సూరి హత్య కేసులో డ్రైవర్ మధు హస్తం?
posted on Dec 20, 2011 @ 9:54AM
హైదరాబాద్: మద్దెలచెర్వు సూరి హత్య కేసులో కారు డ్రైవర్‌గా ఉన్న మధుమోహన్ రెడ్డి హస్తం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మధుమోహన్ రెడ్డిది ప్రేక్షకపాత్రే అని ఇన్నాళ్లూ భావించిన దర్యాప్తు అధికారులు తాజా పరిణామాలతో కంగుతిన్నారని, సూరి హత్యకేసులో మధు మోహన్‌ను సాక్షిగానే ఇన్నాళ్లూ సీసీఎస్, సీఐడీ అధికారులు భావించారని ఓ ప్రముఖ తెలుగు దినపత్రి రాసింది. భాను సూరిని గన్‌తో కాల్చి చంపినట్లు అతడిచ్చిన సాక్ష్యమే కీలకమైంది. సూరి హత్య జరిగిన రోజు కారులో ఉన్నది సూరి, భాను, మధుమోహన్. ఆ రోజు కాల్పుల్లో సూరి మరణించగా, భాను అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. మధు మాత్రమే సుమారు మూడు నెలల వరకు పోలీసులకు అందుబాటులో ఉన్నాడు. కాగా, రియల్టర్ సుధీర్‌రెడ్డిని బెదిరించిన కేసులో మధుమోహన్‌రెడ్డికి బెయిల్ మంజూరైంది. బెయిల్‌పై 17వ అదనపు ఎంఎస్‌జే కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. సైఫాబాద్ బెదిరింపుల కేసులోనూ మధుమోహన్ బెయిల్ దరఖాస్తుపై వాదోపవాదాలు పూర్తికావడంతో తీర్పును మంగళవారానికి వాయిదా వేశారు.