లోకేష్‌కి మంగళగిరిలో 60 వేల మెజారిటీ ఖాయం!
posted on May 21, 2024 @ 2:43PM
మంగళగిరిలో నారా లోకేష్ విక్టరీ పక్కా.. ఈ విషయంలో వైసీపీ వాళ్ళకి కూడా ఎలాంటి డౌట్ లేదు. ఈ ఎలక్షన్స్లో లోకేష్ మీద లావణ్య సంగతి అలా వుంచితే, మంగళగిరి స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా సాక్షాత్తూ జగన్ పోటీ చేసినా ఓడిపోవడం పక్కా. ఇక్కడ లోకేష్ విక్టరీ ఆ రేంజ్‌లో కన్ఫమ్ అయిందిమరి. ఇప్పుడు వైసీపీ వాళ్ళకి కావచ్చు.. బెట్టింగ్ రాయుళ్ళకి కావచ్చు.. వీళ్ళందరూ లోకేష్ గెలుస్తాడా.. లేదా అనే విషయాన్ని ఆలోచించడం లేదు.. లోకేష్ మెజారిటీ ఎంత వుండవచ్చు అనే దగ్గరే డిస్కషన్ మొదలవుతోంది. ఈసారి లోకేష్‌కి 60 వేల ఓట్ల మెజారిటీ పక్కా అని తెలుగు తమ్ముళ్ళు ఢంకా బజాయించి చెబుతుంటే, వైసీపీ సానుభూతిపరులు మాత్రం తమ అభ్యర్థి లావణ్య మీద సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. లోకేష్ గెలుస్తాడుగానీ, పాతికవేలకంటే ఎక్కువ మెజారిటీ రాదు అని ఉక్రోషంగా అంటున్నారు. ఇప్పుడు మంగళగిరిలో వైసీపీ వర్గాలందరూ లోకేష్‌కి ఎక్కువ మెజారిటీ రాదు అనే పాయింట్ దగ్గరే ఫిక్సయిపోయారు తప్ప.. లోకేష్ గెలవడు అనే మాట జోలికి మాత్రం వాళ్ళు వెళ్ళడం లేదు. గతంలో లావణ్య గెలుస్తుందని బెట్టింగ్‌లోకి దిగిన వాళ్ళు ప్రస్తుతం బెట్టింగ్ డబ్బు వెనక్కి తీసుకునే తంటాలు పడుతున్నారు. ఇప్పటి వరకు బెట్టింగ్ కట్టనివాళ్ళు బతుకుజీవుడా అని ఊపిరి పీల్చుకుంటున్నారు.
గత ఎలక్షన్లలో ఇదే మంగళగిరి నుంచి ఓడిపోయిన లోకేష్, పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలని బాగా నమ్మారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నియోజకవర్గ ప్రజలతో మమేకం అయ్యారు. వాళ్ళ అభిమానానికి పాత్రుడు అయ్యారు. అందుకే మంగళగిరి నియోజకవర్గం ఓటర్ల మీద నమ్మకంతోనే లోకేష్ మూడు నెలల క్రితమే తాను మంగళగిరి నుంచి 53 వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తానని ప్రకటించారు. అయితే, పోలింగ్ రోజు పోటెత్తిన ఓటర్లను చూసిన తర్వాత రాజకీయ పరిశీలకులు లోకేష్ మెజారిటీని 60 వేల ఓట్లకు పెంచేశారు. వైసీపీ వర్గాల మైండ్‌సెట్‌ని లోకేష్ మెజారిటీ గురించి మాత్రమే ఆలోచించేలా ఫిక్స్ చేశారు.