విజ్ఞానజ్యోతి విద్యార్థులకు సంగీతాశ్రువులు!
posted on Jun 21, 2014 @ 11:15AM
హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన ప్రమాదంలో 23 మంది తెలుగు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడు మరణించిన సంఘటన తెలుగువారినే కాకుండా యావత్ భారతదేశ ప్రజలని కదిలించివేసింది. ఊహించని విధంగా క్షణాల్లో జరిగిపోయిన ఆ దుర్ఘటన అసలు జరక్కుండా వుంటే బాగుండని అనుకోనివారు లేరు. ఇదంతా ఒక కల అయితే బాగుంటుందని అనుకున్నవారూ ఎందరో వున్నారు. ఇలా అందరి మనసులలో వున్న ఈ ఆవేదనకు కొంతమంది యువతీ యువకులు మ్యూజిక్ ఆల్బమ్ రూపాన్నిచ్చారు. ‘వెలుగుతూ మొదలైన ఈ పయనమే.. వెలితిగా మా చెంతకు చేరెనే’ అంటూ సాగే పాటతో ఈ ఆల్బమ్ రూపొందింది. ఈ ఆల్బమ్ ప్రమాదంలో మరణించిన యువతరానికి నివాళులు అర్పించే విధంగా, తమ పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులను ఓదార్చే ప్రయత్నం చేసే విధంగా వుంది. ఈ మ్యూజిక్ ఆల్బమ్ రూపొందించాలన్న ఆలోచనతో తెలుగువన్‌ను ఈ యువతీ యువకులు సంప్రదించినప్పుడు వారిని అభినందించడంతోపాటు, వారికి కావలసిన సాంకేతిక సహకారాన్ని తెలుగువన్ అందించింది.