జార్ఖండ్‌లో హిమాచల్ తరహా ప్రమాదం
posted on Jun 20, 2014 @ 7:33PM
హిమాచల్ ప్రదేశ్‌లో డ్యాం నీరు వదలడంతో 24 మంది తెలుగువారు మరణించిన పీడకలని దేశం ఇంకా మరువకముందే జార్ఖండ్ రాష్ట్రంలో హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన సంఘటన లాంటి సంఘటన మరొకటి జరిగింది. జార్ఖండ్‌లోని బొకారో జిల్లాలోని చంద్రపుర వద్ద దామోదర నదిలో నీరు తక్కువగా వున్న ప్రదేశంలో పదిమంది స్థానికులు స్నానం చేస్తుండగా తేనూఘాట్ డ్యామ్ నుంచి ఒక్కసారిగా నీరు విడుదలైంది. దాంతో స్నానం చేస్తున్న పదిమందీ నీటిలో కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది. అయితే వారి అదృష్టం బాగుండి నది మధ్యలో ఎత్తుగా వున్న రాయి మీదకి పదిమందీ చేరారు. చుట్టూ నది భయంకరంగా ప్రవహిస్తుంటే ఆ పదిమందీ ఒకచోట చేరి బిక్కుబిక్కుమంటూ సహాయం కోసం ఎదురుచూశారు. దీనిని స్థానికులు గమనించి అధికారులకు సమాచారం ఇవ్వడంతో అధికారులు డ్యామ్ సిబ్బందిని అప్రమత్తుల్ని చేశారు. దాంతో డ్యాం సిబ్బంది నీటిని నిలిపివేశారు. దాంతో నది ప్రవాహం ఒరవడి తగ్గింది. నీటి మధ్యలో వున్న పదిమందిని రక్షించడానికి అధికారులు చర్యలు చేపట్టారు. నీటి మధ్యలో చిక్కుకున్న పదిమందికి ప్రస్తుతానికి ఏ ప్రమాదమూ లేనట్టు తెలుస్తోంది.