మనీష్ సిసోడియాకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు
posted on May 21, 2024 @ 3:07PM
అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ప్రభుత్వంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సీనియర్ నాయకుడు మనీష్ సిసోడియా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆర్థిక, విద్య, ప్రణాళిక, పట్టణాభివృద్ధి, రెవెన్యూ, సేవలు, స్థానిక సంస్థలు, భూమి & భవనాలు, ఉన్నత విద్య, శిక్షణ & సాంకేతిక విద్య, విజిలెన్స్, సహకార సంఘాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు ఇన్ఫర్మేషన్ & పబ్లిసిటీ వంటి అనేక ముఖ్యమైన విభాగాలకు సిసోడియా ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. ముఖ్యముగా, ఏ ఇతర మంత్రికి కేటాయించబడని అన్ని శాఖలను ఆయన పర్యవేక్షించారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ లభిస్తే సిసోడియాకు ఇంతవరకు బెయిల్ లభించడం లేదు. ఈ కేసులో అందరికంటే ముందే అరెస్ట్ అయిన సిసోడియాకు ఇప్పట్లో బెయిల్ లభించే అవకాశాలు లేవు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ హైకోర్టు ఈ నెల 31 వరకు పొడిగించింది. మద్యం కుంభకోణానికి సంబంధించి ఈడీ, సీబీఐ దాఖలు చేసిన మనీలాండరింగ్, అవినీతి కేసుల్లో ఆప్ నేత జ్యుడీషియల్ కస్టడీని మే 31 వరకు పొడిగిస్తూ ఢిల్లీ హైకోర్టు మంగళవారం తీర్పును వెల్లడించింది.
మనీశ్ సిసోడియా, సీబీఐ, ఈడీ తరఫున వాదనలు విన్న హైకోర్టు మే 14న పిటిషన్లపై తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. రెండు బెయిల్ పిటిషన్లపైనా న్యాయమూర్తి స్వర్ణ కాంత శర్మ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఈడీ, సీబీఐ మనీశ్ సిసోడియాను బెయిల్ పై విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తున్నాయి. కాగా, సిసోడియా ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో 2023 ఫిబ్రవరి నుంచి జ్యూడీషియల్ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే.