్చు పార్టీగా మిగిలిపోతోంది. జనసేనతో పొత్తు ఉన్నా.. పవన్ కల్యాణ్‌లాంటి పవర్ స్టార్ అండగా నిలుస్తున్నా.. బీజేపీకి మాత్రం ప్రజల్లో ఎలాంటి ఆదరణ లభించకపోతుండటంపై అమిత్‌షా ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. అధికార పార్టీపై సరైన రీతిలో ఫైట్ చేయకపోవడం.. అమరావతి, ఆలయాలు, అప్పుల లాంటి అంశాలను క్యాష్ చేసుకోలేకపోవడం.. పార్టీ నేతల వైఫల్యమేనని షా మండిపడ్డారని అంటున్నారు. ఇదంతా ఏపీ బీజేపీ నేతలు అధికార పార్టీతో, ప్రభుత్వంతో అంటకాగడం వల్లేనని తనకు సమాచారం ఉందని అమిత్‌షా ఓ రేంజ్‌లో క్లాస్ ఇచ్చారని చెబుతున్నారు.
తెలంగాణలో కేసీఆర్‌కు కంటిలో నలుసుగా మారింది బీజేపీ. బండి సంజయ్ నేతృత్వంలో కమలనాథులు సర్కారును బాగా ఇరుకునపెడుతున్నారు. ఏపీలో మాత్రం అలాంటి ఫైటింగ్ స్పిరిట్ లేకపోవడానికి కొందరు నేతలే కారణమని అమిత్‌షా భావిస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు విష్ణువర్థన్‌రెడ్డి లాంటి నాయకులు.. వైసీపీని, జగన్‌ను వదిలేసి.. ప్రతిపక్షమైన టీడీపీపై పదే పదే విమర్శలు చేస్తుండటం వల్ల ఉపయోగం ఏముంటుందని అమిత్‌షా మండిపడ్డారట. ప్రజల్లోకి బలంగా వెళ్లాలంటే.. అధికార పార్టీని, ప్రభుత్వాన్ని నిలదీసి.. ప్రజల్లో దోషిగా నిలబెట్టాలి కానీ, ఇంకా చంద్రబాబు వెంటపడితే పార్టీకి ప్రయోజనం ఏముంటుందని.. వైసీపీ-బీజేపీ ఒక్కటే అనే మెసేజ్ పబ్లిక్‌లోకి వెళితే అది బీజేపీకే మైనస్‌గా మారుతుందని అమిత్‌షా హితబోధ చేశారని సమాచారం.
ఇదే మీటింగ్‌లో కొందరు నేతలు.. వీర్రాజు-విష్ణువర్థన్‌రెడ్డిల తీరుపై బిగ్‌బాస్‌కు కంప్లైంట్ కూడా చేశారని అంటున్నారు. అవన్నీ విన్న అమిత్‌షా.. ఇకనైనా పార్టీ నేతలు తీరు మార్చుకోకపోతే సీరియస్ పరిణామాలు ఉంటాయని హెచ్చరించినట్టు తెలుస్తోంది. ఏపీలో బీజేపీ పరిస్థితి మెరుగుపడాలంటే.. జగన్‌పై, వైసీపీ ప్రభుత్వంపై పోరాటం పెంచాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారట అమిత్‌షా.