వర్షాభావతో రైతులు విలవిల
posted on Jul 6, 2012 @ 2:29PM
రైతులపై వరుణదేవుడు పగబట్టాడు. గతేడాది నుండి ఇదేపరిస్దితి . చినుకులేక సేద్యం సాగక రైతన్నలకు ఏంచేయాలో పాలుబోవడం లేదు. జూన్ మొదటివారంలో మొదలవ్వాల్సిన ఖరీఫ్ సేద్యం ఇంతవరకు వర్షాలు లేక ప్రారంభంకాలేదు. అక్కడక్కడ కురిసిన వర్షాలకు తోడు వాతావరణశాఖ అందించిన భారీ వర్షసూచన సమాచారం మేరకు రైతులు వరుణదేవునిపై ఆశపెట్టుకుని వేసిన ప్రత్తి ఇతర పంటలు వర్షాలు పడకపోవడంతో ఎండిపోయి రైతులకు పెట్టుబడి వృదా అయింది. గత ఏడాది కూడా ఇదేపరిస్థితి కనిపించింది.
జూన్ ప్రారంభించవలసిన ఖరీఫ్ పంటలను జూలై, ఆగసు ్టవరకు వేశారు. అప్పటికి వర్షాలు అంతంత మాత్రంగా ఉండటం వల్ల మెట్ట ప్రాంతాల్లోనూ, ఏజన్సీ ప్రాంతాలలోనూ వరిపంట నీరు లేక ఎండిపోయింది. కరెంటు లేక బోరు బావుల కింద సాగే వ్యవసాయం కూడా దెబ్బతింది,దాంతో ధాన్యం దిగుమతి గణనీయంగా పడిపోయింది. గత ఏడాది కోస్తాంద్రలో క్రాఫ్ హాలిడే ప్రకటించడం వల్ల మరో లక్ష ఎకరాలు పంటకు నోచుకోలేదు. గత ఖరీఫ్‌సీజన్‌లో ప్రతి జిల్లాలో 120.2 మిల్లీ లీటర్ల వర్షం కురవాల్సివుండగా అందులో సగం కూడా ఏ జిల్లాలో నమోదు కాకపోవడం గమనార్హం. సెప్టెంబరు అక్టోబరులో పరిస్థితి కూడా ఇలాగే సాధారణ వర్షపాతం కంటే 70 శాతం తక్కువగా వుంది. దీంతో వరి తో పాటు మెట్ట పంటలు కూడా దెబ్బతిన్నాయి. మెట్టపంటలైన ప్రత్తి,మొక్కజొన్న, అపరాలు,కర్రపెండలం,మిరప వంటి వాణిజ్య పంటలు కూడా దెబ్బతినడంతో రైతులు అప్పుల బారిన పడ్డారు. ఈ సంవత్సరం కూడా వర్షాలు రాక రైతులు బిక్కుబిక్కుమంటున్నారు. ప్రభుత్వం రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.