మన్సాస్‌లో రివేంజ్ పాలిటిక్స్!.. రాచక్రీడలో ఉద్యోగులు బలి?
posted on Jul 21, 2021 @ 5:23PM
రాజుల హయాంలో రారాజులా బతికారు. ద్రోహుల కాలంలో జీతాలకూ ఇబ్బంది పడుతున్నారు. అశోకుడి హయాంలో ఏ ఇబ్బందీ రాలేదు. సంచయిత రాకతో ఇక్కట్లు మొదలయ్యాయి. ఇది మన్సాస్ ట్రస్టులో కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలను చూస్తున్న వారి నుంచి వస్తున్న మాట. వందలాది మంది ఉద్యోగులు. వేలాది మందికి చదువులు చెప్పే ఉపాధ్యాయులు. అక్షర సేద్యం జరుగుతున్న మన్సాస్ విద్యాలయాల్లో ప్రస్తుతం ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనిది దాదాపు ఏడాదిన్నరగా మన్సాస్ ఉద్యోగులకు జీతాలు రావడం లేదంటున్నారు. రాజుల ఖజానాలో కాసులు లేక కాదు.. పాలకుల్లో చిత్తశుద్ధి లేక.
మన్సాస్ పీఠంపై అడ్డగోలు జీవోలతో సంచయితను తీసుకొచ్చి కూర్చోబెట్టింది.. ట్రస్టు పర్యవేక్షణ కోసం కాదు.. మన్సాస్ ఆస్తులను స్వాహా చేయడం కోసమనే ఆరోపణలు ఉన్నాయి. మన్సాస్‌కు ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఉన్న ఖరీదైన భూములను అడ్డంగా దోచుకునేందుకు.. తాడేపల్లి పెద్దలు ఆడిన గజపతుల ఆటలో సంచయిత ఓ పావు మాత్రమే అంటారు. అశోక్‌ను దెబ్బతీయడం, ట్రస్టు ఆధ్వర్యంలో భద్రంగా ఉన్న భూముల లెక్కల చిట్టా బయటకు తీయడమే లక్ష్యంగా ఈ రెండేళ్లు పావులు కదిపారని అంటున్నారు. ఎక్కడా, ఏ కోషానా మన్సాస్ ట్రస్టు ప్రాభవం కోసం పని చేయలేదనే విమర్శలు ఉన్నాయి. అసలు, మన్సాస్ కార్యక్రమాలను ఏమాత్రం పట్టించుకోలేదని.. అందుకే నెలల తరబడి ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేదని ఆరోపణలు ఉన్నాయి. కడుపు కాలిన ఆ ఉద్యోగులంతా ఇప్పుడు జీతాల కోసం ధర్నాలకు దిగుతున్నారు. కోర్టు ఆదేశాలతో.. మన్సాస్ పీఠం నుంచి సంచయిత వైదొలిగి.. అశోక్ గజపతిరాజు రావడంతో ఉద్యోగల్లో కాస్త ధైర్యం వచ్చింది. పాత రోజులు, మంచి రోజులు మళ్లీ వస్తాయనే ఆశ చిగురించింది.
సిబ్బంది ఒకలా తలిస్తే.. ప్రభుత్వం మరోలా ప్రతీకారం తీర్చుకుంటోంది. పెండింగ్ జీతాలు రిలీజ్ చేయాలంటూ.. ఇటీవల వందలాది మంది ఉద్యోగులు మన్సాస్ కార్యాలయాన్ని చుట్టుముట్టి.. ధర్నా చేశారు. ఉద్యోగుల కడుపుమంట.. మాజీ ఛైర్‌పర్సన్ సంచయితకు కళ్లమంటలా కనిపించింది. అశోక్ గజపతిరాజే మన్సాస్ సిబ్బందిని రెచ్చగొడుతున్నారంటూ ఆరోపించారు సంచయిత. మరోవైపు, జీతాల కోసం కార్యాలయాన్ని చుట్టుముట్టిన ఉద్యోగులపై కేసులు పెట్టడంతో మరింత కలకలం చెలరేగింది. జీతాలు ఆపడం, అడిగితే కేసులు పెట్టడమంతా.. ఎంపీ విజయసాయి డైరెక్షన్‌లో.. ఈవోతో ఆడిస్తున్న జగన్నాటకమనే ఆరోపణలు ఉన్నాయి.
మన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్‌గా ఉద్యోగులందరికీ వెంటనే జీతాలు విడుదల చేయాలంటూ అశోక్ గజపతిరాజు ఆదేశించారు. అకౌంట్‌లో డబ్బులు కూడా ఉన్నాయి. ఇక శాలరీ పడుతుందనగా.. మన్సాస్ ఈవో ఆ శాలరీ అకౌంట్‌ను ఫ్రీజ్ చేయించారని తెలుస్తోంది. ఉద్యోగుల జీతాలు ఆపేసి.. అశోక్‌కు సహాయ నిరాకరణ చేస్తున్న ఈవో వ్యవహార శైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాలకుల అడుగులకు ఈవో మడుగులు ఒత్తుతున్నారంటూ ఉద్యోగులు మండిపడుతున్నారు.
ఇన్నేళ్లలో సిబ్బంది జీతాల సమస్య ఇప్పటివరకు మాన్సాస్‌కి రాలేదని సంస్థ చైర్మన్ అశోక్ గజపతిరాజు ఆందోళన వ్యక్తం చేశారు. జీతాల చెల్లింపుని అధికారులు సమస్యగా భావించటం సరికాదన్నారు. సిబ్బంది లేకపోతే సంస్ధలకు మనుగడే ఉండదన్నారు. సిబ్బంది పనిచేసేది జీతాల కోసమేనని.. వారికి ఈవో ఇబ్బందులు కలిగించటం భావ్యం కాదన్నారు. జీతమడిగితే కేసులు పెడతారా? జీతం రాకపోతే ఈవో పనిచేయగలరా? అని మండిపడ్డారు మన్సాస్ చైర్మన్ అశోక్ గజపతిరాజు.
ఇలా, మన్సాస్ కేంద్రంగా జరుగుతున్న రాజకీయ క్రీడలో.. ఉద్యోగులు బలిపశువులుగా మారుతున్నారని అంటున్నారు. కోర్టు ఆదేశాలతో మళ్లీ మన్సాస్ పగ్గాలు చేపట్టిన అశోక్ గజపతిరాజును ఇబ్బందులకు గురి చేసేందుకు.. పాలకులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. మరి, ఈ రాజుల యుద్ధంలో గెలుపు, ఓటములు పక్కనపెడితే.. శిక్ష మాత్రం ఉద్యోగులకు పడుతుండటం ఆందోళనకర అంశం.