పాల ప్యాకెట్ ధర ఇంకా పెరగనుందా?
posted on Mar 2, 2020 @ 2:12PM
గడిచిన 9 నెలల్లో దేశవ్యాప్తంగా లీటర్ పాల ధర రూ. 5 పెరిగింది.
రాబోయే ఎండా కాలంలో పాల ధరలు మరింతగా పెరగనుంది.
దేశీయంగా రోజుకు 500 మిలియన్ లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయని, అయినప్పటికీ సుమారు 50 మిలియన్ లీటర్ల కొరత ఉంటున్నదని సదరు సంస్థలు గుర్తుచేస్తున్నాయి. ఈ సమస్యను అధిగమించాలంటే ఎస్‌ఎంపీ దిగుమతి ఒక్కటే మార్గమని లాక్టలీస్ ఇండియా సీఈవో రాహుల్ కుమార్ అన్నారు. లక్ష టన్నుల ఎస్‌ఎంపీ దిగుమతులు వెంటనే అవసరమన్న ఆయన ప్రైవేట్ డైరీలతోపాటు సహకార సంఘాలకు దీన్ని అందించాలని సూచించారు.
దేశంలో నెలకొన్న అతివృష్టి, అనావృష్టి, ఎండిపోతున్న జల వనరులు, ఆ తరువాత వరదలు.. డైరీ పరిశ్రమను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. నీరు, గడ్డి కొరతలతో పాల ఉత్పత్తి క్షీణించిందని పాల వ్యాపారులు చెప్తున్నారు. పెరిగిన ఉష్ణోగ్రతలతో అడుగంటిన భూగర్భ జలాలు పశువులకు నీటి ఎద్దడిని సృష్టించగా, ఆ తర్వాత కురిసిన భారీ వర్షాలతో పంట పొలాలు, పచ్చిక బైళ్లు నీట మునిగి గడ్డి లభించకుండా పోయిందని వెల్లడించారు. ముఖ్యంగా మొక్కజొన్న, చెరకు పంటలు పూర్తిగా దెబ్బతినడంతో పశువులకు గడ్డి లేకుండా పోయిందని, పాల ఉత్పత్తిని ఇది పెద్ద ఎత్తునే కుంగదీసిందని డైరీ యాజమాన్యాలు పేర్కొన్నాయి. అననుకూల వాతావరణ పరిస్థితులు పశువుల ఆరోగ్యంపైనా ప్రభావం చూపాయని క్రిసిల్ తెలిపింది.
గడిచిన 9 నెలలకుపైగా కాలంలో దేశవ్యాప్తంగా లీటర్ పాల ధర రూ.4-5 పెరిగింది. మార్కెట్‌లో క్రమేణా పెరుగుతూపోతున్న పాల ధరలకు కారణం ఉత్తరాది రాష్ర్టాల్లోని పరిస్థితులే. ఇవి మొత్తం దేశీయ పరిశ్రమనే ప్రభావితం చేస్తున్నాయి. తొలుత పాల ధరలను అముల్, మదర్ డైరీలు పెంచగా, మిగతా సంస్థలూ అదే బాట పట్టాయి. అంతకుముందుతో పోల్చితే నిరుడు ఏప్రిల్-డిసెంబర్‌లో దశాబ్దకాలంలో ఎన్నడూ లేనంతగా పాల సేకరణ ధరలు 19 శాతం పెరిగినట్లు గణాంకాలు చెప్తున్నాయి. వచ్చే నెలాఖరుదాకా ఇదే పరిస్థితి ఉండొచ్చని రేటింగ్స్, రిసెర్చ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేస్తున్నది.
రాబోయే ఎండా కాలంలో పాల ధరలు మరింతగా పెరుగడం ఖాయమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నీటి కొరత, పశువులకు ఆహార సమస్య.. ఉత్పత్తిని ఇంకా తగ్గించే వీలుందని, పెరిగే డిమాండ్‌తో ధరలు విజృంభిస్తాయని లాక్టలీస్ ఇండియా సీఈవో రాహుల్ హెచ్చరించారు.