Read more!

తలనొప్పికి, కంటికి ఉన్న లింకు ఇదే!

కంటి ఆస్పత్రికి వచ్చే రోగులను పరిశీలిస్తే ఎక్కువ మంది తలనొప్పితో వస్తారని తెలుస్తుంది.  అసలు తలనొప్పికి కారణమేమిటి ? తలనొప్పి ఉన్నప్పుడు కంటి ఆసుపత్రికి రావడం ఏంటి?? తలనొప్పికి కంటికి గల సంబంధం ఏమిటి?? చాలామందికి ఈ విషయాల గురించి తెలియదు.  వీటికి సంబంధించి విషయాలు తెలుసుకుంటే..


మనిషి శరీరంలో ఒక్కొక్క స్పర్శను తెలియ జేయడానికి ఒక్కొక్క నాడి వుంటుంది. నొప్పి, వేడి, చల్లదనం, రుచి, వాసన, దృష్టి మొదలైన వాటిని తెలిపే నాడులు మెదడులో ప్రత్యేకంగా వుంటాయి. శరీరంలో ఏ భాగంలో నొప్పి ఎక్కడ పుట్టినప్పటికీ, ఇది నాడీ మండల వ్యవస్థకు సంబంధించిన నొప్పేకాని ఇది వ్యాధి కాదు. ఇది వ్యాధిని సూచించే ఒక లక్షణం. మెదడులో నొప్పిని తెలిపే ఒక ప్రత్యేక నాడి వుంటుంది. దాన్ని ఉత్తేజిత పరిస్తే బాధ కలుగుతుంది. అయితే దాన్ని లేకుండా చేస్తే అసలు నొప్పి అనే ప్రశ్నే రాదు.


నొప్పితో మొదలైన వ్యాధులన్నీ తీవ్రమైనవి కావు. అదేవిధంగా నొప్పి లేని వ్యాధులన్నీ స్వల్పమైనవీ కావు. నొప్పి అనేది మనలను మేల్కొలుపుతుంది. శారీరకంగా మనం ఇబ్బంది పడేలా చేస్తుంది. వ్యాధి మనిషిలో అంతర్గతంగా ఉంటుంది. ఇది అంత తొందరగా బయటపడదు. కాని వ్యాధి కంటె నొప్పే ఎక్కువ బాధిస్తుంది. కాన్సరు రోగిని పరిశీలిస్తే, కాన్సరు గడ్డ కాని, పుండుకాని నొప్పి లేకుండానే బయలు దేరుతాయి. ఇది మొదలైనప్పుడు మనిషికి ఎలాంటి లక్షణాలు కనబడవు. ఇది కాస్త ముదిరిన తరువాతే శరీరాన్ని హింస పెట్టడం మొదలుపెడుతుంది.  కావున ఈవ్యాధిలో నొప్పి అనేది చాలా చివరి దశ.


అదేవిధంగా కుష్టు రోగిని పరిశీలిస్తే. అతని శరీరంలోని పలుచోట్ల గాయాలు, పుండ్లు ఏర్పడటానికి కారణం నొప్పి లేకపోవడమే. స్త్రీలైతే పొయ్యి మీద నుండి పాత్రలు దించేటప్పుడు కాల్చుకుంటారు. సిగరెట్లు పీల్చే వ్యక్తితే వేళ్ళపై పుండ్లు ఏర్పడతాయి. కాలుకి రాయి తగిలి గాయం ఏర్పడుతుంది. ఇవన్నీ సహజంగా అందరికీ  ఏర్పడే ప్రమాదాలే. 


ఈ సంధర్భాలలో నొప్పి వుండి వుంటే ముందుగా వైద్యుని సంప్రదించి తగిన చికిత్స పొందడానికి అవకాశం వుంది. నొప్పి అనేది ఒక అవసరమైన స్పర్శ. తలనొప్పిని తెలియ జేయడానికి ప్రత్యేక మైన నాడులు వున్నాయి. వాటిని ఉత్తేజింప జేయడం వలన తలనొప్పి ఏర్పడుతుంది. ఆ నాడుల పేర్లు - (ప్రైజెమినల్ నాడీ, సర్వైకల్ నాడులు). తలలో గాని, కంటి లో గాని మెదడులోగాని వ్యాధి ఏర్పడ్డప్పుడు ఈ నాడులు ఉత్తేజింప బడతాయి. తద్వారా మనకు తలనొప్పి ఏర్పడుతుంది. 


దూరదృష్టి, హ్రస్వ దృష్టి, అక్షలోపము, నేత్ర ద్వయ శక్తి లోపము, నేత్రద్వయ సమన్వయ లోపము, ఛత్వారము, నీటి కాసులు, రక్తపు పొర వాపు, గాజుపొర పుండు (మెల్ల), కంటిగూడు వాపు, కంటి నాడి వాపు, మొదలైనవి. తలనొప్పి కలిగించే కంటి వ్యాధులు.


కాబట్టి తలనొప్పి వచ్చినప్పుడు కంటి వైద్యుడిని సంప్రదిస్తారు. కంటి వైద్యులు కంటికి సంబంధించిన నాడుల కదలిక ఆధారంగా వ్యాధిని నిర్ణయించి తగిన పరిష్కారం సూచిస్తారు.


                                        ◆నిశ్శబ్ద.