రోదసీలోకి తెలుగుమ్మాయి.. చరిత్ర స్పష్టించనున్న శిరీష
posted on Jul 11, 2021 @ 10:29AM
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన బండ్ల శిరీష సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. రాకేశ్ శర్మ, కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ తర్వాత రోదసీలోకి వెళ్తున్న నాలుగో భారత వ్యోమగామిగా, తొలి తెలుగు మహిళగా శిరీష నిలవనున్నారు.ప్రముఖ అంతరిక్ష సంస్థ వర్జిన్ గెలాక్టిక్‌కు చెందిన మానవ సహిత వ్యోమనౌక వీఎస్ఎస్ యూనిటీ-22 ద్వారా ఆమె రోదసీలోకి వెళ్లనున్నారు. వర్జిన్ గెలాక్టిక్ సంస్థకు చెందిన వీఎ్‌సఎస్ యూనిటీ వ్యోమనౌకలో ఆమె రోదసిలోకి దూసుకెళ్లనుంది.
ఈ వ్యోమనౌకలో వర్జిన్ గెలాక్టిక్ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్‌తో పాటు మరో ఐదుగురు వెళ్తుండగా అందులో 34 ఏళ్ల శిరీష కూడా ఉన్నారు. వ్యోమనౌకలో మానవ తీరుతెన్నులకు సంబంధించి ఫ్లోరిడా యూనివర్సిటీ రూపొందించిన ప్రయోగాన్ని శిరీష నిర్వహిస్తారు. శిరీష ప్రస్తుతం వర్జిన్ గెలాక్టిక్‌లో ప్రభుత్వ వ్యవహారాలు, పరిశోధన కార్యకలాపాల విభాగానికి ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు.అమెరికాలోని న్యూ మెక్సికో నుంచి ఈ ప్రయోగం ఉంటుందని వర్జిన్ గెలాక్టిక్ సంస్థ తెలిపింది.
న్యూ మెక్సికోలో వర్జిన్ గెలాక్టిక్ నిర్మించిన ‘స్పేస్‌పోర్టు అమెరికా’ నుంచి మొదలయ్యే అంతరిక్ష యాత్ర 90 నిమిషాలపాటు కొనసాగుతుంది. భూమి నుంచి 90 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకున్న వ్యోమనౌక భూమికి, రోదసీకి సరిహద్దుగా భావించే కర్మాన్ రేఖను దాటి వెళ్తుంది. ఇక్కడికి చేరిన వారిని వ్యోమగాములుగానే పరిగణిస్తారు. వ్యోమనౌక అక్కిడికి చేరాక అందులోని వారందరూ కొద్దిసేపు భార రహిత స్థితిని అనుభవిస్తారు. అనంతరం వ్యోమనౌక తిరిగి భూవాతావరణంలోకి ప్రవేశిస్తుంది. ఈ ప్రయోగం విజయం అనంతరం.. వచ్చే ఏడాది నుంచి ప్రైవేటు వ్యక్తులను అంతరిక్షంలోకి తీసుకెళ్లాలనేది వర్జిన్ సంస్థ యోచన.
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో జన్మించిన శిరీష.. హ్యూస్టన్‌లో పెరిగారు. ఇక్కడే విద్యనభ్యసించి ఏరోనాటికల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. వర్జిన్ గెలాక్టిక్‌లో ఈ ఏడాది జనవరి నుంచి ప్రభుత్వ వ్యవహారాలు-పరిశోధన కార్యకలాపాల విభాగానికి ఆమె ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బాల్యం నుంచీ వ్యోమగామి కావాలనుకున్న శిరీష, ఎట్టకేలకు తన కలను నెరవేర్చుకోనుండటం విశేషం. ఈ ప్రయాణంలో భాగస్వామ్యం కావడం తనకెంతో సంతోషంగా ఉందని శిరీష ట్విటర్‌లో పేర్కొన్నారు.