అగ్గిపెట్టె కోసం గ్యాంగ్ వార్.. ఒక్కరు మర్డర్
posted on May 24, 2021 @ 12:23PM
గొడవ చల్ గొడవ.. ఇది సినిమా లో సాంగ్. ఈ సినిమాలో చూపించినట్లు కొంత మంది ప్రతి చిన్న విషయానికి గొడవ పడుతుంటారు. రీజన్ ఏదైనా కావచ్చు ఫైట్ చెయ్యడమే వాళ్ళ పని, ఒక్క మాటలో చెప్పాలంటే అరవింద సామెత వీరరాఘవ సినిమాలో 5 రూపాయల ఫ్యాక్షన్ లాగ.. ఒక్కోసారి ఈ గొడవలు వల్ల చాలా పెద్ద నష్టాలకు దారితీస్తుంటాయి. 20 రూపాయల అప్పు అప్పు ఇవ్వలేదని, టీ కొట్టు టీ ఇవ్వలేదని, బిర్యానీ పొట్లం కోసం , బీర్ కోసం ఇలా చాలా సిల్లీ రీజన్స్ తో చివరికి దారుణమైన హత్యలకు దారితీస్తుంటాయి. మరి అగ్గిపెట్టె కోసం గ్యాంగ్ వార్ ఎప్పుడైనా చూశారా..? అయితే చూడండి..
అది ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా కావలి టూటౌన్ పరిధిలోని కచ్చేరిమిట్ట వద్ద ఉన్న కాలేజీ గ్రాండ్స్ కు ఆదివారం మధ్యాహ్నం కొంతమంది యువకులు మద్యం తాగి వచ్చారు. ఈ క్రమంలో ఓ వర్గానికి చెందిన జమీరుద్దీన్ అనే యువకుడు.. అక్కడే ఉన్న మరో గ్యాంగ్ వద్దకు వెళ్లి అగ్గిపెట్టే కావాలని అడిగాడు. దీంతో తమనే అగ్గిపెట్టె అడువుతావా అంటూ అవతలి గ్యాంగ్ జమీరుద్దీన్ తో వాగ్వాదానికి దిగింది. దీంతో రెండు వర్గాల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది.ఘర్షణ జరుగుతుండగానే జమీరుద్దీన్ ప్రత్యర్థి వర్గంలోని యువకులు బీర్ సీసాతో అతడిపై దాడి చేశారు. అంతేకాకుండా అతడి గొంతులో పొడిచారు. దీంతో జమీర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దాడిని అడ్డుకునేందుకు వెళ్లిన జమీర్ స్నేహితులు చంద్ర, పృథ్వీ కూడా గాయపడ్డారు. రెండు గ్రూపులు చాలా సేపు సవాళ్లు ప్రతిసవాళ్లు చేసుకోవడం, కొట్లాడుకోవడంతో తీవ్రఉద్రిక్తత చోటు చేసుకుంది.
ఘటనపై జమీరుద్దీన్ కుటుంబ సభ్యులు, స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు ప్రధాన కారకులుగా భావిస్తున్నరాహుల్, నిఖిల్ అనే యువకుల కోసం గాలిస్తున్నారు. ఐతే హత్యకు కారణం కేవలం అగ్గిపెట్టె కోసం జరిగిన గొడవేనా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఘటనాస్థలిలో దొరికిన ఆధారాలను, హత్యకు వాడిన బీరుసీసాను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
చేతికి అందివచ్చిన కొడుకు హత్యకు గురికావడంతో జమీరుద్దీన్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఎంబీఏ చదువుకున్న జమీర్.. ప్రస్తుతం జాబ్ కోసం చూస్తున్నాడు. అతడి తండ్రి గౌస్ మొహిద్దీన్ కావలి ఆర్టీసీ డిపోలో డ్రైవర్ గా పనిచేస్తున్నారు. క్షణికావేశం, పంతాలు, అధిపత్య ధోరణి వెరసి ఓ యువకుడి నిండుజీవితాన్ని బలితీసుకున్నాయి. అగ్గిపెట్ట దగ్గర వచ్చిన కొడవ ఓ కుటుంబానికి కొడుకును దూరం చేసింది.