నిర్భయ దోషులకు రేపే ఉరి... డిలే గేమ్ కు చెక్ పెట్టిన ఢిల్లీ కోర్టు

ఉరిశిక్ష అమలుపై నిర్భయ దోషులు ఆడుతోన్న డిలే గేమ్ కు ఢిల్లీ కోర్టు చెక్ పెట్టింది. న్యాయపరంగా తమకున్న అవకాశాలను ఉపయోగించుకుంటూ ఇప్పటికే రెండుసార్లు ఉరిశిక్ష అమలు జరగకుండా వాయిదాపడేలా చేసిన నిర్భయ దోషుల ఆటలు ఈసారి సాగలేదు. నిర్భయ దోషులను ఉరి తీయొద్దంటూ  దాఖలైన పిటిషన్ ను తిరస్కరించిన ఢిల్లీ కోర్టు... డెత్ వారెంట్ ప్రకారం మార్చి మూడున ఉదయం ఆరు గంటలకు నలుగురినీ ఉరి తీయాలని ఆదేశించింది.

ఉరిశిక్షను జీవితఖైదుగా మార్చాలంటూ నిర్భయ దోషి పవన్ గుప్తా పెట్టుకున్న క్యూరేటివ్ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అసలా పిటిషన్‌ విచారణకు ఎలాంటి కొత్త అంశాలు  లేవని ధర్మాసనం స్పష్టం చేసింది. అలాగే, తమ ఉరిశిక్ష అమలును నిలిపివేయాలంటూ నిర్భయ దోషులు చేసుకున్న అభ్యర్ధనను ఢిల్లీ పాటియాలా కోర్టు తిరస్కరించింది. దోషుల్లో ఒకడైన అక్షయ్ కుమార్ మరోసారి రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నాడు. తాను మరోసారి రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నందున ఉరిశిక్ష అమలుపై స్టే ఇవ్వాలంటూ ఢిల్లీ కోర్టును కోరాడు. అయితే, అక్షయ్ అభ్యర్ధనను ఢిల్లీ కోర్టు తిరస్కరించింది.

అయితే, దోషుల్లో ఒకడైన పవన్ గుప్తా తన చిట్టచివరి అవకాశాన్ని వినియోగించుకున్నాడు. ఉరిశిక్షను జీవితఖైదుగా మార్చాలంటూ దాఖలు చేసిన క్యురేటివ్ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో, చివరిగా రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నాడు. అయితే, డెత్ వారెంట్ ప్రకారం రేపు ( మార్చి 3న) నిర్భయ దోషులను ఒకేసారి ఉరి తీసేందుకు తీహార్ జైలు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Teluguone gnews banner