జంప్ జిలానీ మండలికి పదవులు, పార్టీ నేతలకు మొండి చెయ్యి
posted on Jun 21, 2014 @ 10:31AM
ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఉపసభాపతిగా తెలుగుదేశం రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు పేరు దాదాపు ఖరారు అయ్యిందని వార్తలు వచ్చాయి. కానీ ఎవరూ ఊహించని విధంగా ఆఖరు నిమిషంలో కనీసం పరిశీలనలో కూడా లేని మండలి బుద్ద ప్రసాద్ పేరును చంద్రబాబు ఖరారు చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. పార్టీకి చిరకాలంగా సేవ చేస్తున్న గొల్లపల్లి తదితరులను కాదని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో నుండి తెదేపాలోకి దూకి అవనిగడ్డ నుండి పార్టీ టికెట్ దక్కించుకొని గెలిచిన మండలి బుద్ద ప్రసాద్ కు ఉపసభాపతి వంటి కీలకమయిన పదవిని కేటాయించడంపై పార్టీలో పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆ పదవి ఆశించి భంగపడిన గొల్లపల్లి తదితరులు చంద్రబాబు నిర్ణయంతో మరింత అసంతృప్తి చెందడం సహజమే.
కాంగ్రెస్ పార్టీలో చిరకాలం కొనసాగిన మండలి బుద్ద ప్రసాద్ గతంలో తెదేపా ప్రభుత్వానికి వ్యతిరేఖంగా అనేక పోరాటాలు చేసారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నపుడు కేంద్ర, రాష్ట్ర స్థాయి నేతలు, మంత్రులతో సత్సబందాలు నిలుపుకొంటూ, ఎల్లపుడు ఏదో ఒక కీలక పదవిలో కొనసాగగలిగారు. కాంగ్రెస్ పార్టీలో అనేక ఉన్నత పదవులు అనుభవించిన ఆయన ఈసారి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘోరపరాజయం తప్పదని గ్రహించి తెదేపాలోకి దూకేశారు. పార్టీకి కష్టకాలంలో వెన్నంటి ఉన్న పార్టీ నేతలను కాదని అటువంటి వ్యక్తికి చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చారు.
అయితే ఆ సమయంలో ఎన్నికలలో విజయం సాధించడమే ఏకైక లక్ష్యంగా తెదేపా నేతలందరూ ముందుకు సాగుతున్నందున గెలుపు గుర్రంగా భావిస్తున్న మండలికి చంద్రబాబు టికెట్ కేటాయించడాన్ని పెద్దగా వ్యతిరేఖించలేదు. ఆవిధంగా తెదేపా నేతల సహకారంతో ఆయన అవనిగడ్డ నుండి టికెట్ దక్కించుకొని ఎన్నికలలో విజయం సాధించగలిగారు. కానీ ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ఆయన అదే రీతిలో పావులు కదిపి ఎవరూ ఊహించని విధంగా ఉపసభాపతి పదవిని దక్కించుకోవడంతో తెదేపా నేతలు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు.
కులసమీకరణాలలో భాగంగానే ఆయనకు ఉపసభాపతి పదవి ఇచ్చేమని తెదేపా చెపుతున్నప్పటికీ, ఆయన కులానికే చెందిన అనేకమంది తెదేపా నేతలను కాదని పార్టీలోకి కొత్తగా వచ్చిన ఆయనను చంద్రబాబు చంకనెక్కించుకోవడం కృష్ణా జిల్లా తెదేపా నేతలు, కార్యకర్తలు కూడా జీర్ణించుకోలేక పోతున్నారు. నామినేషన్ వేసిన తరువాత మండలి బుద్ద ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ “నేను తెదేపా పార్టీకి ఎటువంటి సేవలు చేయనప్పటికీ చంద్రబాబు ఇంత ఉదారంగా నాపై నమ్మకం ఉంచి ఇటువంటి కీలక బాధ్యతలు అప్పగించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను,” అని చెప్పడం పుండు మీద కారం చల్లినట్లే ఉంది.