గురు-శిష్యుల మధ్య విభేదాలు... ఇంద్రకరణ్ పై కోనప్పకు కోపం..!
posted on Mar 2, 2020 @ 2:29PM
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే కోనప్ప సంబంధాలు రోజురోజుకీ దిగజారుతున్నాయి. ఒకప్పుడు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాటను కోనప్ప వేదంగా భావించేవారు. కానీ, ప్రస్తుతం వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి విభేదాలు చేరాయి. ఒకప్పుడు ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశిస్తే తూచా తప్పకుండా పాటిస్తూ వచ్చిన కోనప్ప... ఇప్పుడు అస్సలు పట్టించుకోవడం లేదట. అంతేకాదు, తన నియోజకవర్గంలో ఏ కార్యక్రమం నిర్వహించినా, ఇంద్రకరణ్ రెడ్డితోనే ప్రారంభింపజేసే కోనప్ప... ఇప్పుడు మర్యాద కోసమైనా పిలవడం లేదని చెబుతున్నారు.
గురుశిష్యులుగా పేరున్న ఇంద్రకరణ్, కోనప్ప మధ్య టామ్ అండ్ జెర్రీ వార్ నడుస్తోందని అంటున్నారు. ఇద్దరూ ఎదురెదురుపడినా, కనీసం పలకరించుకోవడం లేదంటున్నారు. ఇద్దరి మధ్యా పార్టీ పెద్దలు సయోధ్య కుదిర్చినా పూడ్చలేనంతగా అగాధం పెరిగిపోతోందని అనుచరులు మాట్లాడుకుంటున్నారు. మొన్నటివరకు ఎంతో అనుబంధంగా కొనసాగిన వీరిద్దరూ ఇప్పుడు ఎడముఖం పెడముఖంగా ఉంటున్నారని అంటున్నారు. అయితే, వీళ్లిద్దరి మధ్య అగాధం ఏర్పడటానికి కోనప్ప తమ్ముడు క్రిష్టే కారణమంటున్నారు. కుమ్రుంభీమ్ జిల్లాలో అటవీ అధికారిపై జరిగిన గొడవే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే కోనప్ప సంబంధాలను దెబ్బతీసిందని అంటున్నారు. అటవీ అధికారిపై దాడి ఘటనలో తనకు అండగా నిలవలేదన్న కోపంతో ఇంద్రకరణ్ రెడ్డిపై కోనప్ప రగిలిపోతున్నారని చెబుతున్నారు.
మరోవైపు, రాష్ట్ర వన్యప్రాణి బోర్డులో సభ్యునిగా కోనప్పను సీఎం కేసీఆర్ నియమించడం కూడా గురు-శిష్యుల మధ్య అగాధానికి కారణమైందని అంటున్నారు. అటవీశాఖ మంత్రి ఉండే ఈ కమిటీలో, సభ్యునిగా నియమించడం వల్ల కోనప్ప పలుకుబడి పెరిగిందని అనుచరులు చెప్పుకుంటున్నారు. అయితే, అటవీ బోర్డులో కోనప్ప ఉండటం, ఇంద్రకరణ్‌కు అస్సలు ఇష్టంలేదన్న మాటలు వినపడ్తున్నాయి. ఇలా ప్రతి అంశంలోనూ మంత్రికి, కోనప్పకు మధ్య విభేదాలు ముదిరాయని చెబుతున్నారు. నిన్నమొన్నటివరకు ఎంతో అనుబంధంతో మెలిగిన గురు-శిష్యులు... ఇఫ్పుడు ఒకరిపై మరొకరు కస్సుబుస్సులాడుకోవడం చర్చనీయాంశమైంది.