Read more!

ఎమ్మెల్సీగా మందకృష్ణ మాదిగ?

 

తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా దళితుణ్ణే చేస్తానని, లేకపోతే తల కోసుకుంటానని ఆవేశంగా చెప్పిన టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఆ తర్వాత ఎంచక్కా మాట తప్పి తెలంగాణ ముఖ్యమంత్రి పీఠం మీద సెటిలైపోయాడు. ఈ విషయంలో ఆయన మీద దళితులు విరుచుకుపడుతున్నారు. దళిత నాయకుడు మందకృష్ణ మాదిగ అయితే కేసీఆర్‌ మీద ఫైర్ అయినోడు ఫైర్ అయినట్టే వుంటాడు. అలాంటి మందకృష్ణ మాదిగకి ఎమ్మెల్సీ ఇస్తే దళితులకు దూరం కాకుండా వుండొచ్చని టీఆర్ఎస్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మందకృష్ణకి ఎమ్మెల్సీ ఇస్తే ఆయన ప్రశాంతంగా వుండటంతోపాటు తెలంగాణలో దళితులు కూడా సంతోషించే అవకాశం వుంది. మాట తప్పినందుకు తగిన పరిహారం చేసిన క్రెడిట్ కూడా కేసీఆర్ అకౌంట్లో పడే అవకాశం వుంది. త్వరలో గవర్నర్ కోటాలో తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయాల్సి వుంది. వాటిలో ఒక స్థానానికి తెలంగాణ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డిని ఎంపిక చేస్తారు. ఆయన ప్రస్తుతం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కాకుండానే మంత్రి పదవిలో వున్నారు. మిగిలిన ఒక్క స్థానం కోసం టీఆర్ఎస్‌లో భారీ స్థాయిలో పోటీ వుంది. ఎవరికి వారు ఆ ఒక్క స్థానాన్ని దక్కించుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రెండో ఎమ్మెల్సీ సీటు కోసం పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన ముఖ్య నాయకులు చాలా మంది పోటీపడుతున్నారు. సామాజికవర్గాల సమతూకం కోసం ఒకటి.. ‘రెడ్డి’ సామాజికవర్గానికి ఇస్తుండటంతో రెండోదాన్ని ఎస్సీలకు ఇవ్వాలని కేసీఆర్ సూత్రప్రాయంగా నిర్ణయించారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా దళితుడే ఉంటాడన్న కేసీఆర్ ప్రకటనను అనేకసార్లు ఉదహరిస్తూ మాటల దాడి చేస్తున్న మందకృష్ణ మాదిగను ఆ స్థానానికి ఎంపిక చేయడం ద్వారా దళితులను శాంతింపజేయాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.