టీడీపీ నేతల గృహ నిర్బంధం.. పోలీసు రాజ్యమన్న చంద్రబాబు
posted on May 24, 2021 @ 11:58AM
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా టీడీపీ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. కొవిడ్ కట్టడి, రోగులకు చికిత్స అందించడంలో జగన్ సర్కార్ విఫలమైందని ఆరోపిస్తున్న టీడీపీ.. కొవిడ్ బాధితులకు భరోసా కార్యక్రమానికి పిలుపునిచ్చింది. అన్ని జిల్లాల్లోని కొవిడ్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించేందుకు టీడీపీ నేతలు సిద్ధమయ్యారు. అయితే టీడీపీ నేతలను ముందుగానే ఎక్కడికక్కడ నిర్బంధించారు పోలీసులు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో టీడీపీ శాసన సభాపక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు, ఉంగుటూరులో ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, ఏలూరులో బడేటి రాధాకృష్ణ, దెందులూరులో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, కడప జిల్లా సింహాద్రిపురంలో ఎమ్మెల్సీ బీటెక్ రవి, ప్రొద్దుటూరులో సీనియర్ నేత లింగారెడ్డిలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. తమను వదిలేయాంటూ కొన్ని చోట్ల టీడీపీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తతలు తలెత్తాయి.
రాష్ట్రంలోని కరోనా రోగులకు ధైర్యం చెప్పి భరోసా నింపేందుకు ఆస్పత్రులను సందర్శించనున్న టీడీపీ నేతలను హౌస్ అరెస్టులు చేయడాన్ని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. సరైన వైద్యం అందక ప్రజలు చనిపోతున్నారని, ముఖ్యమంత్రి గడపదాటి బయటకు రారా? అని ప్రశ్నించారు. సీఎం జగన్ ఆస్పత్రులను ఎందుకు సందర్శించడం లేదని నిలదీశారు. ప్రజల ఆరోగ్యం పట్ల బాధ్యత లేదా? అని అన్నారు. ఏడాది నుంచి కరోనా విలయతాండవం చేస్తున్నా ఆరోగ్యరంగంలో మౌలిక సదుపాయాలు మెరుగు పర్చడానికి ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదని విమర్శించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు లేవని, 45 ఏళ్ళు నిండిన వారికి ఇంకా పూర్తి స్థాయిలో వ్యాక్షిన్ ఇవ్వలేదని ఆరోపించారు. నిరుపేద రోగుల నుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న ప్రవేట్ ఆస్పత్రులపై నియంత్రణ చర్యలు లేవని చంద్రబాబు దుయ్యబట్టారు.
ఏపీ సీఎం జగన్ ప్రతిపక్ష నాయకులపై కక్ష సాధింపు చర్యల్లో బిజీగా ఉన్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే జనార్ధన్‌రెడ్డి, ఇతర టీడీపీ నేతల అరెస్టులను ఖండిస్తున్నట్లు చెప్పారు. వారిపై బనాయించిన అక్రమ కేసులను ఉపసంహరించుకొని వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్ కొవిడ్ కట్టడిని వదిలేసి కక్ష సాధింపులకే పరిమితం అయ్యారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. టీడీపీ నేతలపై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం దుర్మార్గమన్నారు.